వీఆర్వో కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, అధికారులు
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ నుంచి లంచం తీసుకుంటూ కొయ్యలగూడెం మండలానికి చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పరింపూడి–1 రెవెన్యూ గ్రామ వీఆర్వో అడపా రాంబాబు తన పరిధిలోని 30 సెంట్ల భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి యూనియన్ బ్యాంకు మాజీ మేనేజర్ కోడె శ్రావణ్‌కుమార్‌ను రూ.30 వేలు డిమాండ్ చేశాడు. తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్ తనకు ఆన్‌లైన్‌లో మంజూరైన పాస్‌పుస్తకాలను వీఆర్వో ఇవ్వకుండా తొక్కిపెట్టారని, లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఏసీబీను ఆశ్రయించారు.
దీంతో మంగళవారం రాత్రి వీఆర్వో కార్యాలయానికి శ్రావణ్‌ను రూ.30 వేలు ఇచ్చి పంపగా సొమ్మును వీఆర్వో రాంబాబుకు ముట్టచెబుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు డీఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు. ఏసీబీ సీఐలు శ్రీనివాస్, రవీంద్ర, జె.మురళీకృష్ణ దాడుల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment