హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీపై కలెక్టర్లకు కూడా స్పష్టత ఇవ్వలేదు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రుణమాఫీని వీలైనంత త్వరగా అమలు చేస్తామని తెలిపారు. వనరుల సమీకరణ కోసం కమిటీ వేశామని చెప్పారు. ఒకో కుటుంబానికి లక్షన్నర రుణమాఫీ చేస్తామని బాబు పేర్కొన్నారు. బ్యాంకులో ఉన్న అకౌంట్లను కంప్యూటరీకరణ చేస్తామని ఆయన తెలిపారు.
రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు అయితే వాటిని కూడా గుర్తిస్తామన్నారు. రాష్ట్రానికి రూ.15, 900కోట్ల రెవెన్యూ లోటు ఉందని, ఆదాయం కూడా జనాభా శాతం కంటే తక్కువగా వస్తుందని ఈ సమావేశంలో చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల మండల స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు.