కామన్‌ సర్విస్‌ సెంటర్లుగా పీఏసీఎస్‌లు  | PACS as Common Service Centres | Sakshi
Sakshi News home page

కామన్‌ సర్విస్‌ సెంటర్లుగా పీఏసీఎస్‌లు 

Published Sun, Aug 20 2023 4:05 AM | Last Updated on Sun, Aug 20 2023 9:10 AM

PACS as Common Service Centres - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌)ను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని 1,995 పీఏసీఎస్‌లలో కంప్యూటరైజేషన్‌ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరోవైపు కామన్‌ సర్విస్‌ సెంటర్‌(సీఎస్‌సీ)లుగా తీర్చిదిద్దడం ద్వారా వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని సంకలి్పంచింది. ఇందుకోసం ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నాబార్డు సీఎస్‌సీ ఈ గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఎస్‌సీ–ఎస్‌పీవీ)తో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎస్‌సీ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర స్థాయిలో నోడల్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు.

యూనివర్సల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం నుంచి పౌరులకు అందే సేవల నుంచి వ్యాపార, ఆర్థిక, విద్య, వ్యవసాయ, ఆరోగ్య తదితర సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ పౌరులకు, ముఖ్యంగా రైతులకు సీఎస్‌సీ డిజిటల్‌ సేవా పోర్టల్‌లో పేర్కొన్న 300 కంటే ఎక్కువ ఈ–సేవలను అందించేందుకు పీఏసీఎస్‌లకు అనుమతిస్తారు.

వినియోగదారులకు అందించే సేవల ప్రాతిపదికన పీఏసీఎస్‌లకు కమిషన్‌ చెల్లిస్తారు. ఇది వారి సంప్రదాయ వ్యాపార కార్యకలాపాలకు అదనంగా ఆర్థిక ప్రయోజనం పొందేందుకు దోహదపడుతుంది. రాష్ట్రంలో 1,995 పీఏసీఎస్‌లు ఉండగా, వాటిలో 1,646 పీఏసీఎస్‌లు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల కింద సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1,497 పీఏసీఎస్‌లకు సీఎస్‌సీ ఐడీలను జారీ చేయగా.. 471 పీఏసీఎస్‌లలో సీఎస్‌సీ సేవలకు శ్రీకారం చుట్టారు. మిగిలిన వాటిలో దశలవారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అందించే సేవలివే 
పాస్‌ పోర్ట్‌ సేవలు, పాన్‌ కార్డ్, ఈ–జిల్లా, వివిధ రకాల సర్టిఫికెట్‌లు, లైసెన్సులు, రేషన్‌ కార్డుల జారీ, పెన్షన్‌లు, ఆర్‌టీఐ ఫైలింగ్, ఎలక్ట్రానిక్‌ కమిషన్‌ సేవలు, ఐటీఆర్‌ ఫిల్లింగ్, పెన్షనర్ల కోసం జీవన్‌ ప్రమాణ్, విద్యుత్‌ బిల్లు సేకరణ, ఈ–స్టాంప్‌ల జారీ, డీటీహెచ్‌ రీచార్జ్, మొబైల్‌ రీచార్జ్, ఈ–వాలెట్‌ రీచార్జ్, బ్యాంకింగ్, బీమా, పెన్షన్‌ సేవలు, అన్నిరకాల డిజిటల్‌ పేమెంట్స్, పీఎంజీ డీఐఎస్‌హెచ్‌ఏ, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇతర విద్యాకోర్సులు (ఎన్‌ఐఈఎల్‌ఐటీ/సీఎస్‌సీ, బీసీసీ, ఎన్‌ఐఓఎస్,ఇంగ్లిష్/ట్యాలీ/జీఎస్‌టీ,/సర్కారి పరీక్ష), టెలీ హెల్త్‌ కన్సల్టేషన్స్, ఔషధాల విక్రయాలు, ఆయుష్మాన్‌ భారత్, పతంజలి, స్వదేశీ సమృద్ధి కార్డ్‌ల జారీ, రైలు బుకింగ్, విమాన ప్రయాణం, హోటల్‌ బుకింగ్‌తో పాటు కోవిడ్‌ వంటి విపత్తుల వేళల్లో సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ–స్టోర్‌ ద్వారా రోజువారీ నిత్యావసర వస్తువులను ఇంటింటికి డెలివరీ చేయడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

పీఏసీఎస్‌ల బలోపేతమే లక్ష్యం 
పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం  చేయడంతోపాటు గ్రామస్థాయిలో పౌరులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి  తీసుకురావడమే లక్ష్యంగా కామన్‌ సర్విస్‌  సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. గ్రామ స్థాయిలోనే దాదాపు 300కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్‌సీల ద్వారా అందించే సేవలను బట్టి ఆయా  పీఏసీఎస్‌లకు కమిషన్‌ రూపంలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. 
– అహ్మద్‌బాబు, కమిషనర్, సహకార శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement