పట్టుబడిన నగదుతో ఉద్యోగి సయ్యద్ జంషీద్ బాషా (నల్ల చొక్క)
నెల్లూరు, కావలి: కావలి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా మున్సిపల్ లీగల్ అడ్వైజర్ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో కథనం మేరకు.. కావలి మున్సిపాలిటీ తరఫున కోర్టు వ్యవహారాలను చూసుకునేందుకు న్యాయవాది సీహెచ్ రమేష్ 2017 మే నెలలో నియమితులయ్యారు. అతనికి నెలకు రూ.15 వేల జీతంగా చెల్లించడానికి నిర్ణయించారు. అప్పటి నుంచి జీతం ఇవ్వలేదు. జీతం కోసం ఈ ఏడాది జనవరిలో బిల్లులు మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాలయ ప్రక్రియను పూర్తి చేయాల్సిన సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా ఫైల్ బాగాలేదని జీతం ఇవ్వడానికి కుదరదని ఫైల్‌ను తిరస్కరించారు.
ఆ తర్వాత రూ.1.20 లక్షలు లంచంగా ఇస్తేనే ఫైల్‌కు సంంధించిన కార్యాలయ లాంఛనాలు పూర్తి చేస్తానని న్యాయవాదితో బేరానికి దిగాడు. న్యాయవాది జీతం రూ.4.80 లక్షలు కాగా, అందులో 25 శాతం లంచంగా డిమాండ్ చేశాడు. అందుకు న్యాయవాది అంగీకరించడంతో సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా తాను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్‌కు పంపాడు. ఈ నెల 16వ తేదీ న్యాయవాది అకౌంట్‌లో రూ.4.32 జమ అయింది. మధ్యాహ్నం 12 గంటలకు నగదు జమఅయితే, సాయంత్రం 4 గంటలకు న్యాయవాదికి ఉద్యోగి ఫోన్ చేసి తన లంచం నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ ఈ నెల 17వ తేది ఫోన్ చేసి రూ.1.20 లక్షలు లంచంలో రూ.20 తగ్గించుకుని రూ. లక్ష ఇవ్వాలని సూచించాడు. దీంతో న్యాయవాది ఏసీబీకి ఫిర్యాదు చేయగా, బుధవారం లంచం నగదు రూ. లక్ష సయ్యద్ జంషీద్ బాషాకు కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో నేతృత్వంలోని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment