ఆదుకోకపోగా..అదనపు భారం
- డ్వాక్రా మహిళల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
- 70 వేల మందికి అందని పెట్టుబడి నిధి
- రుణమాఫీ అమలుకాక పోవడంతో వడ్డీ భారం
- ఆందోళనలో మహిళలు
బేస్తవారిపేట : రుణమాఫీ చేసి ఆదుకుంటామన్నారు. నమ్మించి ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన మాటను మరిచారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల పుణ్యమా అని ఇప్పటికే రైతులు లబోదిబోమంటుండగా, తాజాగా డ్వాక్రా మహిళలు నష్టపోతున్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. ప్రస్తుతం వాటిని అమలుచేయకపోగా వడ్డీ భారం మోపుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలుచేయకపోవడంతో తీసుకున్న రుణాలు చెల్లించని కారణంగా వారికి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందకుండాపోయాయి. పైగా, తీసుకున్న రుణాలపై వడ్డీ పెరిగిపోయింది. వడ్డీతో సహా రుణాలు మొత్తం చెల్లించేంత వరకూ బ్యాంకుల్లో మహిళలు పొదుపు చేసుకున్న నగదు కూడా ఇవ్వమని బ్యాంకర్లు తేల్చి చెప్పారు.
అందకుండాపోయిన పెట్టుబడి నిధి...
ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి అందకుండా పోయింది. జిల్లాలో 49,237 మహిళా గ్రూపుల్లో 5 లక్షల మంది సభ్యులున్నారు. వారంతా పెట్టుబడి నిధి కోసం ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల జెరాక్స్ కాపీలను ఐకేపీ కార్యాలయాల్లో అందజేశారు. అయితే, 4.32 లక్షల మందికి చెందిన పత్రాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. మిగిలిన 70 వేల మందివి నమోదు కాకపోవడంతో వారికి మొదటి విడత డ్వాక్రా పెట్టుబడి నిధి అందకుండాపోయింది. 2014 మార్చి నెలకు ముందుగా రుణాలు పొందిన గ్రూపుల్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున మొదటి విడత పెట్టుబడి నిధిని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కానీ, ప్రతి గ్రూపులో ఇద్దరుముగ్గురికి ఆధార్‌కార్డులు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్న కారణంతో నగదు జమ కాలేదు. కొన్ని గ్రూపుల్లో పది మందికీ జమకాలేదు. బేస్తవారిపేట మండలంలో 929 గ్రూపులుండగా, 727 గ్రూపుల సభ్యులకు మాత్రమే నగదు జమైంది. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆధార్ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం వల్లే నగదు జమ కాలేదని తెలియడంతో గ్రూపు లీడర్లు, ఐకేపీ అధికారులను సభ్యులు నిలదీస్తున్నారు. అర్జీలు పట్టుకుని న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఐకేపీ అధికారులు, సిబ్బందికి ఆన్‌లైన్‌లో ఆధార్, ఇతర వివరాలు నమోదు చేయడంపై శిక్షణ ఇవ్వకపోవడంతో సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిసారించి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
పెరుగుతున్న వడ్డీ భారం...
తమ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాది దాటినప్పటికీ నేటికీ రుణమాఫీ అమలుకాకపోవడంతో మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీ పెరిగిపోతోంది. బాబు హామీతో మహిళలంతా రుణాలు చెల్లించకుండా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వడ్డీ పెరుగుతున్నప్పటికీ రుణమాఫీపై ప్రభుత్వం స్పందించకపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
1,433 మందికి నగదు జమకాలేదు
బేస్తవారిపేట మండలంలో 103 గ్రూపుల్లోని 1,433 మంది సభ్యులకు మొదటి విడత పెట్టుబడి నిధి నగదు జమకాలేదు. ఇప్పటి వరకు 890 మంది వివరాలను గ్రీవెన్స్‌లో సెర్ప్ వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. మిగిలిన మహిళల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయిందో..లేదో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
జయరాజ్, ఐకేపీ ఏపీఎం, బేస్తవారిపేట