గుంటూరు: రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రకరకాల సాకులతో కాలయాపన చేస్తుండటంతో బ్యాంకర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని నోటీసులు జారీ చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రుణమాఫీ అవటంతో రైతులు పండుగ చేసుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ మంత్రులు ఇప్పుడేం సమాధానం చెబుతారని అన్నివర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత నెల 26న నోటీసులందుకున్న పెదనందిపాడు మండలం వరగాని గ్రామస్తులు సోమవారం ఎస్‌బీఐ శాఖ ముందు ధర్నాకు దిగారు. ఇక సోమవారం నోటీసులందుకున్న మంగళగిరి మండలం నిడమర్రు రైతులు తీవ్ర కలవరానికి గురయ్యూరు.
పెదనందిపాడు
బంగారంపై తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ఓవైపు ప్రకటనలు చేస్తున్నా.. సొమ్ము కట్టాల్సిందేనని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరే దారిలేక రోడ్డెక్కుతున్నారు. తాజాగా సోమవారం వరగాని గ్రామంలోని స్టేట్‌బ్యాంక్ శాఖ ముందు పలువురు మహిళలు, రైతులు ధర్నాకు దిగారు. నోటీసులు ఇవ్వటంపై బ్యాంక్ మేనేజర్‌ను నిలదీశారు. వివరాలు.. బంగారంపై రుణం తీసుకున్న 44 మంది వరగాని గ్రామస్తులకు గత నెల 26న ఎస్‌బీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 2వ తేదీలోగా రుణాలు చెల్లించకపోతే 11వ తేదీన బంగారాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. దీంతో ఆందోళన చెందిన లబ్ధిదారులు సోమవారం బ్యాంకు శాఖ ముందు ధర్నా చేశారు.
మేనేజర్ వి.కృష్ణమూర్తి చాంబర్‌లోకి వెళ్లి ఆయన్ను నిలదీశారు. బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే ఇలా నోటీసులు జారీ చేయటమేమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం తీసుకుని మూడేళ్లు గడిచినవారికి నోటీసులు ఇచ్చామని మేనేజర్ చెప్పారు. రుణం చెల్లించకపోతే బంగారం వేలం వేయకతప్పదని స్పష్టం చేశారు. ఏడాది దాటాక రుణం చెల్లిస్తే నాలుగు శాతానికి బదులు 12 శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ధర్నాలో పి.వెంకటప్పయ్య, యర్రం రామ్మోహనరావు, జి.నాని, కొల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికిప్పుడు ఎలా కట్టేది..?.. ఈ సందర్భంగా వరగాని రైతు గల్లా సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ బంగారంపై తాను రూ.17 వేలు తీసుకోగా వడ్డీతో కలిపి రూ.22,600 అరుుందని.. ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎక్కడ నుంచి తేవాలని వాపోయూరు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదురుచూస్తుంటే ఈ సమస్య వచ్చిపడిందన్నారు. 11న వేలం జరిగితే బంగారం దక్కదేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వేలం నోటీసులపై ఆందోళన
Published Tue, Aug 5 2014 1:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement