సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది.
రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే..
రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి.
ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది.
కొనుగోలుదారులకు నష్టం జరగకుండా..
కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది.
కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment