Commerce department
-
‘డీట్’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్/ యాప్ ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. ⇒ నిరుద్యోగులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.⇒ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.⇒ యాప్‌లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. -
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
కాఫీ బోర్డు సభ్యురాలిగా ఎంపీ మాధవి
సాక్షి, న్యూఢిల్లీ: కాఫీ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాఫీ బోర్డును పునర్నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్.చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్‌దండే, కాఫీ పండించే వారి విభాగంలో విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్తపాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వరరావు, వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్‌రావు, ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీశాంత్‌లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది. -
కంప్యూటర్లు, బంగారం, యూరియా... వీటి దిగుమతులపై కేంద్రం నజర్
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోతున్న ఉత్పత్తుల జాబితాను కేంద్రంలోని వివిధ శాఖలకు వాణిజ్య శాఖ అందజేసింది. కోకింగ్ కోల్, కొన్ని రకాల మెషినరీ, రసాయనాలు, డిజిటల్ కెమెరాలు ఇలా మొత్తం మీద 102 ఉత్పత్తులను గుర్తించింది. స్థానికంగానే వీటి ఉత్పత్తిని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని కోరింది. తద్వారా దిగుమతులను తగ్గించొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగుమతుల బిల్లును తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర వాణిజ్య శాఖ ఈ ఉత్పత్తులకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం కూడా నిర్వహించింది. దీర్ఘకాలం నుంచి వీటి దిగుమతులు క్రమంగా పెరుగుతూనే ఉన్నట్టు గుర్తించింది. 2021 మార్చి నుంచి ఆగస్ట్ వరకు దేశ దిగుమతుల బిల్లులో ఈ 102 ఉత్పత్తుల వాటానే 57.66 శాతంగా ఉన్నట్టు తెలుసుకుంది. బంగారం, ముడి పామాయిల్, ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్లు, పర్సనల్ కంప్యూటర్లు, యూరియా, స్టెయిన్లెస్ స్టీల్ స్క్రాప్, శుద్ధి చేసిన రాగి, కెమెరాలు, పొద్దుతిరుగుడు నూనె, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా వీటిల్లో ఉన్నాయి. 2021 ఏప్రిల్–అక్టోబర్ వరకు దేశ దిగుమతుల బిల్లు 331 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం అధికంగా ఉంది. -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్‌లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్మెంట్ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ... ► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ► మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి. ► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్‌లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు తగిన ఇన్ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు. ► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్చార్జ్గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం భారత్‌లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది. ► డిఫాల్టర్లకు ఊరట... ఐబీసీ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్‌ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్‌లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్‌ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. -
ఎగుమతులకు త్వరలోనే వరాలు
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకునే దిశగా ప్రభుత్వం అతి త్వరలోనే పలు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశం నుంచి ఎగుమతులు స్తబ్దుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రోత్సాహక చర్యలపై కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖల అధికారులు ఇప్పటికే పలు సార్లు భేటీ అయి చర్చలు కూడా నిర్వహించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నుంచి పనిచేస్తున్న యూనిట్లకు పన్ను ప్రయోజనాల గడువును పొడిగించడం ప్రభుత్వం పరిశీలిస్తున్న వాటిల్లో ఒకటి. 2020 మార్చి 31లోపు సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త యూనిట్లకు మాత్రమే పన్ను ప్రయోజనాలు ఉంటాయని 2016-17 కేంద్ర బడ్జెట్లో పేర్కొనడం కూడా జరిగింది. ఇక జెమ్స్, జ్యుయలరీ రంగానికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహక చర్యల్లో చోటు దక్కనుంది. రంగు రాళ్లు, పాలిష్డ్ వజ్రాల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఎగుమతులకు ఇస్తున్న రుణ పరిమితిని 60 శాతం నుంచి 90 శాతానికి పెంచడం కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉంది. దీనివల్ల ఎగమతులకు తక్కువ ధరలకే రుణాలు లభిస్తాయి. ఎగుమతి, దిగుమతి సరుకులకు సత్వర ఆమోదం తెలిపే విధానం అమలు చేయాలని కూడా భావిస్తోంది. దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇక దేశీయ తయారీని ప్రోత్సహించడం, అదే సమయంలో దిగుమతులను తగ్గించుకునేందుకు... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాల నుంచి వచ్చే దిగుమతుల విషయంలో కఠిన నిబంధనలను అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా పన్నులు తప్పించుకునేందుకు స్వేచ్ఛా వాణిజ్య దేశాల ద్వారా సరుకులను భారత్‌కు ఎగమతి చేయడం కష్టతరం అవుతుంది. పెద్ద ఫార్మా కంపెనీలకు వడ్డీ రాయితీలు, బాస్మతీయేతర బియ్యం తదితర ఎగుమతులకు ఎంఈఐఎస్ పథకం ప్రయోజనాలు వర్తింప చేయాలని మరోవైపు ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. -
ముడుపులు ఇస్తేనే బండి కదిలేది !
సాక్షి, విజయవాడ: వాణిజ్య పన్నులశాఖ అధికారులు చేసే వాహనాల తనిఖీ(వీటీ)లలో అవినీతి రాజ్యమేలుతోంది. తనిఖీలపై ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో.. కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించిన డీలర్ల వద్ద డబ్బులు గుంజుతూ ఉండటంతో వారు లబోదిబోమంటున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌ను బాదేశారు... విజయవాడ–1 డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం సీటీఓ కార్యాలయం అధికారులు సోమవారం రాత్రి ఐరన్ యార్డు వద్ద వీటీ చేశారు. రాజమండ్రికి చెందిన ఒక ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే కాంట్రాక్టర్ మహారాష్ట్రలో పనులు చేయిస్తుంటారు. దీనికి చెందిన సరుకు విజయవాడ నుంచి తీసుకెళుతూ బిల్లులన్ని సరిగానే ఉండేటట్లు చూసుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక డీసీటీఓ స్థాయి అధికారి ఆ కాంట్రాక్టర్‌ను ఇబ్బంది పెట్టి రూ.40వేలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టకపోవడంతో ఆ డీలరు నానా ఇబ్బంది పడి డబ్బులు ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లారు. తాను ఎంత నిజాయితీగా వున్నా.. తన వద్ద డబ్బులు గుంజడంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో బిల్లులు లేని వాహనాలను వదిలేసి.. గతంలో ఇదే వన్డివిజన్ పరిధిలో నందిగామ సర్కిల్లో డీసీటీఓ సీజ్ చేసిన వాహనాన్నే అక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి తప్పించిన విషయం విధితమే. అంతకు ముందు బిల్లులు లేకుండా ఉన్న వాహనాల వద్ద ముడుపులు తీసుకుని వదిలివేశారు. నిబంధనలు పాటించని, పాటించిన డీలర్లను ఒకేగాట కట్టేసి ముడుపులు వసూలు చేయడాన్ని డీలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులకు వాటాలు ! వాస్తవంగా జీఎస్టీ వచ్చిన కొత్తలో వాహనాల తనిఖీలు(వీటీ)లను రద్దు చేశారు. అయితే తమ ఆదాయం గండిపడటంతో తిరిగి వీటిలకు అనుమతులు ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు వీటీలు చేసినా నామమాత్రంగా జరిమానాలు కట్టిస్తున్నారే తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చేడట్లు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాహనాలను తనిఖీల పేరుతో తమ జేబుల్ని నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన సొమ్ములో ఉన్నతాధికారులకు వాటాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు కూడా వీటిలో జరిగే అవినీతిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నులశాఖలో ఐదేళ్లుగా బదిలీలు లేకపోవడం సిబ్బందికి అవకాశంగా మారింది. దీర్ఘకాలంగా ఒకే హోదాలో ఒకే చోట పాతుకుపోవడంతో డీలర్ల నుంచి ఏ విధంగా రాబట్టాలో క్షుణంగా తెలియడంతో అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది పై వచ్చే ఆరోపణలను విచారణ చేయించి చర్యలు తీసుకున్న దాఖాలాలు మాత్రం కనపడటం లేదు. -
రెండంకెల జీడీపీ వృద్ధే లక్ష్యం..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.340 లక్షల కోట్లు) క్లబ్‌లోకి చేరేందుకు రెండంకెల జీడీపీ వృద్ధే లక్ష్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా రెట్టింపై 3.4 శాతానికి చేరాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం వాణిజ్య శాఖ నూతన కార్యాలయ సముదాయం ‘వాణిజ్య భవన్’ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.నాలుగేళ్ల కాలంలో తమ ప్రభుత్వం స్థూల ఆర్థిక అంశాలను, ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు(క్యాడ్), ద్రవ్యలోటును నిర్ణీత పరిమితుల్లోనే కొనసాగిస్తూ దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసినట్టు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. దీని తర్వాత ఏంటి? అని ప్రశ్నిస్తూ... ‘‘జీడీపీ 2017–18 చివరి క్వార్టర్లో 7.7 శాతాన్ని తాకింది. ఇప్పుడిక 7–8%కి పేనే వృద్ధిని చూడాల్సిన అవసరం ఉంది. రెండంకెల స్థాయికి విస్తరించడమే లక్ష్యం కావాలి’’ అని ప్రధాని పేర్కొ న్నారు. 7–8% స్థాయి నుంచి జీడీపీని రెండంకెల వృద్ధికి తీసుకెళ్లేందుకు పనిచేయాలన్నారు. భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల క్లబ్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తుందా అని ప్రపంచం చూస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎగుమతులను రెట్టింపు చేయాలి దేశం నుంచి ఎగుమతులను పెంచాల్సి ఉందన్న ప్రధాని ఈ ప్రయత్నంలో రాష్ట్రాలు చురుకుగా పాలుపంచుకోవాలని కోరారు. వాణిజ్య శాఖ ప్రపంచ ఎగుమతుల్లో మన వాటాను ప్రస్తుతమున్న 1.6 శాతం నుంచి 3.4 శాతానికి చేర్చాలని కోరారు. అదే సమయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ తయారీ రంగ ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను రెట్టింపునకుపైగా పెంచాలని, దేశ జీడీపీని రెండంకెల స్థాయికి తీసుకెళ్లే సవాలును వాణిజ్యవేత్తలు, పరిశ్రమ స్వీకరించాలని కోరారు. అడ్డుపడటం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడమనే సంస్కృతి నుంచి దేశం బయటపడిందని, దీన్ని తమ ప్రభుత్వం సాధించిన విజయంగా పేర్కొన్నారు. అలాగే, 54 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ కింద నమోదు చేసుకున్నారని, దీంతో మొత్తం పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య కోటి దాటిందని ప్రధాని చెప్పారు. జీఎస్టీకి ముందు ఈ సంఖ్య 60 లక్షలేనన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పారు. కొత్తగా నిర్మించే వాణిజ్య భవనం నిర్ణీత వ్యవధిలోపు పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన భారత్ స్ఫూర్తితో, పాత విధానాల నుంచి బయటపడే చర్యల్లో భాగమే నూతన భవన నిర్మాణ ప్రాజెక్టులని చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి కృషి: సురేశ్ ప్రభు న్యూఢిల్లీ: చాలా దేశాలతో వాణిజ్య వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ప్రపంచ నూతన వాణిజ్య క్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారత్ మిత్రదేశంగా ఉంటుందన్నారు. అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై కేంద్ర సర్కారు దిగుమతి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఐదవ భారత్ అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో సదస్సు’లో సురేశ్ ప్రభు వాణిజ్య అంశంపై మాట్లాడారు. చిన్న మధ్య తరహా సంస్థలు మరిన్ని ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయని, నూతన భారతాన్ని ముందుకు నడిపిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఏ దేశానికి మేం వ్యతిరేకం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలతో వాణిజ్యం నిర్వహించాలనే అనుకుంటున్నాం. కనుక అన్ని దేశాలకూ స్నేహహస్తాన్ని అందిస్తున్నాం. మాతో కలసి రండి. మీ ఆలోచనలతో మెరుగైన ప్రపంచాన్ని, ఇరువురికీ ప్రయోజనకరంగా అభివృద్ధి చేద్దాం. భారత్‌కు లబ్ధి కలగాలని కోరుకుంటాం. కానీ, ఇతర దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కాదు. ఇరువురూ లబ్ధి పొందడాన్నే కోరుకుంటాం. అందుకే నూతన ప్రపంచ వాణిజ్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అని సురేష్ ప్రభు చెప్పారు. -
ప్యాకేజింగ్ ప్రమాణాల కోసం కమిటీ
ముంబై: దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ రానున్న నాలుగేళ్లలో 30 నుంచి 35 బిలియన్ డాలర్లు (రూ.2,34,500 కోట్లు) స్థాయికి వృద్ధి చెందుతుందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిశ్రమ స్థాయి 25 బిలియన్ డాలర్లు (1.67 లక్షల కోట్లు) స్థాయిలో ఉండగా ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఇందర్జిత్ సింగ్ తెలిపారు. ఈ కీలక రంగంలో వృద్ధి అవకాశాలను, ఎగుమతుల పరంగా ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన ప్యాకేజింగ్ ప్రమాణాలను ఖరారు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ముంబైలో జరిగిన ఏషియన్ ప్యాకేజింగ్ కాంగ్రెస్ 2016 సదస్సులో ఇందర్జిత్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీలో ఈ రంగానికి చెందిన వారితోపాటు ఎగుమతిదారులు ఉంటారని, వీరు ప్యాకేజింగ్ నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తారని చెప్పారు. -
నేదురుమల్లి స్థానానికి ఉపఎన్నిక
జూలై 3న నిర్వహణ షెడ్యూలు జారీ చేసిన ఈసీ ఏపీ నుంచి నిర్మలా సీతారామన్! పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం లేనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిన బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ను ప్రస్తుతం ఏపీ నుంచి ఖాళీ అయిన స్థానం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీకి, టీడీపీకి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూలును ప్రకటించింది. జూలై 3న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16న జారీ చేయనుంది. 23వ తేదీ వరకు నామినేషన్లకు గడువుంది. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుదిగడువు. అవసరమైన పక్షంలో ఎన్నికను జూలై 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయిస్తూ రాజ్యసభ సచివాలయం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేటాయింపులో నేదురుమల్లి ప్రాతినిధ్యం వహించిన స్థానం ఆంధ్రప్రదేశ్ కోటాలోకి వెళ్లింది. సుదీర్ఘ అస్వస్థత కారణంగా నేదురుమల్లి మే 9వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం 2016 జూలై 21 వరకు ఉంది. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక నిర్వహిస్తుండగా, ఈ స్థానం నుంచి గెలుపొందే సభ్యుని పదవీ కాలపరిమితి మిగిలిన ఒక ఏడాది 11 నెలలు మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకూ ఎన్నికల షెడ్యూలు.. ఇదిలా ఉండగా నేదురుమల్లి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానంతోపాటు దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలును ప్రకటించింది. టీఎం సెల్వగణపతి(తమిళనాడు) అనర్హతకు గురికావడం, ఒడిశాకు చెందిన శశిభూషణ్ బెహ్రా, రాబినారాయణ్ మహాపాత్ర లిద్దరూ రాజీనామా చేసిన కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.