పసుపు పంటకు ధీమా లేనట్లే!
బాల్కొండ : పంటల బీమాలో పలు మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పసుపు రైతులను మాత్రం పట్టించుకోలేదు. నూతన వ్యవసాయ పంటల బీమా పథకంలో పసుపు ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ప్రకృతి బీభత్సం వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు జిల్లా యూనిట్‌గా తీసుకుని బీమా క్లయిమ్ చెల్లించేవారు. కానీ కొత్త రాష్ట్రంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరికి గ్రామం యూనిట్‌గా తీసుకున్న సర్కార్.. పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, కంది, తదితర తొమ్మిది పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ఆదేశించింది.
ఈ తొమ్మిది పంటల్లో పసుపు లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న ధీమా లేకుండా పోయింది. గతంలో పంట రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకర్లు బీమా ప్రీమియం మినహాయించుకుని రుణం ఇచ్చేవారు. ఎకరానికి రూ. 6 వేల బీమా ప్రీమియం వసూలు చేసేవారు. కానీ పంట నష్టపోయినా ఏనాడూ బీమా క్లయిమ్ అందలేదు. అప్పట్లో జిల్లాను యూనిట్‌గా తీసుకుని బీమా చేయడం వల్లే పరిహారం అందలేదు. జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతింటేనే అప్పట్లో బీమా క్లయిమ్ చెల్లించేవారు. దీంతో ఎప్పుడూ రైతులకు పంట ప్రమాద బీమా డబ్బులు అందలేదు.
ప్రస్తుతం పంట బీమాలో మార్పులు చేయడం వల్ల కొంత మేలు జరగవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కానీ పసుపు రైతులకు ఆ సౌకర్యం కల్పించ లేదు. నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్‌లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తారు. సుమారు 20 వేల హెక్టార్లకుపైగా ఈ పంట సాగవుతుంది. ఎకరం విస్తీర్ణంలో పంట సాగుకు లక్ష రూపాయలనుంచి లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసే పంటకు బీమా రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.