
సాగుకు దూరం!
సాక్షి, గుంటూరు
జిల్లాలో ఈ ఏడాది 1.63 లక్షల హెక్టార్లలో భూములు సాగుకు నోచుకోలేదు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి 6.14 లక్షల హెక్టార్లలో సాగు చేపట్టగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 4.51 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు. ఇందులో వరి సాగు 1.05 లక్షల హెక్టార్ల మేర తగ్గింది.
జిల్లాలో భారీ స్థాయిలో సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రభుత్వ వైఖరే కారణమని రైతులంటున్నారు.
ఈ ఏడాది బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడం, సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కాకపోవడంతో వంటి కారణాలను రైతులు ప్రధానంగా పేర్కొంటున్నారు.
{పభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసుగు చెందిన రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర పనులకు వెళ్లాల్సి వస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులకు అండగా నిలుస్తామని సార్వత్రిక ఎన్నికల్లో వాగ్దానాలు చేసి తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కి వంద రోజులు పూర్తయినా ఒరగబెట్టింది ఏమీ లేదనే భావన రైతుల్లో గూడుకట్టుకుంది.
{పధానంగా రైతు రుణమాఫీ చేయకపోవడం, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అమలు చేయకపోవడం వల్ల సాగు భారమైందని రైతులు చెబుతున్నారు.
పాత రుణాలు తిరిగి చెల్లించలేదని బ్యాంకర్లు ఈ ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా పేర్కొంటున్నారు.
గత ఏడాది వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టప రిహారం ప్రకటించిన అప్పటి ప్రభుత్వం అధికారంలో లేకపోవడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ ఊసెత్తకపోవడం వల్ల తిరిగి సాగు చేపట్టే ధైర్యం లేకుం డా పోయిందంటున్నారు.
వ్యవసాయ మోటర్ల కింద పంటలు వేసిన రైతులకు సైతం ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతుందంటున్నారు.
గత ఏడాది పండించిన మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అవి గోడౌన్లలో మూలుగుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి సాగు ఎలా చేపట్టగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు.