సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘నవరత్నాలు’లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విద్యుత్ ఆదా చర్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారీ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు విద్యుత్ పొదుపు చేయగల ఉపకరణాలను అందించే ప్రాజెక్టును చేపట్టడాన్ని ఢిల్లీలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ కౌన్సెలర్ డాక్టర్ జోనాథన్ డెమెంగే ప్రశంసించారు.
దక్షిణ భారతదేశంలో చేపడుతున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను డెమెంగేకు ఈఈఎస్‌ఎల్ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వివరించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతో పాటు విద్యుత్ పొదుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)’తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను అందించే ప్రయత్నాన్ని డెమెంగే ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి లబ్ధిదారునికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్‌లను అందజేయడం వల్ల, ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చంద్రశేఖరరెడ్డి ఆయనకు తెలిపారు.
ఫలితంగా ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్ల మిగులుతాయన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని డెమెంగే సూచించారు. గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్‌ఎల్ సీఈవో విశాల్ కపూర్‌లను డెమెంగే అభినందించారు. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని డెమెంగే కోరారు. ఇంధన సామర్థ్య గృహ నిర్మాణ పథకాల వల్ల సామాన్య ప్రజలతో పాటు పర్యావరణానికీ లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మార్గనిర్దేశం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment