
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, సమాచారంలో మార్పులు, చేర్పులు, ఆన్‌లైన్ దరఖాస్తుల ఫైలింగ్‌లో ప్రజలకు సహకరించడం వంటి సేవలకు త్వరలో మళ్లీ కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ)ను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘నాన్–బయోమెట్రిక్’ (వేలిముద్ర అవసరం లేని)కు మాత్రమే ఈ సేవలు పరిమితమవుతాయని సమాచారం. ఈ మేరకు అనుమతులు జారీపై యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేపథ్యం ఇదీ:ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేషన్ సేవల పునఃప్రారంభానికి తమను అనుమతించాలని సీఎస్‌ఈలను నిర్వహిస్తున్న గ్రామ స్థాయి సంస్థలు (వీఎల్‌ఈ) ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తాము ఎంతో వ్యయంతో పరికరాలను కొన్నామని, ఆధార్ సంబంధ కార్యకలాపాలకు ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకున్న తరుణంలో యూఐడీఏఐ నిర్ణయం సరికాదని వీఎల్‌ఈలు కేంద్రానికి ఇప్పటికే విన్నవించాయి. కేంద్రం కూడా ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తోంది. 120 కోట్ల ఆధార్ కార్డుదారుల బయోమెట్రిక్ డేటా భద్రతకుగాను సీఎస్‌సీ అలాగే ప్రైవేటు ఆపరేటర్లపై యూఐడీఏఐ నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. తక్కువ ఫీజుతో సీఎస్‌సీలకు తాజా అనుమతుల వల్ల ఆన్‌లైన్ వ్యవస్థతో పెద్దగా పరిచయంలేని గ్రామీణ ప్రాంతవాసులకూ ఎంతో ప్రయోజనం కలుగుతుందని యూఐడీఏఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.