రోజువారీ సాధారణ పాలనకే పరిమితం
కొత్తగా మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం ఉండదు..
కొత్త రుణాలకు ఆస్కారం లేదు.. వచ్చే ఏడాది ఎవరి బడ్జెట్ వారిదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్తగా ఎటువంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోబోదని అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగా సాగునీటి, మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణాలు గానీ, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు మాత్రమే రుణాలు తీసుకుంటారని, కొత్త రుణాలు కూడా తీసుకోరని అధికార వర్గాలు వివరించాయి.
దీంతో, రోజువారీ సాధారణ పరిపాలనకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతాయని, కొత్తగా ఎటువంటి కార్యక్రమాలనూ ప్రభుత్వం చేపట్టదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2 రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలాఉండగా, వచ్చే ఏడాది ఎవరి బడ్జెట్ వారే రూపొందించుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని, వేర్వేరు ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపడతారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లను ప్రవేశపెడతారు. ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్లను రూపొందించుకుంటాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.