మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదు..
* విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం
* హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించిన సింగిల్ జడ్జి మొత్తం ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి మేం చేపడుతున్నది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఎంతమాత్రం కాదు. అభివృద్ధి, నిర్మాణాలతోపాటు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించి, ఉపాధి అవకాశాల కల్పనకోసం ఉద్దేశించింది’’ అని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు.
స్విస్ చాలెంజ్ పద్ధతిన రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన బిడ్డింగ్ ప్రక్రియను నిలిపేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఈనెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వుల అమలును నిలిపేయాలంటూ రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏలు సంయుక్తంగా అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.