జైట్లీ అవమానించారు.. | Two TDP ministers to resign from Union cabinet | Sakshi
Sakshi News home page

మంత్రుల ఉపసంహరణ

Published Thu, Mar 8 2018 2:39 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Two TDP ministers to resign from Union cabinet - Sakshi

సాక్షి, అమరావతి :  కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఎన్‌డీఏలోనే కొనసాగనుంది. ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి మా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు వైదొలగాలని నిర్ణయించాం. ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర కేబినెట్‌లో చేరామో ఆ లక్ష్యం నెరవేరనప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడంలో అర్థం లేదు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. మా మంత్రులు ఇక ప్రభుత్వంలో ఉండరు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర హక్కు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని కోరితే జైట్లీ అవమానించారు.’’అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. బుధవారం రాత్రి   సెక్రటేరియట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

‘‘గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో బుధవారం నేను మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు, విభజన సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీల మేరకు 18 అంశాలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ బాధ్యతను నెరవేర్చడం ద్వారా రాష్ట్రానికి న్యాయం చేయమన్నా.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సెంటిమెంట్స్‌ పని చేయవని, హోదా ఇవ్వలేమని చెప్పారు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ఆర్థిక లోటు భర్తీ రూపంలో రాష్ట్రానికి ఇక రూ. 138 కోట్లే వస్తాయని చెప్పారు. మరో లెక్క ప్రకారం 1600 కోట్లు వస్తాయని, తీసుకున్నా, లేకున్నా వారి (ఏపీ) ఇష్టమని జైట్లీ మాట్లాడారు.  

పనులవుతాయనే పదవులు..
విదేశీసంస్థల ఆర్థిక సాయంతో చేపట్టే పథకాలు (ఈఏపీ) ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్స్‌ గురించి మాట్లాడకుండా సింపుల్‌ గా కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌) గురించే జైట్లీ మాట్లాడి తేల్చేశారు. దీంతో రాష్ట్రానికి సహాయం చేసే ఉద్దేశం కేంద్రానికి ఏమాత్రం ఉన్నట్లు కనిపించలేదు. దీంతో మా పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలతో చర్చించాం.  పనులవుతాయనే మంత్రి పదవులు తీసుకున్నాం.

కానీ జరగకపోవడం వల్ల వైదొలగాలని నిర్ణయించాం. అదే విషయాన్ని ప్రధానికి కూడా చెప్పాలని ప్రయత్నించాం. మంత్రిపదవుల నుంచి మా పార్టీ తప్పుకుంటోందని మర్యాదపూర్వకంగా తెలియజేయడం కోసం ప్రధానికి ఫోన్‌ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఇదే విషయాన్ని ఆయన ఓఎస్డీకి తెలియజేశాం. గురువారం రాజీనామాలు చేయాలని పార్టీ తరఫున నిర్ణయించాం. ఇక కేంద్ర ప్రభుత్వంలో మా మంత్రులు ఉండరు.  

ఇది తొలి అడుగే...
ఎన్డీయేతో పొత్తు కొనసాగుతుందా? లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. తొలి అడుగుగా ప్రభుత్వం నుంచి వైదొలగాలన్నదే ప్రస్తుతం నిర్ణయించాం. ఏపీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. విభజన చట్టంలోని అంశాల గురించి, 18 అంశాల గురించి స్పష్టంగా వివరించా. వీటిలో న్యాయం చేయాలని మాత్రమే కోరా. రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారా? లేదా? అనే నిర్ణయాన్ని బీజేపీకే వదిలిపెడుతున్నాం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత విధి లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.  

అది అవమానించడమే: సెంటిమెంట్‌తో ఫండ్స్‌ రావు అంటూ జైట్లీ మాట్లాడం బాధేసింది. దేశ రక్షణ అవసరం లేదా? అన్నట్లు మాట్లాడటం బాధేసింది. అంటే మనం దేశ రక్షణ నిధులు మాకివ్వాలని అడిగామా? వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు చొప్పున ఇవ్వాలి ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు (వినియోగ పత్రాలు) ఇచ్చాం. ఇంకా రూ. 104 కోట్లకు యూసీలు ఇవ్వాలి. రాజధానికిచ్చిన నిధులకూ యూసీ ఇచ్చాం.

పోలవరానికి యూసీలు అవసరం లేదు. మనం ఖర్చు పెట్టింది రూ. 13,053 కోట్లు. కేంద్రం ఇచ్చింది రూ. 5,349 కోట్లు . ఇంకా కేంద్రం రూ. 2,568 కోట్లు ఇవ్వాలి. కొత్త డీపీఆర్‌ ప్రకారం 760 కోట్లు ఇవ్వాలి. రెవెన్యూ లోటు మొత్తం రూ. 16,078 కోట్లని ఏజీ లెక్క తేల్చింది. 14వ ఆర్థిక సంఘం ప్రకారం 2015–16 లో రూ. 6,660 కోట్ల లోటు ఉంది. కానీ కేంద్రం 4 వేల కోట్లే ఇస్తామంది. ప్రతి ఏటా లోటు పెరిగి గతేడాదికి 23 వేల కోట్లకు చేరింది. కానీ కేంద్రం ఇచ్చింది రూ. 4 వేల కోట్లే. ఇంత లోటుపై డబ్బులివ్వాలంటే వచ్చే దింతే అని చెప్పడం ఎంత వరకు సబబు?

కేంద్ర స్పందనను బట్టి ముందుకు పోతాం..
ఇప్పటికైనా కేంద్రం ముందుకొచ్చి మన సమస్యలు పరిష్కరించాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలి. కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనే అంశంమీద మనం ఏ విధంగా ముందుకు పోవాలో ఆధారపడి ఉంటుంది.  నామీద చాలా మంది విమర్శలు చేశారు, వాటిని నేను పట్టించుకోను. ప్రధాని కార్యాలయం చుట్టూ 24 గంటలూ తిరగడానికి ప్రతిపక్షానికి ఏం పని?. మేం భాగస్వాములం కాబట్టి మాకు పనులుంటాయి. ఏ ఉద్దేశంతో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలికింది. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని ఆనాడు చెప్పారు.

ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఇచ్చి, ఏపీకి ఇవ్వడం కుదరదనడం ఎంత న్యాయం. హోదాతో పాటు 18 డిమాండ్లు కేంద్రం ముందు పెట్టాం. చివరి వరకు ప్రయత్నించినా కనీసం మా వినతిని పరిగణనలోకి కూడా తీసుకోకుండా కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. ఎన్డీయే నేతలను నేను వ్యతిరేకించానంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అన్ని రాష్ట్రాలకూ సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.  రాజకీయాల్లో ఊహాగానాలు కరెక్ట్‌ కాదు. ఈ రోజు జరిగిందే వాస్తవం. భావితరాల భవిష్యత్తు గురించే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం.’’ అని అన్నారు. హామీలను అమలు చేస్తానంటే కాంగ్రెస్‌తో కలుస్తారా అని విలేకరులు అడగగా సమాధానం దాటవేశారు.  


ప్రజల మూడ్‌ను గమనించే..
‘చంద్రబాబు రాజకీయాల్లో బాగా ఆరితేరిన వారు. ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తారు. కేవలం ప్రజల మూడ్‌ను గమనించే.. కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించి ప్రత్యేక హోదాపై స్వరం పెంచారు. ఇప్పుడే ఎన్డీయే నుంచి బయటికి రాకపోవచ్చు. అన్ని ప్రాంతీయ పార్టీల్లాగే తమ రాజకీయ అవకాశాలను చివరిదాకా సజీవంగా ఉంచుకుంటారు.

మంత్రుల ఉపసంహరణ విషయంలోనూ కేంద్రానికి ఫోన్‌ చేశానని చెప్పడం ద్వారా వారితో సయోధ్య కొనసాగేలా చూసుకున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయిన ప్రత్యేక హోదా ఉద్యమం మైలేజీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరలకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు’     – ట్వీటర్, టీవీ చర్చలో సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌  

బీజేపీ మంత్రులూ సిద్ధం
సాక్షి, అమరావతి:  చంద్రబాబు నిర్ణయానికి ప్రతిగా ఆయన కేబినెట్‌లోని బీజేపీ మంత్రులు కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. బుధవారం రాత్రి చంద్రబాబు ప్రకటన తర్వాత బీజేపీ ప్రజాప్రతినిధులు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు.   ఇద్దరు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పి.మాణిక్యాలరావు గురువారం వారి పదవులకు రాజీనామా చేస్తారని చెప్పారు.   


టీడీపీ మంత్రుల రాజీనామా డ్రామా: వైవీ
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనుండడం పెద్ద డ్రామా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయని, ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నందునే రాజీనామా డ్రామాలకు తెరతీసారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పదే పదే చెప్పే చంద్రబాబునాయుడు ఈ నాలుగేళ్లలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇన్ని రోజులు సరిగా స్పందించకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత హడావిడిగా రాజీనామాలు చేయడం డ్రామా కాక మరేంటని ప్రశ్నించారు. ఇప్పటికి కూడా కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తున్నారు అని చెప్పారే తప్ప ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నామని చెప్పకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement