Common service centres
-
కామన్ సర్విస్ సెంటర్లుగా పీఏసీఎస్‌లు
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని 1,995 పీఏసీఎస్‌లలో కంప్యూటరైజేషన్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరోవైపు కామన్ సర్విస్ సెంటర్(సీఎస్సీ)లుగా తీర్చిదిద్దడం ద్వారా వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని సంకలి్పంచింది. ఇందుకోసం ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నాబార్డు సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్సీ–ఎస్పీవీ)తో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎస్సీ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించారు. యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం నుంచి పౌరులకు అందే సేవల నుంచి వ్యాపార, ఆర్థిక, విద్య, వ్యవసాయ, ఆరోగ్య తదితర సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ పౌరులకు, ముఖ్యంగా రైతులకు సీఎస్సీ డిజిటల్ సేవా పోర్టల్‌లో పేర్కొన్న 300 కంటే ఎక్కువ ఈ–సేవలను అందించేందుకు పీఏసీఎస్‌లకు అనుమతిస్తారు. వినియోగదారులకు అందించే సేవల ప్రాతిపదికన పీఏసీఎస్‌లకు కమిషన్ చెల్లిస్తారు. ఇది వారి సంప్రదాయ వ్యాపార కార్యకలాపాలకు అదనంగా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలో 1,995 పీఏసీఎస్‌లు ఉండగా, వాటిలో 1,646 పీఏసీఎస్‌లు కామన్ సర్వీస్ సెంటర్ల కింద సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1,497 పీఏసీఎస్‌లకు సీఎస్సీ ఐడీలను జారీ చేయగా.. 471 పీఏసీఎస్‌లలో సీఎస్సీ సేవలకు శ్రీకారం చుట్టారు. మిగిలిన వాటిలో దశలవారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందించే సేవలివే పాస్ పోర్ట్ సేవలు, పాన్ కార్డ్, ఈ–జిల్లా, వివిధ రకాల సర్టిఫికెట్లు, లైసెన్సులు, రేషన్ కార్డుల జారీ, పెన్షన్లు, ఆర్టీఐ ఫైలింగ్, ఎలక్ట్రానిక్ కమిషన్ సేవలు, ఐటీఆర్ ఫిల్లింగ్, పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్, విద్యుత్ బిల్లు సేకరణ, ఈ–స్టాంప్‌ల జారీ, డీటీహెచ్ రీచార్జ్, మొబైల్ రీచార్జ్, ఈ–వాలెట్ రీచార్జ్, బ్యాంకింగ్, బీమా, పెన్షన్ సేవలు, అన్నిరకాల డిజిటల్ పేమెంట్స్, పీఎంజీ డీఐఎస్‌హెచ్‌ఏ, స్కిల్ డెవలప్మెంట్, ఇతర విద్యాకోర్సులు (ఎన్ఐఈఎల్ఐటీ/సీఎస్సీ, బీసీసీ, ఎన్ఐఓఎస్,ఇంగ్లిష్/ట్యాలీ/జీఎస్టీ,/సర్కారి పరీక్ష), టెలీ హెల్త్ కన్సల్టేషన్స్, ఔషధాల విక్రయాలు, ఆయుష్మాన్ భారత్, పతంజలి, స్వదేశీ సమృద్ధి కార్డ్‌ల జారీ, రైలు బుకింగ్, విమాన ప్రయాణం, హోటల్ బుకింగ్‌తో పాటు కోవిడ్ వంటి విపత్తుల వేళల్లో సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్ ద్వారా రోజువారీ నిత్యావసర వస్తువులను ఇంటింటికి డెలివరీ చేయడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పీఏసీఎస్‌ల బలోపేతమే లక్ష్యం పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు గ్రామస్థాయిలో పౌరులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కామన్ సర్విస్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. గ్రామ స్థాయిలోనే దాదాపు 300కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్సీల ద్వారా అందించే సేవలను బట్టి ఆయా పీఏసీఎస్‌లకు కమిషన్ రూపంలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. – అహ్మద్‌బాబు, కమిషనర్, సహకార శాఖ -
త్వరలో మళ్లీ సీఎస్సీ ఆధార్ కేంద్రాలు?
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, సమాచారంలో మార్పులు, చేర్పులు, ఆన్లైన్ దరఖాస్తుల ఫైలింగ్‌లో ప్రజలకు సహకరించడం వంటి సేవలకు త్వరలో మళ్లీ కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)ను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘నాన్–బయోమెట్రిక్’ (వేలిముద్ర అవసరం లేని)కు మాత్రమే ఈ సేవలు పరిమితమవుతాయని సమాచారం. ఈ మేరకు అనుమతులు జారీపై యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేపథ్యం ఇదీ:ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్ సేవల పునఃప్రారంభానికి తమను అనుమతించాలని సీఎస్‌ఈలను నిర్వహిస్తున్న గ్రామ స్థాయి సంస్థలు (వీఎల్ఈ) ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తాము ఎంతో వ్యయంతో పరికరాలను కొన్నామని, ఆధార్ సంబంధ కార్యకలాపాలకు ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకున్న తరుణంలో యూఐడీఏఐ నిర్ణయం సరికాదని వీఎల్ఈలు కేంద్రానికి ఇప్పటికే విన్నవించాయి. కేంద్రం కూడా ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తోంది. 120 కోట్ల ఆధార్ కార్డుదారుల బయోమెట్రిక్ డేటా భద్రతకుగాను సీఎస్సీ అలాగే ప్రైవేటు ఆపరేటర్లపై యూఐడీఏఐ నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. తక్కువ ఫీజుతో సీఎస్సీలకు తాజా అనుమతుల వల్ల ఆన్లైన్ వ్యవస్థతో పెద్దగా పరిచయంలేని గ్రామీణ ప్రాంతవాసులకూ ఎంతో ప్రయోజనం కలుగుతుందని యూఐడీఏఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. -
రైతుల కోసం నాలుగంచెల వ్యూహం
న్యూఢిల్లీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని సోమ వారం ప్రధాని మోదీ చెప్పారు. ‘పెట్టుబడి వ్యయం తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర కల్పించడం, సాగు సమయంలోనూ, పంట చేతికొచ్చాక నష్టాలను అరికట్టడం, రైతుల ఆదాయ మార్గాలను పెంచడం.. అనే 4 వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాం’ అని మోదీ అన్నారు. గతంలో రైతులు బలవంతంగా, అశాస్త్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చేదని, యూరియా కోసం రైతులు లాఠీ చార్జీలను భరించాల్సి వచ్చేదని ప్రధాని గుర్తు చేశారు. తామొచ్చాక వేప పూతతో ఉన్న యూరియాను తీసుకువచ్చామని, దీనివల్ల దిగుబడి పెరిగిందన్నారు. రైతులకు ఇప్పుడు సమగ్ర పంట బీమా పథకం అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ కల్పనపై విపక్షాల రాద్ధాంతం తమ ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఉపాధి కల్పనకు సంబంధించి నమ్మదగిన గణాంకాలు మన దగ్గర లేవన్నారు. సరైన గణాంకాలు లేకపోవడం వల్ల తమకిష్టమొచ్చినట్లుగా విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం లభిస్తోందని స్వరాజ్య పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.‘గత కర్ణాటక ప్రభుత్వం తమ హయాంలో 53 లక్షల ఉద్యోగాలు కల్పించామంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గత హయాంలో 68 లక్షల ఉద్యోగాలు చూపించామంది. రాష్ట్రాలు ఉద్యోగాలు ఈ స్థాయిలో కల్పిస్తూ ఉంటే.. దేశంలో ఉపాధి కల్పన జరగడం లేదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించారు. నవీన భారత దేశంలోని కొత్త ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ కల్పనను లెక్కించే విశ్వసనీయ వ్యవస్థ లేదన్నారు. ‘దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో దాదాపు 3 లక్షలమంది ఔత్సాహికులు కామన్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ సాయం పొందిన స్టార్ట్ అప్ కంపెనీలు దాదాపు 15 వేలున్నాయి. అవి సాధ్యమైన స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ లెక్కల ప్రకారమే గత సంవత్సరం సంఘటిత రంగంలో 70 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సెప్టెంబర్ 2017–ఏప్రిల్ 2018 మధ్య 41 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. సంఘటిత రంగంలోనే 8 నెలల్లో 41 లక్షల ఉద్యోగాలు లభిస్తే.. అసంఘటితరంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యను మీరే ఊహించండి’ అని అన్నారు. ‘ముద్ర పథకం కింద 12 కోట్ల రుణాలిచ్చాం. ఒక రుణం కనీసం ఒక్కరికైనా ఉపాధి కల్పిస్తుంది కదా!’ అన్నారు. ఆర్థిక వేత్త హయాంలోనే సర్వనాశనం యూపీఏ హయాంలో స్వయానా ఆర్థికవేత్త అయిన ఒక ప్రధాని, అన్నీ తనకు తెలుసని భావించే ఆర్థిక మంత్రి సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ స్థాయికి చేరిందన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నపుడు అస్థిర ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉండేదని గుర్తు చేశారు. యూపీఏ వైఫల్యాలపై రాజకీయం చేయాలనుకోలేదని, అందువల్లనే నాటి ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై అప్పుడు శ్వేతపత్రం తీసుకురాలేదని వివరించారు. రాజనీతి(రాజకీయ ప్రయోజనాలు) కన్నా రాష్ట్రనీతి(దేశ ప్రయోజనాలు) ముఖ్యమని భావించానన్నారు. శాంతికి భారత్ కీలకం ప్రస్తుత అస్థిర ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు భారత్ కీలక పాత్ర పోషించగలదని మోదీ పేర్కొన్నారు. పలు దేశాల్లోని భారతీయ రాయబారులను ఉద్దేశించి న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. 3 రోజుల పాటు జరిగిన భారత రాయబారుల సదస్సులో చివరిరోజైన సోమవారం మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ప్రతినిధులు చర్చించారు. కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆ శాఖ సహాయమంత్రులు, పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, వివిధ అంతర్జాతీయ సంస్థల్లోని విభాగాల్లో కీలక విధులు నిర్వరిస్తున్న భారతీయ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
ప్రజల వద్దకే ఎల్ఎల్ఆర్ టెస్ట్
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎల్ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్ఎల్ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. -
సామాన్యుడికి అందుబాటులో..
కొల్లాపూర్‌రూరల్ : కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకింగ్ సేవలకు దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మండలంలోని సింగోటంలో స్థానిక సర్పంచ్ వెంకటస్వామి కృషితో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకుంది. గత ఏడాది కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహంతో గ్రామ పంచాయతీలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలకు డబ్బు ఇబ్బంది లేకుండా ఏడాదిగా దిగ్విజయవంతంగా కామన్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతూ నిర్వాహకులు ప్రశంసలందుకుంటున్నారు. సేవలు ప్రశంసనీయం కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే దాదాపు దాదాపుగా రూ.రెండు కోట్ల లావాదేవీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సెంటర్‌గా నిర్వాహకురాలు పద్మ జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డు అందుకున్నారు. నేటికి సంవత్సరం కావడంతో ఐదు కోట్ల లావాదేవీలను దిగ్విజయవంతంగా పూర్తిచేశారు. ఆధార్‌కార్డు లింకుతో వేలిముద్రలతో కామన్ సర్వీస్ సెంటర్లో డబ్బు లావాదేవీలు కొనసాగుతున్నా యి. గ్రామ సమీపంలో ఉన్న ఎత్తం, మై లారం, మైలారం తండా, జావాయిపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల ప్రజలు సర్వీస్ సెం టర్కు వచ్చి తమ డబ్బులను ఇబ్బం దులు లేకుండా డ్రా చేసుకుంటున్నారు. సేవలు అందుబాటులో ఈజీఎస్ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, ఎంప్లాయీస్ జీతాలు, వృదా ్ధప్య పింఛన్లు కూడా సర్వీస్ సెంటర్లోనే తీసుకుంటున్నారు. నిర్వాహకురాలు గ్రా మంలో వృద్ధులు కార్యాల యానికి రాని తరుణంలో వారి ఇంటి వద్దకు కంప్యూటర్ మిషన్‌ను తీసుకెళ్లి అక్కడే పింఛన్లు ఇస్తూ ఆదర్శంగా నిలిచారు. సమస్యలు అధిగమిస్తున్నా సర్వీస్ సెంటర్ నుంచి ప్రజలకు సేవలందించడంలో ఇబ్బందులు వచ్చినా అధిగమించి ముందుకు సాగుతున్నా. ఈ నిర్వహణలో సర్పంచ్ వెంకటస్వామి, సర్వీస్ సెంటర్ స్టేట్, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో సజావుగా కొనసాగిస్తున్నా. – పద్మ, నిర్వాహకురాలు ఇబ్బంది తప్పింది గ్రామ స్థాయిలో సర్వీస్‌సెంటర్‌తో ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో 8 కిలోమీటర్ల మేర కొల్లాపూర్ పట్టణానికి వెళ్లి బ్యాంకుల ముందు పడిగాపులు కాసి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. కామన్ సర్వీస్ సెంటర్‌తో ప్రజలకు సమస్యలు తీరుతున్నాయి. – రామస్వామి, సింగోటం కలెక్టర్ ప్రోత్సాహంతో.. కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే సర్వీస్ సెంటర్ ప్రారంభించాం. నిర్వాహకురాలికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్రామపంచాయతీ నుంచి పరిష్కరిస్తూ సెంటర్‌ను ముందుకు సాగిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. – వెంకటస్వామి, సర్పంచ్ -
సీఎస్సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)ల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం లక్షకు పైగా సీఎస్సీలను ఎంపిక చేసింది. ఈ సెంటర్ల ద్వారా పాస్‌పోర్ట్ సంబంధిత సేవలు అందిస్తారు. ఈ విధానానికి జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో 2006లోనే ఆమోదం తెలిపినా ఇప్పటికి కార్యాచరణ మొదలైంది. ఈ సెంటర్లలో పాస్‌పోర్ట్ దరఖాస్తు పూర్తి చేయడం, ఆ దరఖాస్తును ఇంటర్నెట్కు అప్లోడ్ చేయడం, ఫీజులు చెల్లింపు తదితర పనులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దీనికోసం రూ.100 నామమాత్రపు రుసుము వసూలుచేస్తారు. తొలుత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో 15 కేంద్రాల్లో మార్చి రెండవ వారంలో ఈ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. మార్చి చివరినాటికి లేదా ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారం కోసం www.passportindia.gov.in వెబ్సైట్లో చూడొచ్చు. అంతేగాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1800-258-1800 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కూడా ఫోన్ చేసి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. గతంలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించినా అనుకున్నంతగా అది సఫలం కాలేదు.