సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది.
భూ కేటాయింపుల్లోనూ బెస్ట్
దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది.
వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది.
ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది
మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది.
దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్‌ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment