సాక్షి ప్రతినిధి, వరంగల్: జనవరి ఫస్ట్‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల 26న అసెంబ్లీ సమావేశమవుతుందని.. పార్లమెంటులో ఈ బిల్లు ఆమో దం పొందేందుకు ఇక ఆలస్యమేమీ లేదని ఆయన భరోసా ఇచ్చా రు. కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పాటు పనిలో నిమగ్నమైం దని.. పత్రికల్లో రాయని వార్తలు సైతం అక్కడ జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రసక్తి ముమ్మాటికీ లేనేలేదన్నారు. సీడబ్ల్యూసీ, కేబినెట్ నిర్ణయం శిలాశాసనమని చెప్పారు. భద్రాచలం రాముని విషయంలో రాజీ పడేది లేదని... అది తెలంగాణకే చెందుతుందని ప్రకటించారు. శనివారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కృతజ్ఞత సభ విజయవంతమైంది. డిప్యూటీ సీఎం రాజనర్సింహ, సీనియర్ నాయకుడు వీహెచ్ మినహా తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఈ సభ కు తరలివచ్చారు.
సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ తీర్మానించిన విధంగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రధానికి, సోనియాకు విన్నవించాలని సభ తీర్మానిం చింది. ఉద్యమం జరిగినప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా సీమాంధ్రుల భద్రతకు ఇబ్బంది లేదని... సుహృద్భావం, సద్భావనతోనే విడిపోవాలని సభా వేదికపై నేతలందరూ హితవు పలికా రు. హైదరాబాద్‌పై రాజీ పడేది లేదని, గవర్నర్ పాలన లాంటి చర్యలను ప్రతిఘటిస్తామన్నారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక విలువల విజయమేనని.. ఏనుగు ఎల్లిందని.. తోక మాత్రమే మిగిలిందన్నారు. సీమాంధ్ర మిత్రులు ఇప్పటికీ సైంధవ పాత్ర పోషిస్తున్నారని, జగన్నాథ రథ చక్రాలు కదిలాయని, అడ్డుపడ్డ వారికే నష్టం, కష్టం అని అభిప్రాయపడ్డారు. చారిత్రక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగానే సోనియా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని, ఇచ్చిన మాట తప్పని రాజకీయవేత్తగా అభివర్ణించారు. 1966లో జవహర్‌లాల్ నెహ్రూ పంజాబ్ రాష్ట్ర విభజన జరగదని చెపితే, ఆయన కూతురు ఇందిరాగాంధీ హ యాంలో పంజాబ్‌ను విభజించిన విషయాన్ని గుర్తు చేశారు.
తండ్రి పట్ల గౌరవం లేక ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకోలేదని, అదే తీరుగా ఇందిరాగాంధీ తెలంగాణ వద్దన్నారని, ఇప్పుడు సోనియాగాంధీ తీసుకున్న రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని విమర్శించడం సరైం ది కాదన్నారు. రాజకీయ వేత్తలు చారిత్రక పరిణామాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల కుట్రలు కుతంత్రా లు చెల్లనే చెల్లవన్నారు. సంబరాలు చేయాల్సిన సమయం కాదని, సమరం ముగిసిందని తెలియజేసే సభగా అభివర్ణించారు. సీమాం ధ్ర నేతలు కొందరు హైకమాండ్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని, తెలంగాణ నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంటులో బీజేపీ తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేసినా, సోనియా నేతృత్వంలో బిల్లు ఓకే అవుతుందని ఎంపీ మధుయాష్కీ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరూ లేరని, ఆ సీటు ఖాళీగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఇంకా సమ యం కాలేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇంకా ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ వస్తుం దని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌ను సీఎం అని పిలిచేందుకు తాను సిగ్గు పడుతున్నానని, తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఖబడ్దార్! అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరిం చారు.
సోనియా నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్రుల భద్రతకు ఎక్కడ ఇబ్బంది కలి గిందో తేల్చి చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సవాల్ విసిరారు. ఇప్పుడు నిర్వహిస్తున్నది కృతజ్ఞత సభనే అని, తెలంగాణ బిల్లు ఆమోదించాక లక్షలాది మందితో జైత్రయాత్ర నిర్వహిస్తామన్నా రు. అక్రమ ఆస్తులను కాపాడుకోవాలని, హైదరాబాద్‌ను యూటీ చేయాలని సీమాంధ్రులు ఆరాట పడుతున్నారని ఎంపీ పొన్నం విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న భూములపై సమీక్ష ఉండకూడదనే ముందస్తు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రపంచంలో ఎత్తైదిగా గుజరాత్‌లో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాని కి మించిన ఎత్తుతో హైదరాబాద్‌లో సోనియా విగ్రహం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. ప్రజల సహకారంతోనే పార్లమెంట్‌లో తాము పోరాడామని, పోరాట ఫలితం సిద్ధించిందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, డీకే అరు ణ, సునితా లకా్ష్మరెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, రాపోలు ఆనంద భాస్క ర్, ఎంటీ ఖాన్, సిరిసిల్ల రాజయ్య, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలు మాలోతు కవిత, కొండేటి శ్రీధర్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ మంత్రులు రెడ్యానాయక్, విజయరామారావు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
దళితులకు భయమైతాంది: సర్వే
‘అరె జనమంతా పోయినంక నన్ను పిలుసుడేంది? నేను దళితుణ్ని. గరీబోణ్ని అనే కదా.. తెలంగాణ రాకముందే ఇట్లుంటే.. వచ్చినంక ఎట్లుంటదో మాకిప్పుడే భయమైతాంది. నేను రెడ్డినో.. రావునో.. అయితే ముందే అవకాశ మిచ్చేటోళ్లు..’ అంటూ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహంగా తన ప్రసంగం ప్రారంభించారు. తనకు ఆలస్యంగా మాట్లాడే అవకాశం ఇచ్చారంటూ అక్కసు వెళ్లగక్కారు. దీంతో నిర్వాహకులు, వేదికపై ఉన్న పార్టీ ముఖ్యులందరూ అవాక్కయ్యారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ జానారెడ్డినో... జైపాల్‌రెడ్డినో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి. జైపాల్‌రెడ్డి కేంద్రంలోనే ఉండాల్సిన అవసరం ఉంది... సోనియాకు సలహాలు ఇచ్చేందుకు అక్కడే ఉండాలి. నాలాంటి దళితులకు మాత్రం సీఎంగా అవకాశం ఇవ్వొద్దు...’ అని సర్వే అన్నారు.