పట్టుబడిన లావణ్యశ్రీని విచారణ చేస్తున్న ఏసీబీ డీఎస్పీ కనకరాజు
విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ (వైద్యవిధాన పరిషత్) కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వై.లావణ్యశ్రీ ఓ వైద్యాధికారి నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నూజివీడు ఏరియా హాస్పటల్ ఈఎన్‌టీ విభాగంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఐ.ఉదయకుమార్ నుంచి లావణ్యశ్రీ లంచం డిమాండ్ చేశారు.
ఎల్‌పీసీ, ఎస్‌ఆర్‌ఫైల్‌కు సంబంధించిన బిల్స్ క్లియర్ కోసం సీనియర్ అసిస్టెంట్ రూ. 8 వేలు లంచం డిమాండ్ చే శారని ఉదయకుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం ఇవ్వకపోవడంతో ఫైల్‌ను తొక్కిపెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో ఏసీబీ అధికారులు వాయిస్ రికార్డింగ్‌లు కూడా చేశారు. రూ. 8 వేలు డబ్బు ఇవ్వగానే ఏసీబీ అధికారులు ఆమె నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని రసాయనాలు చేతులకు పూసి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. ఏసీబీ డీఎస్పీ కనకరాజు దర్యాప్తు చేసి లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐ హ్యాపీ కృపానందం, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment