లోకేష్పై ప్రమాణం చేయగలరా?
ఓటుకు కోట్లు కేసులో ఫోన్ సంభాషణలలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని దేవుడి ముందు తన కొడుకుపై ప్రమాణం చేస్తానని వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయకుడి ముందు తాను ఆ ప్రమాణాలు చేస్తానని, అదే.. ఆ గొంతు మీది కాదని మీరు లోకేష్పై ప్రమాణం చేయగలరా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చగానే అక్కడ పిడుగులు పడి.. 20 మంది చనిపోయారని తమ్మినేని అన్నారు. ఏపీలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు.. రైతు రుణమాఫీ పేరు చెప్పి రైతులకు ఒక్క రూపాయి కూడా కొత్త రుణాలు ఇవ్వలేదని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సందర్భాలలో రైతులకు మీరిస్తున్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒక్కసారైనా సమీక్షించుకున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. సోమవారం లోటస్పాండ్లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే..
- మీరు రుణమాఫీ చేశానని చెబుతున్నారు గానీ, రైతులు గుండెమంటలతో రగిలిపోతున్నారు
- మీరు చాలా హామీలిచ్చారు.. వాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం.
- సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూద్దాం
- రుణమాఫీ పేరుతో కొత్తరుణాలు లేకుండా చేశారు
- దానికి బాధ్యత మీరు వహిస్తారా.. సింగపూర్ లాంటి ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా
- ఈ సంవత్సరం పీఈసీఎస్ల నుంచి ఒక్కరూపాయి కూడా రైతుకు కొత్త రుణం ఇవ్వలేదు
- దీనికి మంత్రులు గానీ, సీఎం గానీ సమాధానం ఇవ్వాలి
- ఇలాంటి పరిస్థితుల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకపోతే ఏం చేస్తారు?
- 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అన్నారు.. ఒక్కరూపాయైనా విడుదల చేశారా?
- మీరు చేసిన సందర్భం ఉంటే చెప్పండి..
- శ్రీశైలం డ్యామ్కు సంబంధించి నీటిమట్టం డెడ్ స్టోరేజి లెవెల్ కంటే కిందకు పడిపోయింది.
- దాంతో ఎక్కడా పంటలకు చుక్క నీరిచ్చే పరిస్థితి లేదు
- పైనున్న కర్ణాటక దామాషా ప్రకారం నీరు వదలడం లేదు.
- కేంద్రంలో కూడా మీ మంత్రులున్నారు కాబట్టి ఢిల్లీ వెళ్లి రైతుల దుస్థితి గురించి, నీళ్ల సమస్య గురించి మాట్లాడారా
- దానివల్ల ప్రకాశం బ్యారేజిలో నీళ్లు లేవు, ఏలేరు రిజర్వాయర్, తుంగభద్ర నుంచి వచ్చే కాలువలకు కూడా నీళ్లు లేవు. వంశధారలో నీళ్లు లేవు, తోటపల్లిలోకూడా నీళ్లు లేని పరిస్థితి.