ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో(ఫైల్)
28 మార్చి 2018 : జన్నారం మండలం కలమడుగుగ్రామంలో దయాకర్ అనే వ్యక్తి చనిపోయిన తన తాతకు చెందిన 24 గుంటల భూమిని కుటుంబ సభ్యుల పేరిట విరాసత్ చేయించేందుకు ఇన్‌చార్జి వీఆర్‌ఓ మహ్మద్ ఇక్బాల్‌ను సంప్రదించాడు. రూ.6వేల లంచం ఇవ్వందే పనికాదని తేల్చిచెప్పడంతో దయాకర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రూ.4వేలు లంచం తీసుకుంటూ ఇక్బాల్ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యాడు. గతంలో కూడా ఇక్బాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం విశేషం.
13 ఏప్రిల్ 2016 : మందమర్రి మండలం అందుగులపేట వీఆర్‌ఓ బూక్యా చందు సర్వేనెంబర్ 9/1లోని ఎకరా భూమి మ్యుటేషన్ కోసం మంచిర్యాలకు చెందిన నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయ్యాడు. అతని ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:గ్రామాల్లో రైతులకు తలలో నాలుకలా ఉండాల్సిన పట్వారీలు ధనార్జనకు ఎగబడ్డారు. సర్కారు భూములకు కాపాడాల్సిన వీఆర్‌ఓలే డబ్బులకు ఆశపడి ప్రైవేటు వ్యక్తుల పేరిట రాసిచ్చేశారు. అందినకాడికి దండుకునే పనిలో భాగంగా డబ్బులు ఇస్తే ఏమైనా చేసేందుకు వెనుకాడని పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా మొదలుకొని భూముల మ్యూటేషన్ వరకు.. సర్కారీ స్థలాల్లో పట్టాలు సృష్టించడం మొదలు.. అసైన్‌మెంట్ భూములను పట్టాలుగా మార్చే వరకు కొందరు వీఆర్‌ఓలు చేయని పనిలేదు. మంచిర్యాల జిల్లాలో భూములకు విలువ పెరిగిన నాటి నుంచి ఇక్కడ పనిచేసిన అనేకమంది వీఆర్‌ఓలు తమపై అధికారులనుకూడా శాసించే స్థాయిలో ఆస్తులు కూడబెట్టుకున్నారు. 2012 తరువాత భూముల పహాణీలను ఆన్‌లైన్‌లోకి మార్చే ప్రక్రియ మొదలైన తరువాత వీఆర్‌ఓల ఆదాయం కూడా భారీగా పెరిగింది.
అక్రమార్కులకు అండగా నిలిచి, సర్కారీ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు బదలాయించడం, సర్కారీ, అసైన్డ్, సీలింగ్ భూములను పట్టా భూములుగా ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం వంటి అక్రమాలతో భారీగా సంపాదించారు. నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో భూములను అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అనర్హులకు బదలాయింపు చేసిన ఉదంతంలో మల్లేష్, తిరుపతి అనే ఇద్దరు వీఆర్‌ఓల పాత్ర మీద జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ ఏకంగా హైకోర్టుకు నివేదిక అందజేశారు. దొరికిన వారే దొంగలు అనే తరహాలో వీరిద్దరు కనిపిస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల అండదండలు, ఉన్నతాధికారుల చలువతో అక్రమాలకు పాల్పడుతున్న వీఆర్‌ఓలు జిల్లాలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తగినంత మంది వీఆర్‌ఓలు లేక ఒక్కో పట్వారీకే రెండు మూడు రెవెన్యూ గ్రామాలను అప్పగిస్తుండడంతో వీరు సాగిస్తున్న అక్రమాలకు అంతు లేకుండా పోయింది. వెయ్యి రూపాయల నుంచి కేసును బట్టి లక్షల్లో వసూలు చేస్తున్న వీఆర్‌ఓలు కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరు సంపాదించిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి.
భూ బదలాయింపు నుంచి అన్నింటా..
కుటుంబ పెద్ద చనిపోతే విరాసత్ ద్వారా భూమి బదలాయింపు జరపడం అత్యంత సాధారణం. వారసుల్లో ఎలాంటి వివాదాలు లేకపోతే వీఆర్‌ఓ విరాసత్ చేసి తహసీల్దార్ ద్వారా ఆమోదముద్ర వేయిస్తారు. కానీ ఈ ప్రక్రియ జరిపేందుకు అనేక మంది వీఆర్‌ఓలు వేలల్లో లంచం వసూలు చేయడం సర్వసాధారణమైంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సాదాబైనామా, భూ ప్రక్షాళన కార్యక్రమాల్లో కూడా చేతివాటం ప్రదర్శించిన పలువురు వీఆర్‌ఓలకు రూ.లక్షల్లో ముట్టాయి. మంచిర్యాల జిల్లాలోని అసైన్‌మెంట్, సీలింగ్ భూములతోపాటు సర్కారు భూములు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురికాగా, వాటిని తప్పుడు ధ్రువపత్రాలతో సొంతం చేసుకున్న వ్యక్తులు విరాసత్, సాదాబైనామాల ద్వారా అధికారికంగా సొంతం చేసుకునేందుకు వీఆర్‌ఓలే దిక్కయ్యారు. మంచిర్యాల, నస్పూరు, జైపూర్, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ , కోటపల్లి, భీమిని, వేమనపల్లి వంటి మండలాల్లో ఈ తరహా దోపిడీ బాహాటంగానే సాగినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తూ తహసీల్దార్లకే వాటాలు ఇచ్చే స్థాయికి కొన్ని మండలాల వీఆర్‌ఓలు ఎదిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సర్కారు భూముల హాంఫట్‌లో పట్వారీలే కీలకం
జిల్లాలోని నెన్నెల, జైపూర్, మందమర్రి, మంచిర్యాల, భీమారం, చెన్నూరు, బెల్లంపల్లి తదితర మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం వెనుక ఆయా గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలే ప్రధానం. వీఆర్‌ఓల వద్ద ఉండే మాన్యువల్ పహాణీలో మార్పులు చేర్పులు చేయాలన్నా, తహసీల్దార్ ద్వారా ఆన్‌లైన్ పహాణీలోకి పేర్లు ఎక్కాలన్నా వీఆర్‌వోల ద్వారానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సర్కారీ భూములతోపాటు అసైన్డ్, సీలింగ్ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదికి మారడంలో వీరే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. భూముల ధరలు పెరిగిన ప్రాంతాల్లోనే ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో భూ బదలాయింపుల విషయంలోనే వీఆర్‌ఓలు అధికశాతం చేతివాటం ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. మంచిర్యాలలో ఓ కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి భూమాయ చేసిన రమేష్ అనే వీఆర్‌వోను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రమేష్ హయంలో మంచిర్యాల సర్కార్ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి దర్జాగా వెళ్లిపోయాయి.
కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు..
ఆదాయ వనరులు అధికంగా ఉన్న రెవెన్యూ గ్రామంలో ఒక్కసారి వీఆర్‌ఓగా పనిచేస్తే చాలు కోట్లు వెనుకేసుకోవచ్చు అనే వాస్తవం ఇక్కడ పనిచేసిన వారి ఆస్తులు పరిశీలిస్తే అర్థమవుతోంది. మంచిర్యాల పట్టణం పరిధిలోని రెండు రెవెన్యూ గ్రామాలలో పనిచేసిన పట్వారీల ఆస్తులను పరిశీలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఏసీబీకి చిక్కిన ఓ పట్వారీ, ఇటీవల సస్పెండ్ అయి బెల్లంపల్లిలో తిరిగి పోస్టింగ్ పొందిన మరో పట్వారీకి మంచిర్యాల పట్టణంలో రెండు, మూడంతస్తుల భవనాల ద్వారా అద్దెల రూపంలో నెలనెలా ఆదాయం సమకూరుతుంది. మంచిర్యాలలో వీఆర్‌ఓగా పనిచేసి కోట్లల్లో సంపాదించి ప్రస్తుతం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. మంచిర్యాల, హైదరాబాద్‌లలో కూడా ఆయనకు ఆస్తులున్నాయంటే వీఆర్‌ఓ పోస్టింగ్ చలువే.
♦ మంచిర్యాల, ముల్కల్లలో వీఆర్‌ఓగా పనిచేసి ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన ఓ పట్వారీ అక్రమ పట్టాల ద్వారా అడ్డగోలుగా సంపాదించాడు. వీఆర్‌ఓగా ఆయన రిటైర్డ్ అయ్యాక కూడా పక్క మండలంలో కాంట్రాక్టు పద్ధతిన వీఆర్‌వో సహాయకుడిగా పనిచేస్తుండడం గమనార్హం.
♦ నస్పూరులో పనిచేసి పదవీ విరమణ పొందిన మరో పట్వారీ మంచిర్యాల పట్టణంలోనే రూ.2కోట్ల విలువైన భవనాన్ని నిర్మించుకున్నాడు. నస్పూరులోనే వీఆర్‌ఓగా పనిచేసి ప్రస్తుతం గిర్దావరిగా పదోన్నతి పొందిన మరో ఉద్యోగి నస్పూరులోని 48, 21, 21, 23 సర్వే నెంబర్‌లలో జరిపిన అక్రమాలతో కోట్లకు పడగలెత్తాడు.
♦ 324 సర్వే నెంబర్ వివాదంలో సస్పెండ్ అయి బెల్లంపల్లి మండలంలో పనిచేస్తున్న వీఆర్‌ఓకు బినామీ ఆస్తులే రూ.5కోట్ల వరకు ఉన్నట్లు మంచిర్యాలలో రెవెన్యూ వర్గాల సమాచారం.
♦ మందమర్రి, కోటపల్లి మండలాల్లో ఇద్దరు మహిళా వీఆర్‌ఓలు కూడా ధనార్జనలో కొత్త రికార్డులు సృష్టించారు. మందమర్రి మండలంలో పనిచేసి, ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్‌గా ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా వీఆర్‌ఓ ఏకంగా రెండు పెట్రోల్ బంకులనే బినామీ పేర్లతో నడిపిస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ బిల్డర్‌కు బినామీగా ఆస్తులు కూడబెట్టారు. ఇక కోటపల్లి మండలంలో పనిచేస్తున్న మహిళా వీఆర్‌వో సర్వే నెంబర్ 172లో సుమారు 20 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న ఓ వీఆర్‌ఓ భార్యనే ఈమె.
♦ జైపూర్ మండలంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న మరో పట్వారీకి ఇసుక రీచ్‌లకు చెందిన ఫైళ్లు అంటేనే ఇష్టం. ఆయన ఇసుక దందాలు సాగే ప్రాంతాల్లోనే పనిచేసేందుకు ఇష్ట పడుతాడు. సదరు ఉద్యోగి కరీంనగర్ నడిబొడ్డున ఓ లాడ్జింగ్ నిర్వహిస్తుండడం గమనార్హం.
♦ భీమారంలో ఓ మహిళా వీఆర్‌ఓ పట్టాల మ్యుటేషన్‌లో అవినీతికి పెట్టింది పేరు. అలాగే ఇందారంలో శంకర్‌నాయక్ అనే వీఆర్‌ఓ ఏసీపీకి ట్రాప్ అయ్యాడు. నస్పూరులో 37, 38 సర్వే నెంబర్లలో అక్రమంగా పట్టాలిప్పిచ్చిన ఓ వీఆర్‌ఏ వీఆర్‌ఓగా ప్రమోషన్ పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీఆర్‌ఓల అక్రమాలకు మంచిర్యాల జిల్లాలో అంతే లేదు.
Comments
Please login to add a commentAdd a comment