రాజేంద్రనగర్‌లో పూర్వాంకర ప్రాజెక్ట్!
రూ.500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టయిల్ డిస్ట్రిక్ట్
సాక్షి, హైదరాబాద్: పూర్వాంకర గ్రూప్ అనుబంధ సంస్థ ప్రావిడెంట్ హౌజింగ్ ప్రాజెక్ట్ రూ.500 కోట్ల పెట్టుబడులతో నగరంలో భారీ స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. రాజేంద్రనగర్‌లో 20 ఎకరాల్లో కెన్‌వర్త్ బై ప్రావిడెంట్ పేరుతో ప్రీమియం ప్రాజెక్ట్ రానుంది. ఇందులో మొత్తం 2,400 యూనిట్లు కాగా.. తొలి దశలో 400 ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటిలో 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లతో పాటూ 4 పడక గదుల సిగ్నేచర్ ఫ్లాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల విస్తీర్ణాలను చూస్తే.. 2 బీహెచ్‌కే 928-1,007 చ.అ., 3 బీహెచ్‌కే 1,047-1,327 చ.అ., 4 బీహెచ్‌కే 1,862-2,007 చ.అ. మధ్య ఉంటాయి. తొలిసారిగా బుక్ బిల్డింగ్ ప్రాతిపదికన ఫ్లాట్ల ధరలను ఖరారు చేయనుంది. ఇందుకోసం నిర్దేశిత కొనుగోలుదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లను ఆహ్వానిస్తోంది.
అంటే సాధారణంగా స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను ప్రకటించగానే చ.అ. ధర ఎంతనేది నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి. కానీ, పూర్వాంకర గ్రూప్ ప్రాజెక్ట్‌లో చ.అ. ఎంత ఇవ్వదలుచుకున్నారో కస్టమర్లే చెప్పేస్తారన్నమాట. ప్రాంతం అభివృద్ధి, నిర్మాణ ఖర్చులు వంటివి పరిశీలించాక కంపెనీ అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. గృహాల ధరల్లో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ధరలు రూ.37 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఒకే చోట నివాస, వాణిజ్య సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇందులో లగ్జరీ ఫ్లాట్లతో పాటు, కెఫె, బొటిక్స్, షాపింగ్స్, స్మార్ట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అర్ట్స్ అండ్ స్పోర్ట్స్ థీమ్‌తో రూపొందుతోంది. ఇందులో అథ్లెటిక్, బాక్సింగ్, ఆర్చరీ, కబడ్డీ, బాడ్మింటన్, మినీ-హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి 21 రకాల ఆట స్థలాలుంటాయి.