పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ రబ్బాని
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్ తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు మండలం బి.కొత్తకోటకు చెందిన బాబాఫకృద్దీన్, అతని స్నేహితులు ఓబులేసు, నగేష్, ఆంజనేయులు, రంగనాథ్, సయ్యద్‌లాల్‌బాషా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూ.32 లక్షలతో కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు.
రాయదుర్గం, విడపనకల్లు రూరల్, విడపనకల్లు, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ)లో నిధులు లేనందున బిల్లులను పంచాయతీ రాజ్ శాఖ నుంచి చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో బిల్లుల కోసం బాబాఫకృద్దీన్ అతని మిత్రులు ధర్మవరం పంచాయతీరాజ్ డివిజన్ సూపరింటెండెంట్ రబ్బానిను కలిశారు. అయితే బిల్లులు పాస్ చేయాలంటే ఈఈకి 1శాతం, తనతో పాటు సిబ్బందికి 0.25 శాతం పర్సెంటేజ్ ప్రకారం రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాబా ఫకృద్దీన్ అతని స్నేహితులు ప్రస్తుతం తమకు రూ.19,38,884 బిల్లు రావాలని త్వరగా చేయాలని కోరారు. ఇందుకు రూ.25,500 ఇవ్వాలని రబ్బాని డిమాండ్ చేయగా...అందుకు ఒప్పుకున్న ఫకృద్దీన్ అతని మిత్రులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
అరెస్టు ఇలా..
పంచాయతీ రాజ్ సూపరింటెండ్ రబ్బాని గురించి తెలుసుకున్న ఏబీసీ తిరుపతి డీఎస్పీ, అనంతపురం ఇన్‌చార్జ్ డీఎస్పీ అల్లాబకాష్ నేతృత్వంలో సీఐలు ప్రభాకర్, సత్యనారాయణ, చక్రవర్తి తదితరులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం బాబాఫకృద్దీన్ ద్వారా రబ్బానిని సప్తగిరి సర్కిల్‌కు రప్పించారు. బాబాఫకృద్దీన్ రూ.25,500 లంచం రబ్బానికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రబ్బానిని అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లి కెమికల్ టెస్టు చేయడంతో లంచం తీసుకున్నట్లు రికార్డెడ్‌గా రుజువైంది.
విచారణలో కొందరి పేర్లు
ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ రబ్బానిని ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా రబ్బాని తనతో పాటు కొందరి అధికారులకు ఇందులో వాటా ఉందని తెలిపినట్లు సమాచారం. పంచాయతీరాజ్ ఈఈ అస్లాంబాషా, సీనియర్ అసిస్టెంట్ నరసయ్య, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ నాగశేఖర్ రెడ్డి పేర్లు చెప్పారు. వారిపై కూడా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ అల్లాబకాష్ తెలిపారు. కాగా ప్రస్తుతం తమ అదుపులో ఉన్న రబ్బానిని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment