రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు
♦ అసలెవరు కడతారు బాబూ!
♦ గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో
♦ నేతల ఎదుట రైతులు, డ్వాక్రా మహిళల ఆవేదన
కడప అగ్రికల్చర్: ‘మా పార్టీ అధికారంలోకి రాగానే రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని...టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు రుణ మాఫీ చేసిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోలేదు.. బ్యాంకులకు అసలెవరు కడతారు’ అని పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలం టంగుటూరు. మైలవరం మండలం నవాబుపేట, చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎస్ అగ్రహారంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డి, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు ఓబులేసు మాట్లాడుతూ తాను బ్యాంకులో పంట రుణం రూ.లక్షన్నర తీసుకోగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణాన్ని వడ్డీతో సహా మాఫీ చేస్తామని చంద్రబాబు అనగానే ప్రాణం లేచి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చూస్తే వడ్డీకే సరిపోయిందని అసలు ఎప్పుడు చెల్లిస్తారయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుకు వెళితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదు తిరిగి రుణం ఎలా ఇస్తారనుకున్నావని వెనక్కు పంపిస్తున్నారని వాపోయాడు.
ఇదీ రుణమాఫీ తీరు అయ్యా! అంటూ అతను సీఎం చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. నందలూరు మండలం టంగుటూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచ్ కె నరసింహులు, పార్టీ మండల అధ్యక్షుడు సిద్దవరం గోపిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గడికోట వెంకటసుబ్బారెడ్డి, పార్టీ సలహామండలి సభ్యుడు దినేష్, పార్టీ జిల్లా పరిశీలకుడు సౌమిత్రి ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పాలన తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తులశమ్మ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చివరకు మూలధన నిధితో సరిపెట్టారని, అది కూడా మార్చుకోవడానికి వీలులేకుండా సంఘానికి వాడుకోవాలనే నిబంధనపెట్టి సంఘాలను ముంచారని సీఎం చంద్ర బాబుపై విరుచుకుపడ్డారు. మైలవరం మండలం నవాబు పేటలో జమ్మలమడుగు పార్టీ సమన్వయ కర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతురెడ్డి, దన్నవాడ మహేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు రామ్మోహన్‌రెడ్డి, రాముడు, సుధాకర్ ఎదుట గ్రామ రైతులు ఈ ప్రభుత్వంలో రైతులు బాగుపడే పరిస్థితులు లేవన్నారు. బీమా ఇవ్వరు, ఇన్‌పుట్ సబ్సిడీ అంతకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.