తాకట్టు సీజన్!
ముంచుకొచ్చిన ఖరీఫ్
రుణాల మాఫీపై కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడుతున్న రైతులు
వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కాస్తా తాకట్టు సీజన్‌గా మారిపోతోంది. పంట రుణాల మాఫీ, కొత్త రుణాల మంజూరుపై ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుండడంతో రైతులు ఎటూ దిక్కుతోచక మిగిలిన బంగారాన్ని తాకట్టుపెడుతున్నారు. భార్య, కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలను బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి ఆ డబ్బుతో విత్తన వేరుశనగకాయలు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. గురువారం కూడేరులోని స్టేట్‌బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్, జల్లిపల్లిలోని గ్రామీణబ్యాంక్‌కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండల వ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తారు. సాగు సమయం ఆసన్నమైంది. త్వరలో సబ్సిడీ విత్తన వేరుశనగకాయలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వలేని రైతులు ఇదివరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి కొత్తగా పంట రుణం మంజూరు చేస్తుందేమోనన్న ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదని, తీసుకున్న రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్య, కుటుంబ సభ్యుల వద్ద మిగిలి ఉన్న అరకొర బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి విత్తన వేరుశనగకాయలు కొనుక్కోవడానికి బ్యాంకుల బాట పట్టారు. కాగా రోజుకు పది మంది వరకు బంగారం తాకట్టుపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని కూడేరు స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విజయకుమారి తెలిపారు. బంగారు నాణ్యతను బట్టి తులంపై రూ.13 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.