రెండంకెల జీడీపీ వృద్ధే లక్ష్యం.. | PM seeks double-digit GDP growth, raising India's share in world trade | Sakshi
Sakshi News home page

రెండంకెల జీడీపీ వృద్ధే లక్ష్యం..

Published Sat, Jun 23 2018 12:20 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

PM seeks double-digit GDP growth, raising India's share in world trade - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.340 లక్షల కోట్లు) క్లబ్‌లోకి చేరేందుకు రెండంకెల జీడీపీ వృద్ధే  లక్ష్యం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా రెట్టింపై 3.4 శాతానికి చేరాల్సి ఉందన్నారు.

ఢిల్లీలో శుక్రవారం వాణిజ్య శాఖ నూతన కార్యాలయ సముదాయం ‘వాణిజ్య భవన్‌’ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.నాలుగేళ్ల కాలంలో తమ ప్రభుత్వం స్థూల ఆర్థిక అంశాలను, ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు(క్యాడ్‌), ద్రవ్యలోటును నిర్ణీత పరిమితుల్లోనే కొనసాగిస్తూ దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసినట్టు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. దీని తర్వాత ఏంటి? అని ప్రశ్నిస్తూ... ‘‘జీడీపీ 2017–18 చివరి క్వార్టర్‌లో 7.7 శాతాన్ని తాకింది.

ఇప్పుడిక 7–8%కి పేనే వృద్ధిని చూడాల్సిన అవసరం ఉంది. రెండంకెల స్థాయికి విస్తరించడమే లక్ష్యం కావాలి’’ అని ప్రధాని పేర్కొ న్నారు. 7–8% స్థాయి నుంచి జీడీపీని రెండంకెల వృద్ధికి తీసుకెళ్లేందుకు పనిచేయాలన్నారు. భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల క్లబ్‌ను ఎప్పుడు బ్రేక్‌ చేస్తుందా అని ప్రపంచం చూస్తోందని మోదీ పేర్కొన్నారు.  

ఎగుమతులను రెట్టింపు చేయాలి
దేశం నుంచి ఎగుమతులను పెంచాల్సి ఉందన్న ప్రధాని ఈ ప్రయత్నంలో రాష్ట్రాలు చురుకుగా పాలుపంచుకోవాలని కోరారు. వాణిజ్య శాఖ ప్రపంచ ఎగుమతుల్లో మన వాటాను ప్రస్తుతమున్న 1.6 శాతం  నుంచి 3.4 శాతానికి చేర్చాలని కోరారు. అదే సమయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ తయారీ రంగ ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ఉదాహరణగా పేర్కొన్నారు.

ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను రెట్టింపునకుపైగా పెంచాలని, దేశ జీడీపీని రెండంకెల స్థాయికి తీసుకెళ్లే సవాలును వాణిజ్యవేత్తలు, పరిశ్రమ స్వీకరించాలని కోరారు. అడ్డుపడటం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడమనే సంస్కృతి నుంచి దేశం బయటపడిందని, దీన్ని తమ ప్రభుత్వం సాధించిన విజయంగా పేర్కొన్నారు. అలాగే,  54 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ కింద నమోదు చేసుకున్నారని, దీంతో మొత్తం పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య కోటి దాటిందని ప్రధాని చెప్పారు.

జీఎస్‌టీకి ముందు ఈ సంఖ్య 60 లక్షలేనన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పారు. కొత్తగా నిర్మించే వాణిజ్య భవనం నిర్ణీత వ్యవధిలోపు పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన భారత్‌ స్ఫూర్తితో, పాత విధానాల నుంచి బయటపడే చర్యల్లో భాగమే నూతన భవన నిర్మాణ ప్రాజెక్టులని చెప్పారు.


వాణిజ్య వివాదాల పరిష్కారానికి కృషి: సురేశ్‌ ప్రభు
న్యూఢిల్లీ: చాలా దేశాలతో వాణిజ్య వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. ప్రపంచ నూతన వాణిజ్య క్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారత్‌ మిత్రదేశంగా ఉంటుందన్నారు. అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై కేంద్ర సర్కారు దిగుమతి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ మరుసటి రోజే శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఐదవ భారత్‌ అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ స్టార్టప్‌ ఎక్స్‌పో సదస్సు’లో సురేశ్‌ ప్రభు వాణిజ్య అంశంపై మాట్లాడారు. చిన్న మధ్య తరహా సంస్థలు మరిన్ని ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయని, నూతన భారతాన్ని ముందుకు నడిపిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఏ దేశానికి మేం వ్యతిరేకం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలతో వాణిజ్యం నిర్వహించాలనే అనుకుంటున్నాం.

కనుక అన్ని దేశాలకూ స్నేహహస్తాన్ని అందిస్తున్నాం. మాతో కలసి రండి. మీ ఆలోచనలతో మెరుగైన ప్రపంచాన్ని, ఇరువురికీ ప్రయోజనకరంగా అభివృద్ధి చేద్దాం. భారత్‌కు లబ్ధి కలగాలని కోరుకుంటాం. కానీ, ఇతర దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కాదు. ఇరువురూ లబ్ధి పొందడాన్నే కోరుకుంటాం. అందుకే నూతన ప్రపంచ వాణిజ్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అని సురేష్‌ ప్రభు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement