మాఫీ మాయ
► రుణమాఫీ అరకొరే..
► రైతన్నలకు శఠగోపం
► డ్వాక్రా మహిళలకు కుచ్చుటోిపీ
► మాటతప్పిన బాబు
► ఎన్నికల హామీలకు మంగళం
► మండిపడుతున్న జనం
అధికారమే జీవితంగా భావించే చంద్రబాబు దాని కోసం ఎన్ని మాయమాటలైనా చెబుతారని మరోమారు రుజువైంది. రుణమాఫీపై సోమవారం ఆయన వెల్లడించిన వివరాలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. తీరా అధికారం చేతికొచ్చాక ఏరుదాటాక తెప్పతగలేసినట్టు హామీలను విస్మరించారు. ‘నేను మారాను. నమ్మండి’ అని పదేపదే ప్రజలకు మొరపెట్టుకున్న బాబు తన చర్యల ద్వారా తాను వంచనబాబునే అని నిరూపించుకున్నారు.
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటతప్పారు. ఎన్నికల హామీలకు మంగళంపాడారు. అటు అన్నదాతలనూ,ఇటు తెలుగింటి ఆడపడుచులైన డ్వాక్రామహిళలను నిట్టనిలువునా ముంచారు. నమ్మించి ఓట్లేయించుకొని మోసగించారు. రుణమాఫీపై పదేపదే ఎన్నికల హామీలు గుప్పించిన చంద్రబాబు చివరకు మాటతప్పి రైతన్నలపై సవతి ప్రేమ చూపించారు. సోమవారం ప్రకటించిన రుణమాఫీతో ఆయన వంచన బట్టబయలైంది. ఎన్నికల సమయంలో రైతురుణాలన్నింటిని రద్దు చేస్తానని బాబు నమ్మబలికారు. ప్రతిరైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఉంటుందన్నారు. బంగారం రుణాలను సైతం మాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికారు. బ్యాంకులకు రుణాలు చెల్లించ వద్దంటూ రైతులను ఆయన రెచ్చగొట్టారు.
తనకు అధికారమిస్తే అన్నీ చేస్తానని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానని బాబు కల్లిబొల్లి మాటలు చెప్పారు. తాను పూర్తిగా మారానని, అన్నదాతల కష్టాలు తీరుస్తానని పదేపదే చెప్పారు. మహిళల కన్నీళ్లు తుడుస్తానన్నారు. చంద్రబాబు మాయలో పడి రైతులు,మహిళలు ఓట్లేసి టీడీపీకి అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రి కాగానే బాబుతీరు మారింది. రైతు,డ్వాక్రా రుణమాఫీపై పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముసలి కన్నీళ్లు కార్చారు.
చివరకు మాయమాటలతో అందరికీ కన్నీళ్లు మిగిల్చారు. కేవలం ఒక్కో కుటుంబానికి ఒక్కరైతుకు రూ.1.50 లక్షల రుణమాఫీ మాత్రమే చేస్తున్నట్లు సోమవారం ప్రకటించి అన్నదాతలను నిలువునా ముంచారు. ఎన్నికల సమయంలో రూ. 2 లక్షలు మాఫీ చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. బంగారం రుణాలు మాఫీలేదని మాటమార్చారు. మొత్తంగా రుణాలు పొందిన రైతుల్లో 50 శాతం మందికి కూడా రుణమాఫీ అందే పరిస్థితి లేకుండా పోయింది. అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
డ్వాక్రా మహిళలకు కుచ్చుటోపీ
డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా ముంచారు. రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్న బాబు ఇప్పుడు ఒక్కోసంఘానికి సంబంధించి కేవలం రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 70 శాతం సంఘాలకు ఒరిగిందేమీలేదు. డ్వాక్రాసంఘాలు మొదటి సారి ఏర్పడినపుడు మొదటి టర్మ్ కింద బ్యాంకులు రూ.50 వేలు రుణం ఇస్తాయి. అది చెల్లించగానే రెండో విడతలో రూ.లక్ష రుణం ఇస్తాయి. ఆ తర్వాత మూడో విడతలో రూ.3.5 లక్షలు, నాల్గో విడతలో రూ.5 లక్షలు రుణాన్ని బ్యాంకులు ఇస్తాయి. ప్రస్తుతం జిల్లాతో పాటు రాష్ట్రంలో అన్నీ సీనియర్ సంఘాలే. జిల్లాలో 34 వేల డ్వాక్రాగ్రూపులు ఉండగా,రాష్ట్రంలో 7 లక్షల పైచిలుకు ఉన్నాయి.
వీటిలో 70 శాతం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లోన్ తీసుకున్న సీనియర్ సంఘాలే. వీటికి ప్రస్తుతం రుణమాఫీతో ఒరిగేది శూన్యం. రూ.5లక్షల లోన్‌లో కేవలం రూ.లక్ష మాత్రమే రుణమాఫీ కింద రద్దు అవుతుంది. మిగిలిన రూ.4 లక్షలు బకాయిగానే మిగిలి పోనుంది. జిల్లాలో డ్వాక్రారుణాలు రూ.400 కోట్ల వరకూ ఉండగా చంద్రబాబు మోసపూరిత రుణమాఫీతో కేవలం 30 శాతం కూడా రుణమాఫీకింద జమయ్యే పరిస్థతి లేదు. దీంతో ఇటు మహిళలతో పాటు రైతన్నలు బాబు రుణమాఫీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని,బాబు తప్పుడు విధానాలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతుసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.