న్యూఢిల్లీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని సోమ వారం ప్రధాని మోదీ చెప్పారు. ‘పెట్టుబడి వ్యయం తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర కల్పించడం, సాగు సమయంలోనూ, పంట చేతికొచ్చాక నష్టాలను అరికట్టడం, రైతుల ఆదాయ మార్గాలను పెంచడం.. అనే 4 వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాం’ అని మోదీ అన్నారు.
గతంలో రైతులు బలవంతంగా, అశాస్త్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చేదని, యూరియా కోసం రైతులు లాఠీ చార్జీలను భరించాల్సి వచ్చేదని ప్రధాని గుర్తు చేశారు. తామొచ్చాక వేప పూతతో ఉన్న యూరియాను తీసుకువచ్చామని, దీనివల్ల దిగుబడి పెరిగిందన్నారు. రైతులకు ఇప్పుడు సమగ్ర పంట బీమా పథకం అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగ కల్పనపై విపక్షాల రాద్ధాంతం
తమ ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఉపాధి కల్పనకు సంబంధించి నమ్మదగిన గణాంకాలు మన దగ్గర లేవన్నారు. సరైన గణాంకాలు లేకపోవడం వల్ల తమకిష్టమొచ్చినట్లుగా విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం లభిస్తోందని స్వరాజ్య పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.‘గత కర్ణాటక ప్రభుత్వం తమ హయాంలో 53 లక్షల ఉద్యోగాలు కల్పించామంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గత హయాంలో 68 లక్షల ఉద్యోగాలు చూపించామంది. రాష్ట్రాలు ఉద్యోగాలు ఈ స్థాయిలో కల్పిస్తూ ఉంటే.. దేశంలో ఉపాధి కల్పన జరగడం లేదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించారు.
నవీన భారత దేశంలోని కొత్త ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ కల్పనను లెక్కించే విశ్వసనీయ వ్యవస్థ లేదన్నారు. ‘దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో దాదాపు 3 లక్షలమంది ఔత్సాహికులు కామన్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ సాయం పొందిన స్టార్ట్ అప్ కంపెనీలు దాదాపు 15 వేలున్నాయి. అవి సాధ్యమైన స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈపీఎఫ్‌ఓ లెక్కల ప్రకారమే గత సంవత్సరం సంఘటిత రంగంలో 70 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సెప్టెంబర్ 2017–ఏప్రిల్ 2018 మధ్య 41 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. సంఘటిత రంగంలోనే 8 నెలల్లో 41 లక్షల ఉద్యోగాలు లభిస్తే.. అసంఘటితరంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యను మీరే ఊహించండి’ అని అన్నారు. ‘ముద్ర పథకం కింద 12 కోట్ల రుణాలిచ్చాం. ఒక రుణం కనీసం ఒక్కరికైనా ఉపాధి కల్పిస్తుంది కదా!’ అన్నారు.
ఆర్థిక వేత్త హయాంలోనే సర్వనాశనం
యూపీఏ హయాంలో స్వయానా ఆర్థికవేత్త అయిన ఒక ప్రధాని, అన్నీ తనకు తెలుసని భావించే ఆర్థిక మంత్రి సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ స్థాయికి చేరిందన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నపుడు అస్థిర ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉండేదని గుర్తు చేశారు. యూపీఏ వైఫల్యాలపై రాజకీయం చేయాలనుకోలేదని, అందువల్లనే నాటి ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై అప్పుడు శ్వేతపత్రం తీసుకురాలేదని వివరించారు. రాజనీతి(రాజకీయ ప్రయోజనాలు) కన్నా రాష్ట్రనీతి(దేశ ప్రయోజనాలు) ముఖ్యమని భావించానన్నారు.
శాంతికి భారత్ కీలకం
ప్రస్తుత అస్థిర ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు భారత్ కీలక పాత్ర పోషించగలదని మోదీ పేర్కొన్నారు. పలు దేశాల్లోని భారతీయ రాయబారులను ఉద్దేశించి న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. 3 రోజుల పాటు జరిగిన భారత రాయబారుల సదస్సులో చివరిరోజైన సోమవారం మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ప్రతినిధులు చర్చించారు. కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆ శాఖ సహాయమంత్రులు, పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, వివిధ అంతర్జాతీయ సంస్థల్లోని విభాగాల్లో కీలక విధులు నిర్వరిస్తున్న భారతీయ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment