Real Estate Project
-
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
రియల్టీలోకి తగ్గిన పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రాక మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తక్కువగా 1.18 బిలియన్ డాలర్ల (రూ.9,086 కోట్లు) పెట్టుబడులు వచ్చినట్టు రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 2021 మొదటి మూడు నెలల్లో రియల్టీకి వచ్చిన పీఈ పెట్టుబడులు రూ.3.08 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. కార్యాలయం విభాగంలో పీఈ పెట్టుబడులు 732 మిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కార్యాలయ విభాగంలోకి 2,148 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస విభాగంలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 234 మిలియన్ డాలర్ల నుంచి 73 మిలియన్ డాలర్లకు తగ్గాయి. రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 484 మిలియన్ డాలర్ల నుంచి 253 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. 2021 పూర్తి ఏడాదికి రియల్టీలోకి వచ్చిన పీఈ పెట్టుబడులు 6,199 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. -
స్థిరాస్తి ప్రాజెక్టులపై ‘రెరా’ కన్ను
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది. రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే.. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి. ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారులకు నష్టం జరగకుండా.. కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది. -
రియల్టీకి టీఎస్–ఐపాస్ తరహా పాలసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరాస్తి రంగ ప్రాజెక్ట్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేందు కు టీఎస్–ఐపాస్ తరహాలో ప్రత్యేక పాలసీని తీసుకురావాల్సిన అవసరముందని జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవకాశాలపై అధ్యయన నివేదికను విడుదల చేశాయి. ‘‘తెలంగాణ జీస్డీపీలో స్థిరాస్తి రంగం వాటా 13 శాతం. రాష్ట్రానికి ఆదాయంతో పాటూ ఉద్యోగ అవకాశాలనూ కల్పిం చే స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని కేవలం పాలసీలతో సరిపెట్టకుండా వాటి అమలు, రాయితీల మీద దృష్టిసారించాలని’’ జేఎల్ఎల్ హైదరాబాద్ ఎండీ సందీప్ పట్నాయక్ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేయకుండా త్వరితగతిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాలని కోరారు. నాణ్యమైన నిర్మాణాలు చేసే డెవలపర్లకు ప్రోత్సాహకంగా పన్ను రాయితీలను కల్పించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిటైల్, కమర్షియల్ నిర్మాణాల ఎత్తులో నియంత్రణలను సవరించాలని సూచించారు. -
ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా!
• ఎస్క్రో అకౌంట్ ఉండాలంటున్న స్థిరాస్తి నియంత్రణ బిల్లు • నిధుల పక్కదారికి చాన్సే లేదు; దీంతో సకాలంలో నిర్మాణం పూర్తి • కానీ, నగరంలో ఖాతా నిర్వహించే బిల్డర్లు తక్కువే • ఎస్క్రో ఖాతా నిర్వహించే సంస్థల్లోనే కొనుగోళ్లు మంచిది: నిపుణులు ‘‘ప్రతి స్థిరాస్తి ప్రాజెక్ట్కూ ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఈ ఖాతాలో జమ చేయాలి’’ .. ఇదీ స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా)లోని ఓ నిబంధన. కానీ, భాగ్యనగరంలో ఈ నిబంధనను ఫాలో అయ్యే బిల్డర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే మనోళ్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును మళ్లించడంలో సిద్ధహస్తులు కదా! ఇంతకీ ఎస్క్రో ఖాతా అంటే ఏంటి? ఈ ఖాతాతో కొనుగోలుదారులకు ఒరిగే ప్రయోజనాలేంటో వివరించేదే ‘సాక్షి రియల్టీ’ ఈ వారం ప్రత్యేక కథనం!! సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎంత సురక్షితమో.. ఏమరపాటుగా ఉంటే నష్ట భయం కూడా అంతే! అందుకే ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించాకే ముందడుగు వేయాలి. భవిష్యత్తు దృష్ట్యా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఎలా అరుుతే పెరుగుతుందో.. అలాగే కొనుగోళ్ల సమయంలో రకరకాల సమస్యలూ ఎదురవుతున్నారుు కస్టమర్లకు. గత కొంతకాలం నుంచి దేశ వ్యాప్తంగా వేలాదిమంది కస్టమర్లు తమ కలల గృహం ఆలస్యం కావటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అరుుతే తెల్లాపూర్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణమంటూ భారీ ప్రచారం చేసి కస్టమర్లను నట్టేట ముంచింది ఓ సంస్థ. కొనుగోలుదారులు చేసే చెల్లింపులను మరో ప్రాజెక్ట్‌కు లేదా వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర పనులకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంస్థలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి డెవలపర్లను నియంత్రించడం కొనుగోలుదారుల వల్ల అయ్యే పనికాదు. అలాగే సకాలంలో ఫ్లాట్లను అందించేలా చేయనూ లేరు. నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకంగా నిధులను వినియోగించేందుకు అవసరమయ్యేదే ‘‘ఎస్క్రో ఖాతా’’! ఎస్క్రో ఖాతా అంటే.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించడమే ఎస్క్రో ఖాతా. ఇందులో జమయ్యే సొమ్మును పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే వినియోగించేలా చేయడమే ఈ ఖాతా ప్రధాన లక్ష్యం. ఇది తాత్కాలిక ఖాతా. ప్రాజెక్ట్ పూర్తిగా డెలివరీ అరుు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ఓసీ) వచ్చేంతవరకూ ఈ ఖాతా నిర్వహణలో ఉంటుంది. ఎస్క్రో ఖాతాను తెరవాలంటే బిల్డర్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాతా లావాదేవీలను పర్యవేక్షించడానికి ఓ ట్రస్టీని నియమిస్తారు. ఖాతాలోని నిధుల్ని నిర్మాణ పనులకే వాడుతున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించడం ఇతని విధి. ఒకవేళ నిధులు అవసరమైతే ట్రస్టీ అనుమతితో ఖాతాలోని 70 శాతం సొమ్మును వినియోగించుకునే వీలుంటుంది. కస్టమర్లకు ఏం లాభం.. ఎస్క్రో ఖాతా నిబంధనల ప్రకారం బిల్డర్ నిధుల్ని దుర్వినియోగం చేయడానికి, మళ్లించడానికి అవకాశం లేదు. ఇదే సొమ్ముతో కొత్తగా వేరే ప్రాంతంలో భూములను కొనుగోలు చేయాలన్నా కూడా కుదరదు. నిధుల సక్రమ వినియోగంతో గడువులోగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే ఖాతాలోని సొమ్మును వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ‘‘ఫ్లాట్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ బిల్డర్లను ఎస్క్రో ఖాతాను నిర్వహిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించాలి. సరైన జవాబు వచ్చిందా ఓకే. లేకపోతే సదరు బిల్డర్ ఎస్క్రో ఖాతాను నిర్వహించడం లేదని అర్థం. ఇక ఆ బిల్డర్ వద్ద ఫ్లాట్ కొనాలా? వద్దా? అనేది ఎవరికి వారే నిర్ణరుుంచుకోవాల్సిన విషయమని’’ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలోని బిల్డర్ల పరిస్థితి.. సాధారణంగా మౌలిక సదుపాయాల సంస్థలు ఎస్క్రో ఖాతాను ఎక్కువగా నిర్వహిస్తుంటారుు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరాస్తి లావాదేవీలన్నీ ఎస్క్రో ఖాతాలోనే జమ అవుతుంటారుు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్థిరాస్తి నియంత్రణ బిల్లులో ప్రతి నిర్మాణ సంస్థ ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ప్రారంభించానే నిబంధనను పెట్టింది. పైగా ఎస్క్రో ఖాతాలను ఆరంభించేలా నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. -
మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదు..
-
మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదు..
* విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం * హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి సాక్షి, హైదరాబాద్: ‘‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించిన సింగిల్ జడ్జి మొత్తం ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి మేం చేపడుతున్నది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఎంతమాత్రం కాదు. అభివృద్ధి, నిర్మాణాలతోపాటు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించి, ఉపాధి అవకాశాల కల్పనకోసం ఉద్దేశించింది’’ అని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. స్విస్ చాలెంజ్ పద్ధతిన రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన బిడ్డింగ్ ప్రక్రియను నిలిపేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఈనెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వుల అమలును నిలిపేయాలంటూ రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏలు సంయుక్తంగా అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
అక్రమ రియల్టర్లకు గడ్డుకాలమే!
స్థిరాస్తి బిల్లుకు లోక్‌సభ ఆమోదం ♦ ఇప్పటికే రాజ్యసభ నుంచి గ్రీన్‌సిగ్నల్ ♦ నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్ష న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయని రియల్టర్లకు ఇక గడ్డు కాలమే. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించే దిశగా పలు కఠిన ప్రతిపాదనలున్న స్థిరాస్తి బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం లభించింది. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తే.. ప్రమోటర్లకు గరిష్టంగా మూడేళ్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొనుగోలుదారులకు ఏడాది జైలుశిక్ష విధించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించడం తెలిసిందే. కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ రంగ లావాదేవీల్లో మరింత పారదర్శకత, రియల్టర్లలో మెరుగైన జవాబుదారీతనం లక్ష్యాలుగా బిల్లును రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నియంత్రణ సంస్థల ఏర్పాటుకుఅవకాశం కల్పించారు. ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు, గృహ, వాణిజ్య ప్రాజెక్టుల లావాదేవీలను ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఆర్ఈఆర్ఏ)లు నియంత్రిస్తాయి. పూర్తి వివరాలతో అన్ని రియల్ ప్రాజెక్టులను ఈ అథారిటీల వద్ద రిజిస్టర్ చేయాలి. గృహ, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది. రియల్టర్లు వినియోగదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతాన్ని బ్యాంకుల్లో ప్రత్యేక ఎస్క్రూ ఖాతాల్లో జమ చేసి, నిర్మాణ అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులను చెప్పిన సమయంలోగా పూర్తి చేయలేకపోయినా, లేదా వినియోగదారుడు ముందుగా అంగీకరించినట్లుగా డబ్బులు చెల్లించలేకపోయినా.. ఇరువురికీ ఒకే వడ్డీ రేటు వర్తించేలా ప్రతిపాదన తెచ్చారు. బిల్లు ప్రకారం.. 500 చదరపు మీటర్లలో నిర్మించిన ప్రాజెక్టులు లేదా కనీసం 8 ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. 2013లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో ఇది 4 వేల చదరపు మీటరు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ.. నిర్మాణ రంగ వర్గాలు ఈ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిపారు. బిల్లుకు విపక్షం ప్రతిపాదించిన సవరణలపై లోక్‌సభలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వం.. రాజ్యసభలో మాత్రం వాటిని ఆమోదించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్య విధానం కాదని కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)అన్నారు. కాగా 111 నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేసేందుకు తెచ్చిన బిల్లును సవరణతో పార్లమెంటు ఆమోదించింది. డిసెంబర్లో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, సవరణతో ఆ సభ మళ్లీ పచ్చజెండా ఊపింది. 48 ఏళ్లనాటి శత్రువు ఆస్తుల చట్టానికి సవరణలతో రూపొందించిన బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘానికి పంపించారు. -
రాజేంద్రనగర్‌లో పూర్వాంకర ప్రాజెక్ట్!
రూ.500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టయిల్ డిస్ట్రిక్ట్ సాక్షి, హైదరాబాద్: పూర్వాంకర గ్రూప్ అనుబంధ సంస్థ ప్రావిడెంట్ హౌజింగ్ ప్రాజెక్ట్ రూ.500 కోట్ల పెట్టుబడులతో నగరంలో భారీ స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. రాజేంద్రనగర్‌లో 20 ఎకరాల్లో కెన్వర్త్ బై ప్రావిడెంట్ పేరుతో ప్రీమియం ప్రాజెక్ట్ రానుంది. ఇందులో మొత్తం 2,400 యూనిట్లు కాగా.. తొలి దశలో 400 ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటిలో 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లతో పాటూ 4 పడక గదుల సిగ్నేచర్ ఫ్లాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల విస్తీర్ణాలను చూస్తే.. 2 బీహెచ్‌కే 928-1,007 చ.అ., 3 బీహెచ్‌కే 1,047-1,327 చ.అ., 4 బీహెచ్‌కే 1,862-2,007 చ.అ. మధ్య ఉంటాయి. తొలిసారిగా బుక్ బిల్డింగ్ ప్రాతిపదికన ఫ్లాట్ల ధరలను ఖరారు చేయనుంది. ఇందుకోసం నిర్దేశిత కొనుగోలుదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లను ఆహ్వానిస్తోంది. అంటే సాధారణంగా స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను ప్రకటించగానే చ.అ. ధర ఎంతనేది నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి. కానీ, పూర్వాంకర గ్రూప్ ప్రాజెక్ట్‌లో చ.అ. ఎంత ఇవ్వదలుచుకున్నారో కస్టమర్లే చెప్పేస్తారన్నమాట. ప్రాంతం అభివృద్ధి, నిర్మాణ ఖర్చులు వంటివి పరిశీలించాక కంపెనీ అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. గృహాల ధరల్లో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ధరలు రూ.37 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఒకే చోట నివాస, వాణిజ్య సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇందులో లగ్జరీ ఫ్లాట్లతో పాటు, కెఫె, బొటిక్స్, షాపింగ్స్, స్మార్ట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అర్ట్స్ అండ్ స్పోర్ట్స్ థీమ్‌తో రూపొందుతోంది. ఇందులో అథ్లెటిక్, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ, బాడ్మింటన్, మినీ-హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి 21 రకాల ఆట స్థలాలుంటాయి. -
వరంగల్‌కు సుచిరిండియా!
హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను చేపట్టిన సుచిరిండియా తొలిసారిగా తెలంగాణ రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ పట్టణంలోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో వరంగల్‌లో అర్బన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ రిసార్ట్, మెగా షాపింగ్ మాల్ కం మల్టీప్లెక్స్ రెండు ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుచిరిండియా ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. సీఈఓ లయన్ కిరణ్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత వరంగలే ఆయువు పట్టు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్-వరంగల్ మార్గం పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మార్గంలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లూ చేపడితే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అందుకే వరంగల్ హైవేలోని యమ్నంపేటలో 8 ఎకరాల్లో సుచిర్ ఒడిస్సీ డ్యూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 99 డ్యూప్లెక్స్‌లొస్తాయి. 1,200 చ.అ. విల్లా రూ.36 లక్షలు, 1,500 చ.అ. అయితే రూ.40 లక్షలు. శంషాబాద్‌లో 25 ఎకరాల్లో టింబర్ లీఫ్ విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. మొత్తం 123 విల్లాలు. 3,800 చ.అ. విల్లా ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించాం. ఈనెలాఖరులోగా తుమ్ముకుంటలో 100 ఎకరాల్లో ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 25 శాతం ఓపెన్ ప్లాట్లు, 75 శాతంలో విల్లాలను నిర్మిస్తాం. 200 గజాల ప్లాట్ రూ.12 లక్షలు, 1,500 చ.అ. విల్లా ధర రూ.40 లక్షలు, 2,000 చ.అ. అయితే రూ.50 లక్షలు. వచ్చే నెలాఖరులోగా పుప్పాల్‌గూడలో 4.5 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. ఇందులో మొత్తం 220 ఫ్లాట్లొస్తాయి. 1,000 చ.అ. ఫ్లాట్ ధర రూ. 35-40 లక్షల మధ్య ఉంటుంది. గతేడాది రూ.65 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం.