పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా! | Chandrababu political play with Schemes before the elections | Sakshi
Sakshi News home page

పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా!

Published Sun, Jan 27 2019 3:58 AM | Last Updated on Sun, Jan 27 2019 7:25 AM

Chandrababu political play with Schemes before the elections - Sakshi

నాలుగున్నర సంవత్సరాలలో డ్వాక్రా రుణమాఫీ కాలేదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పరిటాల సునీత ఇచ్చిన సమాధానం

ఎన్నికల ముంగిట ‘పసుపు–కుంకుమ’ పేరుతో మరోసారి మోసగించేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబును డ్వాక్రా మహిళలు ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారు. పదే పదే మోసం చేసే ఆయన్ను నమ్మం గాక నమ్మం అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయే దుస్థితికి కారణమైన చంద్రబాబు మోసాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 

గత ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక పైసా కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క డ్వాక్రా సంఘానికీ రుణాలను మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7వతేదీన మంత్రి పరిటాల సునీత లిఖిత పూర్వకంగా శాసనసభకు తెలిపారు. ఇది డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసినట్టు కాదా?

2014కి ముందు డ్వాక్రా సంఘాలు బ్యాంకులోతీసుకున్న రుణాలపై జీరో వడ్డీ పథకం అమలయ్యేది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక జీరో వడ్డీ పథకానికి బ్యాంకులకు డబ్బులు కట్టకపోవడంతో 2016 అక్టోబర్‌ నుంచి వడ్డీ డబ్బులు డ్వాక్రా మహిళలే చెల్లించుకుంటున్నారు. రూ.2,350 కోట్ల వడ్డీ డబ్బులను పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు అదనంగా కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇది మమ్మల్ని మీరు వంచించడం కాదా?

డ్వాక్రా మహిళలకు రూ.పది వేల చొప్పున ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం 2015 మే 16వతేదీన సర్క్యులర్‌ నెంబరు 21న జారీ చేయడం నిజం కాదా? ఆ సర్క్యులర్‌ను జారీ చేసి మూడున్నర ఏళ్లు దాటినా ఇచ్చేది అప్పు కాదు ఉచితమంటూ మరో ఉత్తర్వులు కానీ, సర్కులర్‌ కానీ ఇంతవరకు జారీ చేశారా?

ఇప్పుడు ఎన్నికలు రావడంతో మళ్లీ మమ్మల్ని మోసం చేయడాదనికి పసుపు– కుంకుమ పేరుతో డబ్బులిస్తానంటూ అది ఉచితమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా మమ్మల్ని మరోసారి మోసం చేయడానికి మీరు ఆడుతున్న నాటకం కాదా?

సాక్షి, అమరావతి: రుణమాఫీ హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళా సంఘాలను వంచించడం పట్ల అధికార టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఇదే సమయంలో వైఎస్సార్‌ సీపీ నవరత్నాల్లో భాగమైన వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామన్న వైఎస్‌ జగన్‌ భరోసాపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండడంతో టీడీపీ సర్కారు మరోసారి మభ్యపెట్టే కార్యక్రమాలను ఆరంభించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని వైఎస్‌ జగన్‌ నవరత్నాల హామీల్లో స్పష్టంగా చెప్పారు. సున్నా వడ్డీ డబ్బులను డ్వాక్రా అక్కచెల్లెమ్మల తరపున తామే బ్యాంకులకు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. దీనికితోడు 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగేళ్లలో ఒక్కొక్కరికీ రూ.75 వేల దాకా వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఉచితంగా ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా, జీరో వడ్డీకి రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు సరిగ్గా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే సమయానికి ఓట్ల కోసమే పసుపు– కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు డబ్బులిస్తామంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేసినట్లు పొదుపు సంఘాల మహిళలతో పాటు అధికారులు కూడా పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఇచ్చే ఆర్థిక సహాయం వినియోగానికి షరతులు విధిస్తూ 2015లో జారీచేసిన సర్క్యులర్‌ 

పసుపు–కుంకుమ పేరుతో వంచనే..!
పసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఎన్నికలు జరిగే తేదీలకు ముందుగా చెక్కులిచ్చి అప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని పేర్కొంటోంది. మరోపక్క రైతు రుణమాఫీ లాంటి పథకాలకే నాలుగు, ఐదో విడతలో చెల్లించాల్సిన డబ్బులను ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఇంకోవైపు ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన పసుపు– కుంకుమ పథకానికి రూ.9,400 కోట్లు దాకా అవసరం కాగా ఈ నిధులను ఎక్కడి నుంచి ఇస్తారనే విషయంపై ఏమాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement