ఆ ‘బాబు’.. నిండా ముంచాడు
మాఫీ అమలుపై రైతన్నల గగ్గోలు
(సాక్షి నెట్‌వర్క్): ‘‘నేను 80 వేల రూపాయల తీసుకుంటే వడ్డీ రూ. 13,721 అయింది. నాకున్న వేల రూపాయలు మాఫీ అవుతాయని చంద్రబాబుకు ఓటు వేసాను.. ఇప్పుడు మాఫీ అయ్యింది కేవలం రూ. 3,505 మాత్రమే. బాబు మమ్మల్ని నట్టేట ముంచేసాడు.. ఈ కాగితాలు పట్టుకొని ఎన్ని సార్లు బ్యాంకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరుగుతున్నానో దేవుడికే తెలుసు.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు సరికదా అడిగితే గసిరేసి పొమ్మంటున్నారు... ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాయణప్పవలసకు చెందిన రైతు గేదెల సూర్యనారాయణ ఆవేదన ఇది. ‘‘కౌలు రైతు అర్హత కార్డుతో రూ. 20 వేలు పంట రుణం, రూ. 1.35 లక్షలు బంగారు రుణం తీసుకున్నాను. రుణ మాఫీకి అవసరమయ్మే ఆధార్, గుర్తింపుకార్డులు ఇచ్చాను.
అయినా రుణమాఫీ వర్తించలేదు. పంటరుణం కట్టాలని బ్యాంక్ అదికారులు వత్తిడిచేస్తున్నారు. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రెండు అప్పులకు రూ. 1,88,300 అయ్యింది. ఈ అప్పులని ఎలా తీర్చాలో తెలియడంలేదు. చంద్రబాబు మాలాంటి పేదరైతులను పూర్తిగా ముంచేశాడు’’ తూర్పుగోదావరి జిల్లా కరప మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు గొర్రెల శ్రీనివాస్ అరణ్య రోదన ఇది. వీరే కాదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ రుణ మాఫీని నమ్ముకున్న లక్షలాది మంది రైతులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్న విషయం ‘సాక్షి నెట్‌వర్క్’ క్షేత్రస్థాయిలో చేపట్టిన కేస్ స్టడీస్ ప్రత్యక్ష పరిశీలనలో వెల్లడైంది. ఎన్నికల వేళ రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన మాటలు నమ్మి ఆయనకు ఓటేశామని.. తీరా ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, అదని, ఇదని మాఫీ అంతటినీ బోగస్‌గా మార్చేశారని లబోదిబోమంటున్నారు. మాఫీ మాటలు నమ్మిన తాము ఇప్పుడు వడ్డీ భారంతో కుంగిపోతున్నామని.. పాత అప్పులు తీరక.. కొత్త అప్పులు పుట్టక.. బ్యాంకుల్లో ‘డిఫాల్టర్లు’గా ముద్ర వేయించుకుని, బంగారు నగల వేలం నోటీసులతో పరువు పోగొట్టుకుని... వ్యవసాయం చేసే దారిలేక.. ఇల్లు గడిచే మార్గం తెలియక.. పిల్లల చదువులు ఏమైపోతాయో అర్థంకాక.. అల్లాడిపోతున్నారు.
మాఫీకి ఇచ్చింది రూ. 5 వేల కోట్లు..
రైతులపై వడ్డీ భారం రూ. 12,264 కోట్లు...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం అధికారిక లెక్కల ప్రకారం 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్‌లో మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటి పోయింది. తొలి సంతకం కోటయ్య కమిటీకే పరిమితమయ్యింది. ఆ తర్వాత వ్యవసాయ రుణాలు కాస్తా పంట రుణాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత రుణ మాఫీకి రూ. 1.5 లక్షల గరిష్ట పరిమితి అన్నారు. ఆపైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అర్హత కొలత విధించారు. మళ్లీ.. కుటుంబానికి ఒక్క రుణమే మాఫీ అన్నారు. దానికి రేషన్ కార్డు కావాలన్నారు.. ఆధార్ తప్పనిసరి అన్నారు.. పాస్‌బుక్కు లేకుంటే మాఫీ వర్తించదన్నారు. చివరికి ఆ మాఫీని కూడా ఐదు దఫాల్లో చెల్లిస్తామన్నారు. అదేమని ప్రశ్నిస్తే.. రూ. 50 వేల లోపు రుణాలున్న రైతులందరూ ఒకే దఫా రుణవిముక్తులవుతారని కంటి తుడుపు ప్రకటనలు ఇచ్చారు.
ఇలా రుణ మాఫీ హామీని నెరవేర్చడంలో కత్తెర్లు వేసుకుంటూ.. వేసుకుంటూ.. చివరకు కేటాయించింది రూ. 5,000 కోట్లు. ఈ లెక్కన రూ. 87,612 కోట్ల రుణం ఎప్పుడు మాఫీ అయ్యేను? మాఫీ అటుంచి చంద్రబాబు మాటలు నమ్మి సకాలంలో రుణాలు చెల్లించనందు వల్ల రాష్ట్ర రైతుల నెత్తిన అదనంగా రూ. 12,264 కోట్ల వడ్డీ భారం పడుతోంది. వ్యవసాయ రుణాలకు బ్యాంకర్లు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.
సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు కేంద్రం 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ కట్టి రైతుకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. ఇప్పుడు సకాలంలో అప్పు చెల్లించని కారణంగా రూ. 87,612 కోట్లకు 7 శాతం వడ్డీ రూ. 6,132 కోట్లు రైతులే చెల్లించాల్సి వస్తోంది. సంవత్సరం లోపు రుణం చెల్లించకపోతే ఆ రుణాలపై బ్యాంకర్లు 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో వ్యవసాయ రుణాలపై దాదాపు ఆరు నెలలుగా 14 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం మరో రూ. 6,132 కోట్లు అవుతోంది. ఈ వడ్డీ మొత్తం కలిపితే రూ. 12,264 కోట్లు అవుతుంది. రాష్ట్ర రైతులపై వడుతున్న వడ్డీ భారంలో సగం కూడా చంద్రబాబు రుణ మాఫీకి కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇళ్లకు వెళ్లింది. రుణ మాఫీ అమలైన తీరుపై అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం, చంద్రంపేటకు చెందిన బండారు అప్పలనాయుడు తీసుకున్న రూ. 50 వేల అప్పుకు గాను మాఫీ అయ్యింది అక్షరాలా మూడు రూపాయల పది పైసలు..’ కట్టాల్సిన వడ్డీ మాత్రం 5,300 రూపాయలు. ‘‘అప్పులు ఇవ్వడానికి బాంకోలికి ఇష్టం నేదు. మాకు అప్పు పుట్టదు. ఇప్పుడేం సేయాలి..?’’ అంటున్న అప్పల నాయుడుకు సమాధానం ఇచ్చేదెవరు?
చంద్రబాబు నాలికపై ఎన్ని స్కేళ్లో...
రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న సాము గారడీల్లో ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ఒకటి. ఎకరాకు ఏ పంటకు ఎంత మొత్తంలో అప్పు ఇవ్వవచ్చో తెలిపే సూచికే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’. ఎరువులు, పురుగు మందులు, సాగు ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ మొత్తాన్ని పెంచాలని అటు రైతు సంఘాలే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలూ బ్యాంకర్లను చాలా కాలంగా కోరుతున్నాయి. పంట రుణాలు మంజూరు చేసేటప్పుడు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ కన్నా 20 శాతం వరకు ఎక్కువ రుణం ఇచ్చే విచక్షణాధికారాలు స్థానిక బ్యాంక్ మేనేజర్లకు ఉంటాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిబంధనల్లో కూడా స్పష్టంగా ఉంది. వీటిని వేటినీ పరిగణలోకి తీసుకోకుండా.. చంద్రబాబు మాత్రం ‘స్కేల్ ఆఫ్ పైనాన్స్’ కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా ఒప్పుకోను అంటున్నాడు. రుణ మాఫీ భారం తగ్గించుకునేందుకు ఈ ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. రూ. 50 వేలు లోపు రుణాలున్న రైతులకు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ వర్తింప చేయబోమని చంద్రబాబు మీడియా సాక్షిగా చెప్పినా.. యధావిధిగా ఆ మాటలూ నీటిమూటలయ్యాయి.
రూ. 50 వేల లోపు రుణాల మాఫీకి కూడా ఐదేళ్లు...
విడతల వారీగా రైతు రుణాలను మాఫీ చేస్తామని అందులో భాగంగా తొలివిడతలో రూ. 50 వేల రుణాలను ఒకే దఫా మాఫీ చేస్తున్నామని చంద్రబాబు అట్టహాసంగా చేసిన ప్రకటన ఒక్క రైతు విషయంలోనూ నిజం కాలేదు. చంద్రబాబు రంగుల ఫొటోతో, సంతకంతో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ‘రుణ విముక్తి’ పత్రాల్లోనే ఈ విషయం తేటతెల్లమవుతోంది. నెల్లూరు జిల్లా కాశీపురం గ్రామానికి చెందిన కోటపూడి శ్రీనివాసులుకు రూ. 17,257.34 పైసలు రుణవిముక్తి కల్గిస్తున్నట్లు, మొదటి విడతలో రూ. 3,451.47 పైసలు అందిస్తున్నట్లు చంద్రబాబు సంతకంతో ఇచ్చిన ‘రుణ విముక్తి పత్రం’లో పేర్కొన్నారు. అంటే కనీసం రూ. 17,000 అప్పును కూడా చంద్రబాబు ప్రభుత్వం ఒకే దఫా మాఫీ చేయలేదు. విడతలుగా చేసే మాఫీ ఆ రైతు బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా చాలని పరిస్థితి. రైతుకు రుణమాఫీ ఎలా చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా, రుణమాఫీ భారాన్ని ఎలా తగ్గించాలన్న ధ్యేయంతోనే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ నిబంధనలేమీ లేకుండానే ‘‘మీ రుణాలన్నీ రద్దు చేస్తా.. ఆడపడుచుల నగలను బ్యాంకుల తనఖా నుంచి విడిపిస్తా.. మీ పెద్ద కొడుకుగా ఆదుకుంటా...’’ అన్న చంద్రబాబు.. ఈ రోజు బతికుండగానే తలకొరివి పెట్టే పెద్ద కొడుకయ్యాడంటూ.. రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
పేరు: బాల వెంకటేష్ (6.30 ఎకరాలు)
ఊరు: కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కలచట్ల గ్రామం
రుణం: రూ. 50,000
మాఫీ: రూ. 556
ఎమ్మార్వో, బ్యాంకు చుట్టూ తిరిగినా...
‘‘నాకు 6 ఎకరాల 30 సెంట్ల పొలం ఉంది. ఒక్కటే పాసు బుక్కు. ఇందులో మొత్తం నాలుగు బిట్లు ఉన్నాయి. సర్వే నంబర్లు వేర్వేరు. ఒక బిట్టులో 24 సెంట్ల స్థలం ఉంది. ఇంకో బిట్టు 4 ఎకరాల 56 సెంట్లు, మూడో బిట్టు 64 సెంట్లు. ఇంక నాలుగో బిట్టు 86 సెంట్ల స్థలం. ఈ నాలుగు బిట్లు కలిపి ఒక్కటే పాసు బుక్కు ఉంది. ఈ పాసు బుక్కును పెడితేనే స్టేట్ బ్యాంకులో రూ. 50,000 రుణం ఇచ్చిండు. ఇప్పుడు మాఫీ రూ. 556 మాత్రమే అయ్యిందని అంటున్నారు. మొదటి బిట్లు 24 సెంట్లది మాత్రమే చేసుకుని రూ. 556 మాఫీ చేసినారని బ్యాంకోల్లు అంటున్నారు. లెక్క తప్పుకట్టినాడు అని బ్యాంకోల్లే అంటున్నారు. ఎమ్మార్వోను కలిశాను. ‘‘సర్వే నంబరు తప్పు ఉండి... ఇన్సియల్ తప్పు ఉంటే సరిచేస్తాము. కానీ ఎంత లోను తీసుకున్నది బ్యాంకోల్లను అడగండి’’ అని ఎమ్మార్వో అంటున్నారు. పది రోజుల నుంచి ఎమ్మార్వో ఆఫీసు, బ్యాంకు చుట్టూ తిరిగినా ఏమీ కాలేదు.’’
పేరు: శీలం వరప్రసాదరెడ్డి (16 ఎకరాలు)
ఊరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం
రుణం: రూ. 1,00,000, వడ్డీ: రూ. 10,000
మాఫీ: రూ. 171
పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి...
నాకు ఉన్న రుణ అర్హత కంటే తక్కువ రుణం తీసుకున్నాను. రెండు బ్యాంకుల్లో రూ. 2.10 లక్షలు తీసుకున్నాను. ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతుల అప్పులన్నీ మాఫీ చేస్తానంటే పంట చేతికి రాకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశపడ్డాను. రెండు బ్యాంకుల్లో కలిపి రూ. 1.50 లక్షలు మాఫీ అవుతుందనుకున్నాను. తీరా రుణ మాఫీ జాభితా వచ్చాక రూ. 171 మాఫీ అయ్యింది.
పేరు: తమ్మా ఉమామహేశ్వరరెడ్డి (1.25 ఎకరాలు)
ఊరు: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చివలూరు
రుణం: రూ. 2,63,400
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు
మాఫీకి అర్హత లేదన్నారు
‘‘ఉద్యోగ విరమణ అనంతరం సాగు చేసుకుంటున్నాను. 2013 సెప్టెబంరులో కొల్లిపర సెంట్రల్ బ్యాంకులో 1.25 ఎకరాలు తాకట్టు పెట్టి వరి పంట కోసం రూ. 1.90 లక్షలు రుణం తీసుకున్నాను. అలాగే 2013 మార్చిలో జీడీసీసీ బ్యాంకులో మొక్కజొన్న కోసం రూ. 73,400 రుణం తీసుకున్నా. జీడీసీసీ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆధార్, రేషను కార్డు వివరాలు నమోదయ్యాయి. రేషన్‌కార్డు జత కాలేదని చెబుతున్నారు. ఇలా అర్హత కోల్పోయా.
పేరు: హరిబాబు (4 ఎకరాలు)
ఊరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లి
పంట రుణం: రూ. 43,000,
రుణంపై వడ్డీ: రూ. 15,216, మాఫీ: రూ. 12,500
నమ్మించి నట్టేట ముంచాడు
‘‘మీ పెద్దకొడుకులా రుణం మాఫీ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు, బంగారు ఆభరణాలు మీ ఇంటికి తెచ్చిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. రుణాలు మాఫీ అయితే మా జీవితాలు బాగుపడతాయని మేమంతా ఓట్లు వేశాం. నమ్మించి నట్టేట ముంచినాడు. అసలు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటో నాకు తెలియదు. రుణం వెంటనే కట్టకపోతే నోటీసులు పంపుతామని బ్యాంకు వాళ్లు చెప్పారు. మళ్లీ ప్రైవేటుగా అప్పు తీసుకున్నా.
పేరు: నింగన్న (5 ఎకరాలు)
ఊరు: అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డ గ్రామం,
రుణం: రూ. 99,000
మాఫీ: రూ. 1,939
అదేందో నాకు తెలీదు.. ఇంత ఘోరమా?!
‘‘టీడీపీ ప్రభుత్వం వస్తే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని చంద్రబాబు ప్రకటించగానే చాలా సంతోషపడ్డా! ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతీ కుటుంబానికి 1.50 లక్షల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానన్నారు. నాకు 99 వేలు అప్పు ఉంది, నా రుణం మాఫీ అవుతుందని చాల్లే అనుకున్నా! బ్యాంకుకు వెళ్లాను. నీ పేరుతో నాలుగైదు సర్వే నెంబర్లలో పొలం ఉంది. ఒక్క సర్వే నెంబరును మాత్రమే పరిగణలోకి తీసుకున్నామన్నారు.
పేరు: బండారు అప్పలనాయుడు (2.63 ఎకరాలు)
ఊరు: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట
రుణం: రూ. 50,000, వడ్డీ: రూ. 5,300, మాఫీ: రూ. 3.10
ఇలా తోక కోసేత్తాడని అనుకోలేదు...
‘‘నాది మూడెకరాల వ్యవసాయం. నక్కిడాం బేంకులో కిందటేడాది 2.63 ఎకరాల పట్టా పుస్తకాలు మీద రూ. 50 వేలు లోను తీసుకున్నా. బంగారం పెట్టి రూ.43 వేలు తీసుకున్నా. చంద్రబాబు విజయనగరం వచ్చి ప్రజాగర్జన సభలో రైతులెవ్వరు అప్పు కట్టద్దొన్నారండి. మీ అప్పులన్నీ మాపీ సేత్తామన్నారు. అందరిలాగే నాకూ రుణమాఫీ అవుతుందని ఆశపడి బేంకుకు ఎల్తే 50 వేలకీ 3.10 పైసలు మాపీ అయిందని లెక్క రాశారు. ఇదెంత గోరం? సెప్పండి? వడ్డీయే 5,300 రూపాయలయింది. ఇళ్లింటి పాది ఓటేసాం. ఇంత గోరం నేనెక్కడా సూడనేదు. ఇలా అందరికీ తోక కోసేత్తాడని అనుకోలేదు.
పేరు: బాషా (1.55 ఎకరాలు)
ఊరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామం
రుణం: రూ. 99,000, మాఫీ: రూ. 3,300
రోజుకో మాట చెప్పి మాయ చేస్తున్నాడు...
‘‘ఇదేందని అడిగితే.. ఏదో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంట. దీని ప్రకారం నాకు వచ్చే లోను కేవలం రూ. 16,500 అంట. ఇందులో 20 శాతమే మాఫీ చేస్తమని అంటున్నరు. నాకు కేవలం రూ. 3,300 మాఫీ అయితదని అంటున్నారు. రుణాలన్నీ మాఫీ అవుతాయనుకున్నాం. ఎన్నికల ముందు కూడా అన్ని రుణాలు మాఫీ చేస్తమని చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు రోజుకో మాట చెప్పి మాయ చేస్తున్నాడు. ఈ రుణం పోయేదాకా కొత్త అప్పు ఇయ్యమని బ్యాంకు సారు అంటున్నాడు.’
పేరు: అక్కులగారి పెద్దరాజా
ఊరు: వైఎస్‌ఆర్ జిల్లా తొతండూరు మండలం మల్లేల గ్రామం
రుణం: రూ. 49,000, వడ్డీ: 000, మాఫీ: 0
ఇంతవరకు ఏమిపోలేదు...
‘‘నేను తొండూరు ఏపీజీ బ్యాంకులో 49 ఏలు అప్పు తీసుకున్నా.. పులిందల ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు తాకట్లు పెట్టి నా పాసు బుక్కుపై 80 ఏలు లుణం తీసుకున్నా. తొండూరు బ్యాంకులోనేమో 8 ఏలు రుణ మాఫీ పోయిందంటున్నారు. నాకేమో చదువులేదు. వేరేవాళ్లను అడుగుతుంటే పోయిందంటారు కానీ.. ఇంతవరకు ఏమీపోలేదు. ఓట్లేసినందుకు బాబు బాగా బుద్ది చెప్పినాడు. పులిందల బ్యాంకి సార్లేమో.. నీ బంగారు తాకట్టు ఎడుతున్నాం వచ్చి రెన్యువల్ చేసుకో అంటారు. అగచాట్లు పడి 80 ఏలు కడితే రెన్యువల్ చేశాక 90 ఏలు మంజూరు చేశారు. వడ్డీ ఐదేలు పోను.. 85 ఏలు ఇచ్చినారు.’’
పేరు: రాంబాబు (2 ఎకరాలు)
ఊరు: కృష్ణా జిల్లా పెడన మండలం గురువిందగుంట
రుణం: రూ. 66,266 , వడ్డీ: రూ. 3,734
మాఫీ: రూ. 7,194
అప్పో సప్పో చేసి కట్టుకోవాలి
‘‘నాకు రూ. 38 వేల వరకు రుణ మాఫీ వర్తించినట్లు చూపారు. మొదటి విడత రూ. 7,194.59 బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్లు చూపించారు. బ్యాంకుకు వెళితే రుణ మాఫీ నగదు రాలేదని చెప్పారు. రెండో పంటకు రుణం ఇవ్వలేదు. ఐదేళ్ల పాటు రూ. 7194.59 జమ చేస్తే 70 వేల అప్పుకు వడ్డీ కిందే సరిపోతుంది. రైతుకు ఏమీ ప్రయోజనం లేదు. ఇక అప్పో సప్పో చేసి మొత్తం మేం కట్టుకోవాల్సిందే’’
పేరు: కోట్లపూడి శ్రీనివాసులు (4 ఎకరాలు)
ఊరు: నెల్లూరు జిల్లా కాశీపురం గ్రామం
రుణం: రూ. 1,23,000, వడ్డీ: రూ. 5,000
మాఫీ: రూ. 3,451
మాఫీ బోగస్‌లా ఉంది...
‘‘ఉన్న 1.5 ఎకరాల పొలం పాసు పుస్తకాలను తాకట్టు పెడితే రూ. 25 వేలు లోను ఇచ్చారు. మరి కొంత అప్పుచేసి వరి మడి నాటాను. దోమ పోటుతో మొత్తం పంటంతా పోయింది. అప్పంతా అట్టే ఉండిపోయింది. తిండిక్కూడా గింజ దొరకలేదు. నా భార్య, నేను కూలికెళ్లి రేషన్ బియ్యం కొనుక్కుని ఇద్దరు పిల్లలు కడుపు నింపుకుంటున్నాం. ఇక బంగారంపై తీసుకున్న అప్పు, వడ్డీ రూ. 1,03,000 ఉంది. చంద్రబాబు చేసిన మాఫీ వల్ల ఏం లాభం?