అధికారులతో చర్చిస్తున్న రవాణా శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఎల్‌ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు.
మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్‌ఎల్‌ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment