సర్కారు మోసాలపై ఉద్యమం
మార్కాపురం: ఎన్నికల్లో గెలవడానికి రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేసే రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
శుక్రవారం రాత్రి స్థానిక కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఎవరి రుణాలు మాఫీ కాలేదన్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారని, రుణమాఫీ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25తేదీల్లో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒంగోలు వస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి:
జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రధాని పిలుపు మేరకు సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రంలో మొట్టమొదట తానే చొరవ చూపి గిద్దలూరు నియోజకవర్గంలోని దద్దవాడ గ్రామాన్ని ప్రకటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాబోయే నాలుగున్నర ఏళ్లలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎంపీ ప్రకటించారు.
మార్కాపురం, కంభం, గిద్దలూరు, తర్లుపాడు, దొనకొండ రైల్వేస్టేషన్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని, రైల్వే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారనే సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
25న మార్కాపురం నియోజకవర్గ సమీక్ష ఉంటుందని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తరువాత మొదటి నిధులను మార్కాపురం నియోజకవర్గానికి కేటాయించటం మరచిపోలేమన్నారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి, మార్కాపురం, పొదిలి ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.