మాఫీ.. మాయ
పంట రుణాల లెక్కలు చెప్పని బ్యాంకు అధికారులు రుణమాఫీ ఎంత వచ్చిందో తెలియదు...వడ్డీ ఎంత తీసుకున్నారో తెలియదు.... రీషెడ్యూల్ అయ్యాక పాస్‌పుస్తకాల్లో ఉండేది ఒకటి... చేతికందే డబ్బు మరోటి... ఇంతలో ఇన్సూరెన్స్ పేర కోత...వెరసి రుణమాఫీ సొమ్ము రైతుకు చేరే వరకూ రణమే చేయాల్సి వస్తోంది. రుణమాఫీకి సంబంధించి దేనికెంతో స్పష్టమైన లెక్కలు చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తృణమో... పణమో చేతికిచ్చి బ్యాంకు అధికారులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ లెక్కలు రైతులను అంతా అయోమయంలో పడేస్తున్నాయి.
రైతులు గతంలో తీసుకున్న పంట రుణానికి ఎంత వడ్డీ లెక్క కడుతున్నారో.. ఎంత మేర రుణమాఫీ
అయ్యిందో.. మళ్లీ ఎంత రుణం ఇస్తున్నారో అర్థకాని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై బ్యాంకుల అధికారు
లను రైతులు అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.
మిర్యాలగూడ :రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రుణమాఫీ పథకం విషయంలో రైతులు అయోమయంలో ఉన్నారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం 25శాతం మాత్రమే ప్రస్తుతం మాఫీ చేస్తున్నారు. జిల్లాకు మొదటి విడతగా 633 కోట్ల రుణాలు మాఫీగా ప్రకటించారు. కాగా రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న వివరాల ప్రకారం రుణమాఫీని సంబంధిత బ్యాంకు అధికారులు వర్తింప జేస్తున్నారు. కానీ 25 శాతంగా మాఫీ వర్తించే పత్రాలను బ్యాంకులకు తీసుకెళ్తున్న రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కొక్క బ్యాంకు వారి నిబంధనల మేరకు వివిధ పత్రాలను తీసుకొని రావాలని చెబుతున్నారు. అయినా గతంలో తీసుకున్న రుణాలకు ఎంత వడ్డీ చొప్పున చెల్లించాల్సి వస్తుందో అనే వివరాలను కూడా రైతులకు తెలియజేయడం లేదు.
వడ్డీతో పాటు ప్రస్తుతం రైతులకు వర్తించిన మాఫీలో తిరిగి పంట రుణం తీసుకోవడానికి అనుకూలంగా పత్రాలను సరిచేసి రుణాలు రెన్యువల్ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 2014-15 సంవత్సర ఖరీఫ్, రబీ రుణాల లక్ష్యం రూ. 1752 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 1376 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. కానీ పంట రుణాల్లో ప్రభుత్వం ఎంత మాఫీ ఇచ్చిందో? తమ డబ్బుల నుంచి బ్యాంకు అధికారులు ఎంత తీసుకున్నారనే విషయాన్ని రైతులకు తెలియజేయకుండానే రుణమాఫీకి వర్తింపజేస్తున్నారు. రుణాలను రెన్యువల్ చేస్తున్న బ్యాంకు అధికారులు పాత రుణంతో పాటు కొత్తగా ఇచ్చినవి కూడా కలిపి మొత్తం ఇప్పుడే తీసుకున్నట్లు పాస్ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఇన్సూరెన్స్ పేరుతో రుణంలో కోత
పంటలకు ఇన్సూరెన్స్ పేరుతో బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాలలో కోత విధిస్తున్నారు. లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతుకు 2500 రూపాయలు కోత విధిస్తున్నారు. బ్యాంకర్లు తీసుకున్న 2500 రూపాయలను రైతులు తిరిగి చెల్లించడంతో పాటు దానికి సంబంధించిన వడ్డీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్‌లలో మొత్తం రూ.1376 కోట్ల రుణాలు ఇవ్వగా ఇన్సూరెన్స్ పేరుతో 32.50 లక్షల రూపాయలు రైతుల రుణాల నుంచి బ్యాంకర్లు మినహాయించుకున్నారు. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ వర్తింపజేయకపోయినప్పటికీ ఇన్సూరెన్స్ మినహాయించుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వడ్డీలకే సరిపోతున్న రుణమాఫీ..
తీసుకున్న రుణంలో తన చెతికి వచ్చింది కొద్దిగానే ఉండి, పాస్ పుస్తకంలో ఎక్కువ మొత్తం ఉండటం వల్ల అయోమయానికి గురైన రైతులు అధికారులను అడిగితే లెక్కలు చెప్పడం లేదు. కనీసం పాత రుణాలకు ఎంత శాతం వడ్డీ తీసుకున్న విషయం కూడా చెప్పడం లేదు. నిబంధనల ప్రకారం పంట రుణాలను బ్యాంకులు కేవలం 7 శాతం వడ్డీ తీసుకోవాల్సి ఉండగా 11 శాతానికి పైగా వడ్డీ తీసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువ శాతం వడ్డీ తీసుకున్నప్పటికీ రుణమాఫీలో కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే రావడం వల్ల అది కేవలం వడ్డీలకు మాత్రమే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.లక్ష లోపు ఉన్నా మాఫీ వర్తించదని చెబుతున్నారు
నాకు శెట్టిపాలెంలో ఉన్న ఎకరం పొలం పేరున వేములపల్లి బ్యాంకులో 21 వేల రూపాయల రుణం తీసుకున్నా. రుణమాఫీ వర్తింప జేశారు. కానీ మిర్యాలగూడ మండలంలోని నందిపాడులో 1.15 ఎకరాల భూమి ఉంది. దాని పేరున మిర్యాలగూడలోని నాగార్జున గ్రామీణ బ్యాంకులో 31 వేల రూపాయల రుణం తీసుకున్నా. కానీ వేముపల్లి బ్యాంకులో రుణమాఫీ వచ్చినందున మిర్యాలగూడ బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ అని ప్రకటించిన విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- దైద నాగయ్య, రిటైర్డ్ తహసీల్దార్, మిర్యాలగూడ