
ఏదీ బీమా..?
పంట రుణాల మాఫీపై ప్రభుత్వ వైఖరితో
బీమా కోల్పోయిన రైతులు
బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితి
కరవుతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు
ఆందోళనలో అన్నదాతలు
రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది రైతుల పరిస్థితి..! పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో విధానం పూటకో మాట చెబుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వాతావరణ, పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి రైతులది. తీవ్ర దుర్భిక్షం వల్ల ఖరీఫ్ పంటను నష్టపోయిన రైతులకు బీమా ధీమా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు.
తిరుపతి: జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశెనగ, మరో 1.5 లక్షల హెక్టార్లలో వరి, చెరకు, కంది తదితర పం టలు సాగుచేశారు. వేరుశెనగకు వాతావరణ బీమా.. వరి, కంది, చెరకు పంటలకు సవరించిన పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు సెప్టెంబర్ 15, సవరించిన పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2,793 కోట్ల ను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయిం చారు. పంట రుణాలను పంపిణీ చేసేటపుడే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు. అయితే, జిల్లాలో రూ.11,180.25 కోట్లను బ్యాంకులకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు బకాయిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు చెల్లించలేదు.
అధికారంలోకి వచ్చాక పంట రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో ఏ ఒక్క రైతుకు కొత్తగా రుణాలను బ్యాంకర్లు పంపిణీ చేయలేదు. వేరుశెనగ పంటకు హెక్టారుకు రూ.1375ను ప్రీమియంగా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ప్రీమియంలో రూ.687.50 రైతు చెల్లిస్తే.. తక్కిన రూ.687.50 ప్రభుత్వం చెల్లిస్తుంది. వరి పంటకు సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంగా పంట రుణం మొత్తంలో 3.3 శాతం చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం 1.30 శాతం.. రైతు రెండు శాతం చెల్లించాలి. కందికి రైతు 5.6 శాతం.. ప్రభుత్వం 8.40 శాతం, చెరకుకు ప్రభుత్వం 1.6 శాతం.. రైతు రూ.2.4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా పంటల రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు.
ఫలితంగా బ్యాంకర్లు రుణం ఇవ్వకపోవడంతో రైతులు వాతావరణ బీమా, సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంలను చెల్లించలేకపోయారు. కేవలం 2,318 మంది రైతులు మాత్రమే సొంతంగా బ్యాంకర్ల ద్వారా జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించారు. తీవ్రమైన దుర్భిక్షం వల్ల ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. కంది పంటదీ అదే దుస్థితి. చెరకు, వరి దిగుబడులపై దుర్భిక్షం తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస కరవులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఖరీఫ్ పంటలు ముంచాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు కనీసం బీమా ధీమా కూడా దక్కకుండా పోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.