వీఆర్వో షేక్ షలీమా ,పట్టుబడిన వీఆర్వో
విజయనగరం టౌన్: లంచం తీసుకుంటూ ఓ మహిళా వీఆర్వో తాను పనిచేస్తున్న తహసీల్దార్ కార్యాలయంలోనే అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీనికి సంబం ధించి ఏసీబీ డీఎస్పీ షకీలాభాను అందించిన వివరాలిలా ఉన్నాయి. షేక్ షలీమా విజయనగరం మండలం కోరుకొండపాలెం వీఆర్‌ఓగా పనిచేస్తూనే రాకోడు, పినవేమలి క్లస్టర్లకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తోంది. రాకోడు ప్రాంతానికి చెందిన దరిమిరెడ్డి శ్రీను తన తండ్రి సన్నిబాబుకి చెందిన నాలుగున్నర ఎకరాల పొలాన్ని ఆన్‌లైన్ చేసి పాస్‌బుక్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ పత్రాలను పరిశీలించిన వీఆర్వో ఆన్‌లైన్ చేయడంతో పాటు పాస్‌బుక్ ఇవ్వడానికి మొదట రూ.50 వేలు డిమాండ్ చేసింది. చివరకు రూ.20 వేలు ఇస్తేనే పనవుతుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర అంత నగదు లేదని, భూమి వివరాలను ముందు ఆన్‌లైన్ చేయండి ఈ లోగా డబ్బు సర్దుబాటు చేస్తానని బాధితుడు చెప్పినా వీఆర్‌ఓ వినిపించుకోలేదు. డబ్బులిస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బాధితుడు రూ. 20 వేల నగదును వీఆర్‌ఓకు అందజేశాడు. అప్పటికే అక్కడ కాపుకాచిన ఏసీబీ సిబ్బంది ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి , ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డిఎస్పీ షకీలాభాను తెలిపారు.
రెండో కేసు కూడా వీఆర్‌ఓనే..
ఈ మధ్య కాలంలో వీఆర్‌ఓలు వరుసుగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ ఏడాదిలో రెండో కేసు కూడా వీఆర్‌ఓ కావడం విశేషం. 2018 జనవరి 9న వేపాడ వీఆర్వో జగన్నాథం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డాడు. తాజాగా కోరుకొండపాలెం వీఆర్వో షేక్‌షలీమా రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడింది. 2017లో డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన వీఆర్వో అలజంగి ఉషారాణి రూ.35 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది.
Comments
Please login to add a commentAdd a comment