రైతు రాజయ్యేనా?
⇒ అంతా అంకెల గారడీ గత ఏడాది కంటే
⇒ పెరిగింది రూ.1900 కోట్లే
⇒ ఇందులో వెయ్యికోట్లు ‘ఉపాధి’ నిధులు
⇒ రుణమాఫీ.. అదో అంతులేని కథ
సాక్షి, అమరావతి
రైతు సంక్షేమం – లాభసాటి వ్యవసాయం పేరిట 2017–18 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో రూ.18,214 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.3,600 కోట్లు, రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.3,300 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.6,040 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత మంత్రి ప్రత్తిపాటి ప్రవేశపెట్టిన నాలుగో వ్యవసాయ బడ్జెట్ (నూతన అసెంబ్లీలో తొలి బడ్జెట్)లో రైతన్న జీవితాలను స్వర్ణమయం చేయడమే ఆశయంగా ప్రకటించారు. గత కాలపు చీకటి చెదిరిపోయిందని, రైతుని రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అయితే ఏ ప్రత్యేకతా లేని వ్యవసాయ బడ్జెట్‌తో రైతులను ఎలా ఆదుకుంటారని ఈ రంగం నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బడ్జెట్ రూ.18,214 కోట్లలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రతిపాదించిన రూ.6,040 కోట్లు, రుణమాఫీకి ఇస్తామంటున్న రూ.3,600 కోట్లు, రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.3,300 కోట్లు పోగా మిగిలేది కేవలం రూ.5,274 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలైన ఉద్యానవన, పశు సంవర్థక శాఖలకు పంచాలి.
ఉద్యాన వన విభాగానికి రూ.1015 కోట్లు, పశు సంవర్థక, మత్స్య శాఖకు రూ.1238 కోట్లు, యూనివర్సిటీలకు రూ.512 కోట్లు పోతే వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు మిగిలేది కేవలం రూ.2,509 కోట్లు. ఈ మొత్తంతోనే విత్తనాలు, రెయిన్ గన్లు, పంటల బీమా ప్రీమియం, జీత భత్యాలు వంటివన్నీ చెల్లించాలి. అయినా సరే 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రైతును రాజు చేస్తామని, రెండంకెల అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పడం విడ్డూరమని నిపుణులు వ్యాఖ్యానించారు.
పెరిగింది ఉపాధి హామీ నిధులే...
2015 – 16లో రూ.14,184.03 కోట్లు, 2016 – 17లో రూ.16,250 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్ ఈసారి సుమారు మరో రెండు వేల కోట్లు పెరిగి రూ.18,214 కోట్లకు చేరింది. ప్రతి ఏటా 10, 12 శాతం పెంచి బడ్జెట్‌ను రూపొందించడం ఆనవాయితీ. చిత్రమేమిటంటే ఈ ఏడాది అదీ పెరిగినట్టు కనిపించలేదు. గత ఏడాది బడ్జెట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5,094.83 కోట్లు ఉంటే ఈ ఏడాది అవి రూ.6040 కోట్లకు చేరాయి. వాస్తవానికి ఈ నిధుల్లో 90 శాతం కేంద్రం నుంచి వస్తాయి. కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
అంటే గత ఏడాది కంటే పెరిగిన రూ.2 వేల కోట్లలో రూ.వెయ్యి కోట్లు కేంద్రం నుంచి వచ్చేవే. ప్రభుత్వం పెంచింది కేవలం రూ.9 వందల కోట్ల లోపే. గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రే నాలుగు రోజుల కిందట శాసనమండలిలో చెప్పారు. అయినా ఈ బడ్జెట్‌లో వారి ప్రస్తావనే లేకుండా పోయింది. బలవన్మరణాలకు పాల్పడే రైతు కుటుంబాలను ఆదుకుంటామన్న హామీ తప్ప ఎక్కడా బడ్జెట్ ప్రతిపాదనలు లేవు. కౌలు రైతుల ప్రస్తావన అసలే లేదు.
ఎన్నేళ్లయినా రూ.172 కోట్లేనా?
లక్ష రూపాయల లోపు పంట రుణం తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. అటువంటి పంట రుణాల కోసం ఈ ఏడాది రూ.172 కోట్లు, పావలా వడ్డీ (లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే)కి రూ.5 కోట్లు కేటాయించారు. ఈ రెండూ కలిపితే రూ.177 కోట్లవుతుంది. చిత్రమేమిటంటే గత ఏడాది ఈ రెండింటికీ కలిపి ఇదే మొత్తాన్ని ఇచ్చారు. 2014 – 15లో ఈ రెండింటికీ రూ.182 కోట్లు, 2016 – 17లో రూ.177 కోట్లు, 2017 – 18లోనూ రూ.177 కోట్లే కేటాయించడం గమనార్హం. గత తేడాది కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే ఖర్చు చేయడం ప్రభుత్వ తీరుకు, బ్యాంకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
⇔ వచ్చే మూడేళ్లలో ఉద్యాన వన పంటల విస్తీర్ణం ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి 35 శాతానికి పెంపు
⇔ 2017–18లో పీఎం కృషి సించాయి యోజన కింద రెండు లక్షల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం
⇔ 2022 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్
⇔ ఆహార ఉత్పత్తుల శుద్ధికి కార్పొరేట్ సంస్థలతోఒప్పందం
⇔ మామిడి, టమాటా, కొబ్బరి, మిరప పంటల వాల్యూచైన్ అభివృద్ధికి జైకా సంస్థతో చర్చలు
⇔ వచ్చే ఐదేళ్లలో చిన్న జీవాల అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం
⇔ గాలికుంటు రహిత రాష్ట్రంగా ఏపీ
⇔ జేకే ట్రస్ట్ సమన్వయంతో పునరుత్పత్తి టెక్నాలజీ అమలు
⇔ మరో 810 గ్రామాల్లో 45 పశు వైద్య కేంద్రాలు
⇔ దేశీయ పాడి పశువుల పెంపకానికి ప్రోత్సాహం
⇔ సముద్ర ఉత్పత్తులలో అగ్రగామి, ఆక్వా హబ్‌గా ఏపీ
⇔ రాష్ట్రంలోని పది వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఈ–ట్రేడింగ్
⇔ తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ అమలు
⇔ హైవోల్టేజీ పంపిణీ వ్యవస్థ పరిధిలోకి 56,699వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
⇔ నీటి ఎద్దడి నివారణకు 4.03 లక్షల నీటి కుంటల తవ్వకం
⇔ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.5,525 కోట్లను ప్రతిపాదించగా ఇందులో ప్రణాళిక వ్యయం రూ.1,170 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లుగా ఉంది.
⇔ ప్రకృతి సేద్యం, సేంద్రీయ సాగు పద్ధతులకు రూ.25 కోట్లు ప్రతిపాదించారు. వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు, పావలా వడ్డీ రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు.