వాణిజ్య పన్నుల శాఖ డివిజన్–1 కార్యాలయం
సాక్షి, విజయవాడ: వాణిజ్య పన్నులశాఖ అధికారులు చేసే వాహనాల తనిఖీ(వీటీ)లలో అవినీతి రాజ్యమేలుతోంది. తనిఖీలపై ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో.. కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించిన డీలర్ల వద్ద డబ్బులు గుంజుతూ ఉండటంతో వారు లబోదిబోమంటున్నారు.
ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌ను బాదేశారు...
విజయవాడ–1 డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం సీటీఓ కార్యాలయం అధికారులు సోమవారం రాత్రి ఐరన్ యార్డు వద్ద వీటీ చేశారు. రాజమండ్రికి చెందిన ఒక ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే కాంట్రాక్టర్ మహారాష్ట్రలో పనులు చేయిస్తుంటారు. దీనికి చెందిన సరుకు విజయవాడ నుంచి తీసుకెళుతూ బిల్లులన్ని సరిగానే ఉండేటట్లు చూసుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక డీసీటీఓ స్థాయి అధికారి ఆ కాంట్రాక్టర్‌ను ఇబ్బంది పెట్టి రూ.40వేలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టకపోవడంతో ఆ డీలరు నానా ఇబ్బంది పడి డబ్బులు ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లారు. తాను ఎంత నిజాయితీగా వున్నా.. తన వద్ద డబ్బులు గుంజడంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గతంలో బిల్లులు లేని వాహనాలను వదిలేసి..
గతంలో ఇదే వన్‌డివిజన్ పరిధిలో నందిగామ సర్కిల్‌లో డీసీటీఓ సీజ్ చేసిన వాహనాన్నే అక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి తప్పించిన విషయం విధితమే. అంతకు ముందు బిల్లులు లేకుండా ఉన్న వాహనాల వద్ద ముడుపులు తీసుకుని వదిలివేశారు. నిబంధనలు పాటించని, పాటించిన డీలర్లను ఒకేగాట కట్టేసి ముడుపులు వసూలు చేయడాన్ని డీలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
అధికారులకు వాటాలు !
వాస్తవంగా జీఎస్టీ వచ్చిన కొత్తలో వాహనాల తనిఖీలు(వీటీ)లను రద్దు చేశారు. అయితే తమ ఆదాయం గండిపడటంతో తిరిగి వీటిలకు అనుమతులు ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు వీటీలు చేసినా నామమాత్రంగా జరిమానాలు కట్టిస్తున్నారే తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చేడట్లు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాహనాలను తనిఖీల పేరుతో తమ జేబుల్ని నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన సొమ్ములో ఉన్నతాధికారులకు వాటాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు కూడా వీటిలో జరిగే అవినీతిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నులశాఖలో ఐదేళ్లుగా బదిలీలు లేకపోవడం సిబ్బందికి అవకాశంగా మారింది. దీర్ఘకాలంగా ఒకే హోదాలో ఒకే చోట పాతుకుపోవడంతో డీలర్ల నుంచి ఏ విధంగా రాబట్టాలో క్షుణంగా తెలియడంతో అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది పై వచ్చే ఆరోపణలను విచారణ చేయించి చర్యలు తీసుకున్న దాఖాలాలు మాత్రం కనపడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment