అక్రమ రియల్టర్లకు గడ్డుకాలమే!
స్థిరాస్తి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
♦ ఇప్పటికే రాజ్యసభ నుంచి గ్రీన్‌సిగ్నల్
♦ నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్ష
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయని రియల్టర్లకు ఇక గడ్డు కాలమే. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించే దిశగా పలు కఠిన ప్రతిపాదనలున్న స్థిరాస్తి బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం లభించింది. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తే.. ప్రమోటర్లకు గరిష్టంగా మూడేళ్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొనుగోలుదారులకు ఏడాది జైలుశిక్ష విధించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించడం తెలిసిందే. కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ రంగ లావాదేవీల్లో మరింత పారదర్శకత, రియల్టర్లలో మెరుగైన జవాబుదారీతనం లక్ష్యాలుగా బిల్లును రూపొందించారు.
రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నియంత్రణ సంస్థల ఏర్పాటుకుఅవకాశం కల్పించారు. ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు, గృహ, వాణిజ్య ప్రాజెక్టుల లావాదేవీలను ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఆర్‌ఈఆర్‌ఏ)లు నియంత్రిస్తాయి. పూర్తి వివరాలతో అన్ని రియల్ ప్రాజెక్టులను ఈ అథారిటీల వద్ద రిజిస్టర్ చేయాలి. గృహ, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది. రియల్టర్లు వినియోగదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతాన్ని బ్యాంకుల్లో ప్రత్యేక ఎస్క్రూ ఖాతాల్లో జమ చేసి, నిర్మాణ అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది.
ప్రాజెక్టులను చెప్పిన సమయంలోగా పూర్తి చేయలేకపోయినా, లేదా వినియోగదారుడు ముందుగా అంగీకరించినట్లుగా డబ్బులు చెల్లించలేకపోయినా.. ఇరువురికీ ఒకే వడ్డీ రేటు వర్తించేలా ప్రతిపాదన తెచ్చారు. బిల్లు ప్రకారం.. 500 చదరపు మీటర్లలో నిర్మించిన ప్రాజెక్టులు లేదా కనీసం 8 ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. 2013లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో ఇది 4 వేల చదరపు మీటరు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ.. నిర్మాణ రంగ వర్గాలు ఈ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిపారు.
బిల్లుకు విపక్షం ప్రతిపాదించిన సవరణలపై లోక్‌సభలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వం.. రాజ్యసభలో మాత్రం వాటిని ఆమోదించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్య విధానం కాదని కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)అన్నారు. కాగా 111 నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేసేందుకు తెచ్చిన బిల్లును సవరణతో పార్లమెంటు ఆమోదించింది. డిసెంబర్‌లో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, సవరణతో ఆ సభ మళ్లీ పచ్చజెండా ఊపింది. 48 ఏళ్లనాటి శత్రువు ఆస్తుల చట్టానికి సవరణలతో రూపొందించిన బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘానికి పంపించారు.