
ఎప్పటిలానే ఎటూతేల్చని చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఎప్పటిలాగే ఎటూ తేల్చని స్వరాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వినిపించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఎలాంటి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. నిర్ణయం జరిగిపోయింది కదా.. ఏం చేయబోతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ‘ఏం చేయాలో అదే చేస్తాం’ అంటూ దాటవేశారు. తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం వెలువడిన తర్వాత గురువారం రాత్రి తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అనంతరం పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, కంభంపాటి రామ్మోహనరావు, ఎరబ్రెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులతో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు, అనంతరం మీడియా సమావేశానికి వచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ వైఖరి తదితర అంశాలపై విలేకరులు ప్రశ్నలు సంధిస్తుండగా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వారిని వారించారు. ఎక్కువ ప్రశ్నలు అడగవద్దంటూ విలేకరులకు సైగలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ సొంత నేతలే ఆ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించటం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ మొదటి ముద్దాయి అని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. విభజన విషయంలో అందరికీ న్యాయం చేయాలన్నారు. తాను బీజేపీ అధినేత… రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన వెంటనే జైల్లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బైటకు తీసుకొచ్చారని, ఇందుకోసం సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విమానంలో వచ్చి మెమో దాఖలు చేశారని అన్నారు. తాను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో బుధవారం భేటీ అయిన వెంటనే ఒక మంత్రివర్గ సమావేశం, మరుసటి రోజు మరో సమావేశం ఏర్పాటు చేశారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని అన్నారు. రాష్ర్ట విభజనకు తానే కారణమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు విమర్శిస్తున్నారని, రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికే ఉందని జగన్ ఆ రోజన్నారని గుర్తుచేశారు.
ఉదయం దాటవేత
గురువారం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆ సమయంలో తెలంగాణ అంశంపై కేబినెట్ ముందుకు నోట్ రాబోతోందని జరుగుతున్న హడావిడిపై స్పందించాలని కోరగా, ఆ అంశంపై మళ్లీ మాట్లాడుదామంటూ దాటవేశారు. మీరు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీరు కీలక భూమిక పోషించారు, ఇపుడు రాష్ట్రంలో తీవ్రమైన సమస్యల్లో ఉంటే అర్థక్రాంతి సంస్థ సభ్యులతో సమావేశాలు, విద్యార్థుల నిర్వహించే సమావేశాలపై దృష్టి సారిస్తున్నారు తప్ప రాష్ట్రం గురించి ఎందుకు పట్టించుకోవటం లేదన్న ప్రశ్నకు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.
సీబీఐ డెరైక్టర్ వివరణ ఇవ్వాలి
సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను ఎందుకు కలిశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌సింగ్ ఏమైనా సీబీఐ యజమానా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్ధులను వేధించేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న మీపై ఏదైనా కేసులు నమోదు చేస్తుందని ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా రాజకీయ ప్రత్యర్థులను వేధించటం ఆ పార్టీకి అలవాటేనన్నారు. పదవుల్లో ఉన్న వారు చేసిన పనుల్లో సాంకేతికంగా కొన్ని పొరపాట్లు ఉంటాయని, వాటిని పట్టుకుని వేధించాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా రాజకీయాల గురించి చర్చించానన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు.
వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్తను ఇస్తున్నాం.
ఒకవేళ అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేది.
.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం విభజన అంశం కేంద్ర పరిధిలోది అని చెబుతూనే ఎవరికీ అన్యాయం జరక్కుండా ఒక తండ్రిలాగా నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీలో స్పష్టంగా చెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన లేఖకు ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని మీరిచ్చిన (టీడీపీ) లేఖకు చాలా తేడా ఉంది కదా? మీ వైఖరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకటే ఎలా అవుతుంది?
.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న ప్రతిపాదనపై మీరు స్పందించలేదు? కనీసం కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయలేదు. పైగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా సత్వరం నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి లేఖ రాసిన మీరు ఇప్పుడు ఇరు ప్రాంతాల నేతలను కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పడంలోని ఆంతర్యమేంటి?
3.కాంగ్రెస్ పార్టీని వీడి, రాజకీయంగా ఎదిరించిన వారిని కేసుల పేరుతో ఇబ్బంది పెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి చెబుతోంది. ఇంతకాలం సీబీఐ బాగా పనిచేస్తుందని కితాబిచ్చిన మీరు జగన్‌కు బెయిల్ రావడంతో మాట మార్చడానికి కారణమేంటి?
.సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునే ముందు మీరు కాంగ్రెస్‌లో ముగ్గురు కీలకమైన నేతలతో మాట్లాడారని హిందుస్థాన్ టైమ్‌స పత్రిక బయటపెట్టింది కదా. పైగా చంద్రబాబు ఈజ్ మై బెస్‌ట ఫ్రెండ్ అని దిగ్విజయ్‌సింగ్ స్వయంగా బహిరంగంగా మీడియా ముందు చెప్పారు. అలాంటప్పుడు సీబీఐ డెరైక్టర్ ఎందుకు కలిశారో ఆయననే అడక్కపోయారా?