విజయవాడ : నగరంలో ఇద్దరు ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుళ్లు బరి తెగించి బూటకపు మాటలతో తాము సివిల్ పోలీసులమని చెప్పి హోటల్‌లో తనిఖీలు చేశారు. పటమట ఏరియాలోని మహానాడు రోడ్డులో ఓ హోటల్‌పై గత శనివారం ఎక్సైజ్ కానిస్టేబుల్స్ శ్రీరామ్మూర్తి, మధు తనిఖీలకు వెళ్లారు. ఆలస్యంగా వెలుగు చూసిన సమాచారం మేరకు వారిద్దరు సివిల్ పోలీసులమని హడావిడి చేశారు. హోటల్‌లోని ఓ రూంలో జూదం ఆడుతున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యే క్రమంలో కింద పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రామవరప్పాడుకు చెందిన సురేష్‌కు కాలు ఫ్రాక్చర్ అవగా, ఫణీకి చేయి ఫ్రాక్చర్ అయ్యి గాయాలకు గురయ్యారు.
వారిని వదలకుండా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఇద్దరు రూ.10 వేలు వసూలు చేసుకుని వెళ్లారు. గాయాలకు గురైన బాధితులిద్దరూ ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. రెండు రోజుల తర్వాత హోటల్ తనిఖీ చేసి జూదరుల నుంచి డబ్బు గుంజుకున్నది పటమట పోలీసులు కాదని బాధితులకు ఉప్పందింది. దీంతో వారు వెంటనే పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటమట పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఇద్దరు నగరంలోని ఎక్సైజ్ పోలీసులని గుర్తించారు. సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా హోటల్‌లో జూదం ఆడుతున్నారని విజయవాడకు చెందిన కె. వెంకట్రావు, ఎం. కరుణబాబు సమాచారం ఇచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎక్సైజ్ పోలీసులిద్దరితో పాటు సమాచారం ఇచ్చిన ఇద్దరిని కూడా పటమట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, ఇంతటితో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని భావించారు. ఈ సమాచారం తెలియటంతో ఎక్సైజ్ అధికారులు శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు ఎక్సైజ్ డిపార్టుమెంట్ అసోసియేషన్ నేతగా పని చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment