క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి జావదేకర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్‌మెంట్ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ...
► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు.
► మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌లలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి.
► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్‌లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్‌మెంట్‌ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లకు తగిన ఇన్‌ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు.
► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు.
పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం
భారత్‌లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్‌వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది.
► డిఫాల్టర్లకు ఊరట...
ఐబీసీ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్‌సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్‌డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్‌ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్‌లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్‌ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment