రవాణా శాఖ అటెండర్ లాకర్‌లో బయటపడ్డ బంగారు, వెండి ఆభరణాలు (ఫైల్)
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పైసలివ్వందే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల చేష్టల్లో మార్పురావడం లేదు. అక్రమాలు ఆగడం లేదు. పెద్దఎత్తున దాడులు చేస్తే తప్ప అవినీతి అధికారుల్లో మార్పురాదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
నెల్లూరు(క్రైమ్): కొన్ని ప్రభుత్వ శాఖల్లో లంచం ఇవ్వకపోతే పనిజరిగే పరిస్థితి లేదు. ప్రధానంగా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రెజరీ, ఆర్టీఏ, పోలీసు, ఎక్సైజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ తదితర వాటిల్లో అవినీతి అధికంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది విచ్చలవిడిగా దోచుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులను కూడగడుతున్నారు. అవినీతిలో మునిగితేలుతున్న అధికారులు చట్టానికి చిక్కకుండా వివిధ రూపాల్లో లంచాలు పొందుతున్నారు. ఏసీబీ అధికారుల దాడులు పెరుగుతున్న కొద్దీ కొత్తదారులు వెతుక్కుంటున్నారు. అయితే అవే శాఖల్లో పనిచేస్తున్న చాలామంది అధికారులు, సిబ్బంది సొంత ఇంటికి నోచుకోని వారున్నారు. నీతి నిజాయితీగా, వృత్తే దైవంగా భావించే ఉద్యోగులపై కొందరు అవినీతిపరుల వల్ల మచ్చ పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఏసీబీ దాడులను వేగవంతం చేసి అవినీతి అధికారులను పట్టుకుంటోంది.
సంప్రదిస్తేనే..
వరుస దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల్లో ఎలాంటి మార్పులేదు. ఆర్టీఏ, రెవెన్యూ, మున్సిపాలిటీ, సంక్షేమ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి ద్వారాలు తెరచి ప్రజలనుంచి పెద్దఎత్తున లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపైనే స్పందిస్తారనే ప్రచారం ఉంది. బాధితులు వెళ్లి వారిని సంప్రదిస్తేనే వస్తారు. లేకుంటే వారు ఉదాసీనంగా ఉంటానే అభిప్రాయం అనేకమందిలో ఉంది. నిఘా ఉంచి దాడులు పెంచితే అవినీతికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
ఈ ఏడాదిలో..
♦ ఫిబ్రవరిలో నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
♦ మార్చిలో పొజిషన్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నెల్లూరు మండల సర్వేయర్ ఆదినారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
♦ మేలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టాడనే ఫిర్యాదుల నేపథ్యంలో రవాణా శాఖ అటెండర్ నరసింహారెడ్డి ఇంటిపై అధికారులు దాడులు చేశారు. సుమారు రూ.100 కోట్ల మేర అక్రమాస్తులను గుర్తించారు.
♦ జూన్‌లో కావలి మండలంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసి సుమారు రూ.25 కోట్ల మేర అక్రమాస్తులను గుర్తించారు.
♦ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించి పెద్దఎత్తున అక్రమాలను బయటపెట్టారు.
♦ ఆ శాఖ డీడీ మధుసూదన్‌రావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.10 కోట్ల మేర అక్రమాస్తున్నట్లుగా గుర్తించారు.
♦ సోమవారం కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.56 వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ శాఖలోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏఈ డి.వెంకట్రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం
అవినీతిపరులు, ఆదాయానికి మించిన ఆçస్తులు కలిగిన అధికారులపై సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జాడ్యాన్ని నియంత్రించేందుకు ఏసీబీ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా తమను సంప్రదించాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. కేసు నమోదు చేయడంతోనే సరిపెట్టుకోకుండా బాధితుడి సమస్యను సైతం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. 0861–2331833, డీఎస్పీ 94404 46184, 94404 46186 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అవినీతి అధికారులు తమ పంథాను మార్చుకోవాలి. లేకుంటే ఏసీబీ మీ తలుపులు తట్టి కటకటాల వెనక్కి పంపడం ఖాయం. – సీహెచ్‌డీ శాంతో, ఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment