వీఆర్వో సుధాకర్‌ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో
నెల్లూరు, అల్లూరు: అల్లూరు మండలం గోగులపల్లి వీఆర్వో కె.సుధాకర్‌ను ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిజిటల్ పాసుపుస్తకం కోసం వీఆర్వోను ఆశ్రయించిన రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తెలిపిన వివరాల మేరకు అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన రైతు మల్లికార్జున, అతని తల్లి, తమ్ముడు చెందిన సుమారు ఎనిమిది ఎకరాల 57 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. పాసు పుస్తకాల కోసం గత నెల 10వ తేదీన దరఖాస్తు చేసుకుని అల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వీఆర్వోను కలిశారు.
వీఆర్వో సుధాకర్ ఆ రైతును ఎకరాకు రూ.2 వేల చొప్పున ఖర్చు అవుతుందని చెప్పాడు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్‌లన్నీ సరిగ్గా ఉన్నాయి.. లంచం ఇవ్వలేనని రైతు మల్లికార్జున చెప్పాడు. లంచం ఇవ్వనిదే కాగితం ముందుకు కదలదని వీఆర్వో చెప్పడంతో సదరు విషయాన్ని రైతు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. మంగళవారం రైతు మల్లికార్జున్ నుంచి అల్లూరులోని వాటర్ ట్యాంక్ సెంటర్ రోడ్డులో వీఆర్వో సుధాకర్ రూ.17వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు. అతని నుంచి నగదు రికవరీ చేసి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
లంచం తీసుకుంటే కఠిన చర్యలు
ప్రభుత్వ అధికారులు ఎవరైనా రైతులు, ప్రజల వద్ద నుంచి లంచం డిమాండ్ చేస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 14400కు లేదా ఏసీబీ నెల్లూరు వారికి గాని సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, లంచం తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment