
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమీక్ష చేయనుంది. సమన్వయ కమిటీ వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది.
ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం. చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న 15 అంశాలను అజెండాలో చేర్చారు.
రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను అజెండాలో చేర్చారు. విశాఖలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా సంస్ధ ఏర్పాటు, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు, ఆర్ అండ్ ఆర్‌తో సహా పోలవరం పూర్తి వ్యయాన్ని భరించడం తదితర అంశాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment