bhesh
-
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
ఏపీలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల అమలు భేష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చిది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీల్లో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిగిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధ్రువీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతినెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ప్రతినెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఈ–సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతినెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతినెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ► సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ► జిల్లాల వారీగా ఏయే అంగన్ వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. ►అవసరమైన మెటీరియల్ సరఫరా చేసారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్‌లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధ్రువీకరిస్తారు. ►ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్థారిస్తారు. -
జగనన్న ఇళ్లలో విద్యుత్ పొదుపు పథకం భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘నవరత్నాలు’లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విద్యుత్ ఆదా చర్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారీ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు విద్యుత్ పొదుపు చేయగల ఉపకరణాలను అందించే ప్రాజెక్టును చేపట్టడాన్ని ఢిల్లీలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ కౌన్సెలర్ డాక్టర్ జోనాథన్ డెమెంగే ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో చేపడుతున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను డెమెంగేకు ఈఈఎస్ఎల్ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వివరించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతో పాటు విద్యుత్ పొదుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను అందించే ప్రయత్నాన్ని డెమెంగే ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి లబ్ధిదారునికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను అందజేయడం వల్ల, ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చంద్రశేఖరరెడ్డి ఆయనకు తెలిపారు. ఫలితంగా ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్ల మిగులుతాయన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని డెమెంగే సూచించారు. గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్లను డెమెంగే అభినందించారు. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని డెమెంగే కోరారు. ఇంధన సామర్థ్య గృహ నిర్మాణ పథకాల వల్ల సామాన్య ప్రజలతో పాటు పర్యావరణానికీ లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మార్గనిర్దేశం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. -
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం భేష్
ఒంగోలు సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం చాలా బాగుందని, ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అస్ట్రేలియా గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ సీఈవో రాక్వెల్ ఫ్రాఫ్ అన్నారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. డీఈవో వీఎస్ సుబ్బారావు, పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(పీఈవో) సోమా సుబ్బారావుతో కలిసి జిల్లాలోని పలు పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం, రామచంద్ర మిషన్‌ను రాక్వెల్ ఫ్రాఫ్ సందర్శించారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి, విద్యార్థులకు అందించిన యూనిఫాం, షూ, పుస్తకాలు, కేరీర్ గైడెన్స్, ఇంగ్లిష్ మీడియంలో బోధన, మార్గదర్శినిపై విద్యాశాఖ చేస్తున్న కసరత్తును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపు సంతరించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. ముందుగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. -
సత్యసాయి వైద్య సేవలు భేష్
= ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తి టౌన్: సత్యసాయి వైద్య సంస్థల్లో రోగులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అభినందించారు. ఆదివారం ఆమె పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ , సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను విభాగాల వారిగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, వాటి నిర్వహణ తీరుపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సిబ్బంది నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సత్యసాయి వైద్య సంస్థల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో ఉచిత వైద్యాన్ని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం ఆమె కొత్తచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్.గురుమూర్తి, వైద్యులు రమేశ్ నాథ్, జగన్నాథం, నాగరాజునాయక్, వైద్య సిబ్బంది కోటేశ్వర్రావు, లింగారామమోహన్, అజీజ్‌ఖాన్ పాల్గొన్నారు.