ముంబై: దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ రానున్న నాలుగేళ్లలో 30 నుంచి 35 బిలియన్ డాలర్లు (రూ.2,34,500 కోట్లు) స్థాయికి వృద్ధి చెందుతుందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిశ్రమ స్థాయి 25 బిలియన్ డాలర్లు (1.67 లక్షల కోట్లు) స్థాయిలో ఉండగా ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు. ఈ కీలక రంగంలో వృద్ధి అవకాశాలను, ఎగుమతుల పరంగా ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన ప్యాకేజింగ్ ప్రమాణాలను ఖరారు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ముంబైలో జరిగిన ఏషియన్ ప్యాకేజింగ్ కాంగ్రెస్ 2016 సదస్సులో ఇందర్‌జిత్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీలో ఈ రంగానికి చెందిన వారితోపాటు ఎగుమతిదారులు ఉంటారని, వీరు ప్యాకేజింగ్ నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తారని చెప్పారు.