స్వాధీనం చేసుకున్న నగదుతో ఏసీబీ అధికారులు, చిత్రంలో వీఆర్వో బెంజిమెన్ (నిలుచున్న వ్యక్తి)
దాచేపల్లి: పాసు పుస్తకాల కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను దాచేపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. గామాలపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కొత్తపల్లి బెంజిమెన్ యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు దగ్గర రూ.4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ సీహెచ్. దేవానంద్ శాంతో, సీఐలు వెంకటేశ్వరరావు, ఫిరోజ్‌లు పట్టుకున్నారు. డీఎస్పీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు తండ్రి మల్లయ్య, భార్య ప్రియాంకల పేరుమీద గామాలపాడు శివారులో ఉన్న 1.70ఎకరాల పొలానికి పాసు పుస్తకాల కోసం వీఆర్వోను ఆశ్రయించారు. గతేడాది ఆక్టోబర్‌లో మీసేవలో ఆయన దరఖాస్తు చేసుకోగా డిసెంబర్‌లో వీరి పేరుమీద పుస్తకాలు వచ్చాయి.
వాటిని ఇవ్వాలంటే ఒక్కోదానికి రూ.3వేల చొప్పున ఇవ్వాలని శ్రీనివాసరావును వీఆర్వో డిమాండ్ చేశాడు. ఒక్కోదానికి రూ.2వేల చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీఆర్వో కు లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీనివాసరావు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. బెంజిమెన్ ఉంటున్న ఇంట్లో శ్రీనివాసరావు నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి ఏసీబీ అధికారులు సేకరించారు. తహసీల్దార్ డి. మల్లికార్జునరావు సంఘటన స్థలానికి వచ్చారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ దేవానాంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment