LLR
-
లై‘సెన్సు’ తప్పనిసరి.. చాలామంది ఎల్ఎల్ఆర్ వద్దే ఆగిపోతున్నారు
సాక్షి,కర్నూలు: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో వాహనం ఒక భాగం అయిపోయింది. పని ఎటువంటిదైనా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే వారి ఆర్థిక స్థోమత బట్టి ఏదో ఒక వాహనం చేతిలో ఉండాల్సిందే. కరోనా మహమ్మారి అధిక శాతం మంది జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంతో జనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజా రవాణాలైన ఆటోలు, బస్సులు ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. ఎవరికి వారు ఉన్నంతలో సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగిఉండాలి. శాశ్వత లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. తరువాత రవాణా శాఖ కార్యాలయంలో శాశ్వత లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ కోసం ముందుగా కామన్ సర్వీసు కేంద్రాలు, వార్డు, సచివాలయాల్లో స్లాట్ బుక్ చేస్తారు. కుదిరిన తేదికి స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత లైసెన్స్ పొందేందుకు అనుమతి వస్తుంది. కానీ అధిక శాతం మంది ఎల్ఎల్ఆర్తోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎల్ఎల్ఆర్ పొందినవారిలో కనీసం 10 వేల మందికి పైగా శాశ్వత లైసెన్స్ తీసుకోవడం లేదు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి రవాణా శాఖ అధికారులు, పోలీసులకు పట్టుబడితే వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జరిమానాలు పెరిగాయి. కావున ఎల్ఎల్ఆర్ తీసుకున్న వారు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. కరోనాకు ముందు జిల్లాలో ప్రతి రోజూ ఎల్‌ఎల్‌ఆర్‌లు 250, శాశ్విత లైసెన్స్‌లు 250, స్లాట్ బుక్కింగ్‌కు అనుమతించే వారు. కర్ఫ్యూ నిబంధనలు సడలించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల విరామం తరువాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. చలానాలు... ఎల్ఎల్ఆర్ కోసం ద్విచక్ర వాహన చోదకులు రూ. 260, ద్విచక్ర వాహనంతో పాటు కారు లైసెన్స్ కావాలనుకునే వారు రూ.420 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎల్ఎల్ఆర్ పాసైన తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనం కోసమైతే రూ.960, ద్విచక్ర వాహనంతోపాటు కారు అయితే రూ.1260 చలానా చెల్లించాలి. పట్టుబడితే భారీగా అపరాధ రుసుం లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే భారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 1.30 లక్షల రవాణ వాహనాలున్నాయి. వీటి పర్యవేక్షణకు కర్నూలులో ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అక్కడ ఎల్ఎల్ఆర్, శాశ్విత లైసెన్స్‌లు పొందవచ్చు. – రాజ్‌గోపాల్, ఎంవీఐ -
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేసులే..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్ రైడర్‌కు హెల్మెట్ లేకున్నా, వాహనాలకు సైడ్ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్ఎల్ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.. ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్ఎల్ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్ అనే ప్లేట్‌ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్ లైసెన్స్ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కనీసం నెల రోజులు ఎదురు చూడాల్సిందే! కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు అనుమతినిచ్చే ఎల్ఎల్ఆర్ కోసం నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ నిబంధనలదృష్ట్యా పౌరసేవలపై రవాణాశాఖ ఆన్లైన్ స్లాట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులు తమకు కావాల్సిన సేవలను పొందేందుకు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో ఒకట్రెండు రోజుల్లోనే స్లాట్లు లభించేవి. డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసేవలను వినియోగించుకున్నారు. కానీ కోవిడ్ కట్టడికి విధించిన పరిమితుల దృష్ట్యా పడిగాపులు కాయాల్సి వస్తోంది. లెర్నింగ్ లైసెన్సు పొందిన వినియోగదారులు 6 నెలల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. స్లాట్ల కొరత కారణంగా ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సులు పొడిగించుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో పలువురు తమకు ఉన్న అర్హతను కోల్పోవాల్సివస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, గడువు ముగిసిన పర్మనెంట్ లైసెన్సుల రెన్యూవల్ కోసం కూడా ఆన్లైన్లో భారీ ఎత్తున క్యూలో ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ కార్యకలాపాలు మొదలైనప్పటికీ స్లాట్లు పెంచకపోవడం వల్లే డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భారీగా స్లాట్ల కుదింపు.. ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో సాధారణంగా రోజుకు 300 ఎల్ఎల్ఆర్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సైతం ఇంచుమించు అదేస్థాయిలో ఉంటారు. 150 నుంచి 180 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసంస్లాట్లు ఉంటాయి. కానీ.. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గించారు. ఎల్ఎల్ఆర్ స్లాట్లు కేవలం 25 నుంచి 30కే పరిమితం చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో లెర్నింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. ఒక్క ఖైరతాబాద్‌లోనే కాకుండా ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మేడ్చల్.. ఇలా అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్లాట్ల కుదింపుతో లెర్నింగ్ లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ కూడా 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో సాధారణంగా రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు నిర్వహించి లైసెన్సులకు అర్హతను ధ్రువీకరిస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ సైతం 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్‌తో పాటు కొండాపూర్ తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా? లెర్నింగ్ లైసెన్సులకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది నవంబర్‌లో లెర్నింగ్ లైసెన్సు తీసుకున్నవారు ఈ ఏడాది ఏప్రిల్‌లో పర్మనెంట్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావాలి. గత డిసెంబర్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నవారు మే నెలలో శాశ్వత లైసెన్స్ పరీక్షలకు హాజరు కావాలి. స్లాట్లు లభించకపోవడంతో వందలాది మంది తమ లెర్నింగ్ లైసెన్సు అర్హతను కూడా కోల్పోవాల్సివస్తోంది. మరోవైపు కాలపరిమితి దాటిన లెర్నింగ్ లైసెన్సుల గడువు పొడిగించాలన్నా స్లాట్లు లభించకపోవడం సమస్యగానే పరిణమించింది. -
నేటి నుంచి ఎల్ఎల్ఆర్ మేళా !
రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేటి నుంచి 23వ తేదీ వరకు మళ్లీ ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. స్పాట్లో స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ మీరాప్రసాద్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ: రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేసేందుకు మేళాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇ.మీరాప్రసాద్ తెలిపారు. స్పాట్లో ఎల్ఎల్ఆర్ స్లాట్లు బుక్ చేసేందుకు రవాణా శాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మేళాలు నిర్వహించే గ్రామాలు.. ♦ 17న పెనమలూరు మండలం యనమలకుదురు, విజయవాడలోని రామకృష్ణాపురం, 18న కంకిపాడు మండలం తెన్నేరు, మంతెన, 19న జి.కొండూరు మండలం కవులూరు, 20న గన్నవరం, పెనమలూరు, 21న జి.కొండూరు మండలం వెలగలేరు, విజయవాడ రూరల్ మండలం నున్న, 22న గణపవరం, పెనమలూరు మండలం గోసాల, 23న విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు మండలం వెల్లటూరులో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తారు. అర్హతలు ఇవి.. ♦ 18 ఏళ్లు వయస్సు పూర్తయిన సర్టిఫికెట్ ఉండాలి. ♦ ఆధార్ కార్డు జత చేయాలి. ♦ ఒక పాస్‌పోస్టు సైజు పోర్టు అవసరం. ♦ 50ఏళ్లు, ఆపైబడిన వయస్సు ఉన్న వారు ఫారం 1ఏతో మెడికల్ సర్టిఫికెట్ జతచేయాలి. ♦ బైక్, కారులో ఒక దానికి రూ. 260లు, రెండింటికి కలిపి రూ. 410లు ఎల్ఎల్ఆర్ ఫీజు చెల్లించాలి. -
ఎల్ఎల్ఆర్ గాలం!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. నాలుగు ఓట్లు రాలుతాయంటే ఎవరినైనా భయపెడుతున్నారు. ఏ పనైనా చేస్తామంటున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలు కూడా అలాంటివే. మధ్యతరగతి యువతకు ఎల్ఎల్ఆర్ పేరుతో గాలం వేసి తమవైపు తిప్పుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు. అందుకే ఎల్ఎల్ఆర్ మేళా కాస్త ఎన్నికల మేళాలను తలపిస్తున్నాయి. అనంతపురం సెంట్రల్: జిల్లాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్టీఏ అధికారులను ఎన్నికల పావులుగా వాడుకుంటున్నారా? లెసెన్స్ పేరుతో ఓట్ల రాజకీయానికి తెరలేపారా? మధ్య తరగతి యువతను లక్ష్యం చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు? ఇటీవల నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలను చూస్తే అవన్నీ నిజమేననిపిస్తోంది. కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఎక్కువ మంది యువత మోటారు ఫీల్డ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఆటో, ట్యాక్సీ, కారు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. రోడ్డు నిబంధనల ప్రకారం వీరందరికీ లైసెన్స్ కావాలి. మరోవైపు ఇటీవల ద్విచక్రవాహనాల సంఖ్య పెరగడం.. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో లైసెన్స్‌ల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని అందిపుచ్చుకున్న అధికారపార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మేళాలో అన్నీ తామై వ్యవహరించి యువత ఓట్లకు గాలం వేస్తున్నారు. రోజుకు ఆర్టీఏ కార్యాలయంలో 60 మందికి మాత్రమే ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించే ఆర్టీఏ అధికారులు కూడా ఎమ్మెల్యేల వద్ద మెప్పు పొందేందుకు మేళాలు నిర్వహిస్తూ వందల మందికి లెర్నింగ్ లైసెన్స్‌లు ఇచ్చేస్తున్నారు. నిబంధనలకు భయపడి... ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం సామాన్యులకు గగనంగా మారుతోంది. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతున్నారు. అన్నీ దాటుకుని ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కు వెళ్లినా అక్కడ పాసవుతామన్న నమ్మకం లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారపార్టీ నేతలు తమ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇలా గత నెలలో తాడిపత్రిలో 6 రోజులు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి 3,400 మందికి, ఉరవకొండలో ఏకంగా 20 రోజులు నిర్వహించి 10 వేల మంది, ధర్మవరంలో 12 రోజుల పాటు మేళా నిర్వహించి 4వేల మందికి లెర్నింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఆర్టీఏ అధికారులు స్వతహాగా చేసినవి కావు. రాజకీయ ప్రయోజనాలకోసమే.. ఆర్టీఏ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఎల్ఎల్ఆర్ మేళాలో అధికారపార్టీ చోటా నాయకులు హల్చల్ చేస్తున్నారు. తమ నేత చెప్పారు కాబట్టే మేళా ఏర్పాటు చేశారనీ, ఆయన చెప్పినట్లు వింటే లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామంటూ అక్కడకొచ్చిన యువతకు చెబుతున్నారు. పరోక్షంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఆర్టీఏ అధికారుల వింత వైఖరి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నెలన్నర తర్వాత స్లాట్ బుక్ అవుతోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో ఎల్ఎల్ఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రోజుకు 60 మందికి మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా వాహనదారుడు దరఖాస్తు చేసుకున్న నెలన్నర, రెండు నెలలకు అవకాశం వస్తోంది. ఆ సమయంలో అధికారులు ఫెయిల్ చేస్తే మరో రెండు నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్న మేళాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడైతే ఇదే ఆర్టీఏ అధికారులు రోజులు వందల సంఖ్యలో లెర్నింగ్ లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్తే మాత్రం చుక్కలు చూపుతున్నారు. అందువల్లే ఈ మేళాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందుకే నేతలంతా ఒకటికి రెండు సార్లు తమ నియోజకవర్గాల్లో ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించాలని ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. డిమాండ్ ఉన్న చోట నిర్వహిస్తున్నాం అందరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉండాలనే ఉద్దేశంతోనే మేళాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజాప్రతినిధులు అడిగచోట్ల కూడా మేళాలు నిర్వహిస్తున్నాం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. ప్రజల నుంచే వ్యక్తిగతంగా చలానా మొత్తాలను స్వీకరిస్తున్నాం. ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తున్నాం. – సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్ -
ప్రజల వద్దకే ఎల్ఎల్ఆర్ టెస్ట్
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎల్ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్ఎల్ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. -
లెర్నింగ్ లైసెన్సా.. అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు వాహన వినియోగదారులను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కఠినమైన, తార్కికమైన ప్రశ్నలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే క్షణాల్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తుండగా నేరుగా వచ్చేవారు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు అవసరమైన సాధారణ పరిజ్ఞానం మేరకు వినియోగదారుల అవగాహనను అంచనా వేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా గందరగోళాన్ని సృష్టించే ప్రశ్నలతోనే ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా వచ్చేవారిని ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి గురి చేసి ఫెయిల్ చేస్తూ తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో రవాణాశాఖలో అన్ని రకాల పౌరసేవలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినా ఏజెంట్లు లేకుండా ఎలాంటి పనులు కావడం లేదు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపైనే లెర్నింగ్ లైసెన్స్ ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్ధులను తికమకపెట్టేలా ఉంటున్నాయి. దీంతో చాలామంది మొదటిసారి సరైన సమాధానాలను ఎంపిక చేయలేక ఫెయిల్ అవుతున్నారు. చివరకు ఏజెంట్లను ఆశ్రయించి రెండోసారి పాస్ అవుతున్నారు. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ సుమారు 1500 మంది లెర్నింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరవుతుండగా వారిలో సగటున 350 నుంచి 400 మంది ఫెయిల్ అవుతున్నారు. వీరందరూ దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చేవాళ్లే కావడం గమనార్హం. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి... శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునేందుకు రవాణాశాఖ అందజేసే లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకొని, అన్ని రోడ్లపైన వాహనాలను నడిపేందుకు అనుభవాన్ని గడించాలి. అప్పుడు మరోసారి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ క్రమంలో లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు సిగ్నల్స్, రూల్స్ అండ్ రోడ్ రెగ్యులేషన్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, తదితర అంశాలపై ఈ ప్రశ్నలను రూపొందించారు. ఈ కేటగిరీల్లో మొత్తం 450 వరకు ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్‌ను రవాణాశాఖ సిద్ధం చేసింది. ఈ క్వశ్చన్బ్యాంకు నుంచే అభ్యర్ధుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఇందు లో కొన్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ‘సూర్యోదయానికి ముందు, తరు వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్ ఎలా ఉండాలి’. సాధారణంగా దీనికి ప్రతి ఒక్కరు ‘లైటు వెలిగించుకొని’ బం డి నడపాలనే భావిస్తారు. కానీ లైట్ లో భీమ్‌లో ఉండాలనేది సమాధానం. అలాగే రోడ్డు మీద గుంతల్లో నీళ్లు చిమ్ముతూ బండి నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలు ఏ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ’వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది’ వంటి లెర్నర్కు సంబంధం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమయాభావ సమస్యే... లెర్నింగ్ లైసెన్సు కోసం నిర్వహించే ఆన్లైన్ టెస్ట్‌లో 20 ప్రశ్నలకు సరైన జవాబులను ఎంపిక చేసేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు అరనిమిషం వ్యవధి లో సమాధానం గుర్తించాలి. అభ్యర్ధులు కనీసం 12 ప్రశ్నల కు సరైన సమాధానం గుర్తిస్తే చాలు. ఉత్తీర్ణులైనట్లుగా భావి ంచి లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో వాహ నం నేర్చుకొనేందుకు అనుమతి లభిస్తుంది. అయితే చాలామం ది అభ్యర్ధులు సరైన జవాబులు గుర్తించేందుకు సమ యం చాలడం లేదని అభిప్రాయపడుతున్నారు. ‘‘స్క్రీన్‌పై ఒక ప్రశ్నను చదివి అర్ధం చేసుకొని జవాబును గుర్తించే లోపే మరో ప్రశ్న ముందుంటుంది. దీంతో గందరగోళానికి గురవుతున్నాం.’’ అని మోతీనగర్‌కు చెందిన సంపత్ పేర్కొన్నా రు. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సమయాన్ని 15 నిమిషాలకు పెంచాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఒక్కసారి చదువుకొని వస్తే చాలు.. చాలామంది ఒక్కసారైనా ప్రశ్నావళిని చూడకుండానే నేరుగా పరీక్షకు హాజరవుతున్నారని, దాంతో వారికి ఆ ప్రశ్నలు కఠినంగా కనిపిస్తున్నాయని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో తెలిపారు. ‘ కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట నిజమే. గతంలో ఒక కమిటీ వేసి చాలా వరకు సరళీకరించాం. మార్పులు, చేర్పులు చేశాము. 827 ప్రశ్నలను సగానికి కుదించాము. క్వశ్చన్ బ్యాంకు ప్రింటెడ్ బుక్స్ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉన్నాయి. రవాణాశాఖ వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్లో మాక్ టెస్ట్‌కు కూడా హాజరు కావచ్చు. ఎలాంటి కసరత్తు లేకుండా, సన్నద్ధత లేకుండా వచ్చేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ’’ అని చెప్పారు. సరైన సమాధానాలను గుర్తించిన తరువాత ఫెయిల్ చేయడమంటూ ఉండదన్నారు. -
రేపు మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా
కర్నూలు: అంతర్జాతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీళ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు జిల్లాలో మూడు విడతలుగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. కార్మికుల నుంచి భారీ స్పందన రావడంతో మహిళలకు కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల కోసం 8వ తేదీ ప్రత్యేకంగా స్లాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. -
నేడు కర్నూలులో ఎల్ఎల్ఆర్ మేళా
కర్నూలు: రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఆటోడ్రైవర్లకు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించనున్నట్లు డీటీసీ ప్రమీల శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తామన్నారు. ఆటో కార్మికుల నుంచి భారీ స్పందన లభించడంతో గత ఆదివారం కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని కార్యాలయాల్లోనూ ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఆటో రిక్షా ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ కోసం కొన్నేళ్లుగా కార్మికులు ఎదురు చూస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ పొందాలంటే కనీసం 8వ తరగతి చదివి ఉండాలనే నిబంధన ఉండేది. ఈ విధానాన్ని తొలగిస్తూ చదువుతో నిమిత్తం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని లైసెన్సులు జారీ చేయాలని ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడత ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో, రెండవ విడత 19వ తేదీ కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల కార్యాలయాల్లో ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ మేళా నిర్వహించారు. దాదాపు 1200 మందికి పైగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశారు. డీటీసీ ప్రమీల పర్యవేక్షణలో ఆదివారం కూడా కర్నూలు కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ మేళా కొనసాగనుంది. ఆటో కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికెట్తో కార్యాలయానికి వచ్చిన ప్రతి ఆటో కార్మికుడికి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని లైసెన్స్ జారీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
వాహనదారులపై రవాణా బాదుడు
భారీగా ఫీజులు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపైనా వడ్డన విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం ప్రజల నెత్తిన మరోభారం మోపింది. రవాణా శాఖలో నిర్వహించే వివిధ పనులకు సంబంధించి చార్జీలను అమాంతం పెంచేసింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు.. డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. పెరుగుదల వివరాలు.. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసిన వారి నుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం రూ.90 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.260కు పెంచారు. ఇది టూవీలర్ ఎల్‌ఎల్‌ఆర్‌కు మాత్రమే. అదనంగా ఫోర్ వీలర్‌కు గానీ, ఆటోరిక్షాకు గానీ ఎల్ఎల్ఆర్ కావాలంటే.. ఒక్కోదానికీ రూ.150 చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్సు ఫీజు రూ.550 ఉండేది. దాన్ని రూ.960కి పెంచారు. లైసెన్సు రెన్యువల్‌కు రూ.485 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660కి పెంచారు. చిరునామా మార్పునకు గతంలో రూ.560 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660 మొత్తానికి పెంచారు. అదేవిధంగా ఎండార్స్‌మెంట్‌కు గతంలో రూ.560ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1260కుపెంచారు. టూవీలర్ రిజిస్ట్రేషన్‌కు గతంలో రూ.445 ఉంటే.. దాన్ని రూ.685 కు పెంచారు. కారుకు గతంలో రూ.735 ఉంటే దాన్ని ఇప్పుడు 1135కు పెంచారు. వాహనాన్ని బదిలీ చేయడానికి గతంలో టూవీలర్‌కు రూ.410 ఉంటే.. ఇప్పుడు అది రూ.535కు పెరిగింది. కారుకు గతంలో రూ.635ఉంటే ఇప్పుడు రూ.835కు పెరిగింది. ఏడాదికి రూ.80 కోట్ల మేర అదనపు భారం ప్రభుత్వం రవాణా చార్జీలు పెంచడం వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.కోట్లలో భారం పడనుంది. అన్ని రకాల సేవలు ఫీజులు, చార్జీలు పెరగడం వల్ల ఏడాదికి అదనంగా సుమారు రూ.80 కోట్ల వరకు భారం పడనుంది. -
డ్రైవింగ్ లెసైన్స్
అనంతపురం టౌన్ : టూవీలర్, ఫోర్ వీలర్లు నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే. దీనికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. 16 సంవత్సరాలు నిండిన వారు గేర్లు లేని (55 సీసీ లోపు సామర్థ్యం కలిగిన వాహనాలు) మోపెడ్లు నడిపేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే.. లెర్నింగ్ లెసైన్స్ కావాలనుకునే వారు .aptransport.gov.in బ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లెసైన్స్ ఎవరికి కావాలో వారి చిరునామాకు సమీపంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందే అనుమతి లభిస్తుంది. లేదంటే దాని పరిధిలోని కార్యాలయాల్లో తీసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ-సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి. టూ వీలర్, ఫోర్ వీలర్లలో ఏదైనా ఒక దాని కోసం రూ.90, రెండూ కావాలనుకుంటే రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. స్లాట్ తీసుకున్న 24 గంటల్లోగా ఫీజు చెల్లించకపోతే అది రద్దయిపోతుంది. స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయాన్ని అనుసరించి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి. ఇదే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, చిరునామా పత్రాలు వెంట తీసుకెళ్లాలి. లెర్నింగ్ లెసైన్స్ పరీక్షలో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత నియమాలపై 20 ప్రశ్నలుంటాయి. వాటిలో కనీసం 16 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానం గుర్తించాలి. పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ ఇస్తారు. అయితే ఇది కేవలం ఆరు నెలల వరకే చెల్లుబాటు అవుతుంది. ఎల్ఎల్ఆర్ పొందిన 30 రోజుల తర్వాత, దాని గడువు ముగిసేలోగా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందవచ్చు. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లెసైన్స్ 18 ఏళ్లకే పొందినప్పటికీ, ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ పొందేందుకు కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్స్ పొందవచ్చు. శాశ్వత లెసైన్స్ కోసం.. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునే వారు కూడా ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ-సేవ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో గానీ రూ.550 నుంచి రూ.650 ఫీజు చెల్లించాలి. ఆర్టీఏ కార్యాలయాల టెస్ట్ ట్రాక్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడపాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలో వాహనదారులు నైపుణ్యంతో వ్యవహరిస్తే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. పోస్టు ద్వారా లెసైన్స్ మీ చిరునామాకు చేరుతుంది. పూర్తి వివరాల కోసం అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. -
రవాణా శాఖ రాంగ్‌రూట్
సాక్షి, కర్నూలు: రవాణా శాఖ పరిధిలో ఏజెంట్ల వ్యవస్థను ఏనాడో రద్దు చేశారు. వీరి ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా కార్యాలయానికి వెళ్లి సేవలు పొందే వీలు కల్పించారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించారు. ఇంకేముంది.. మన పని సులువేననుకుంటే పొరపాటు. కార్యాలయం గేటు వద్దకు చేరుకోగానే ఏజెంట్ల వ్యవస్థ ఎంతలా వేళ్లూనుకుందో ఇట్టే అర్థమవుతుంది. వాళ్లను పట్టించుకోకుండా లోనికి వెళితే అక్కడో మాయాలోకం కనిపిస్తుంది. ఎవరు ఏమిటో.. ఏది ఎక్కడో.. ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. డబ్బు ముట్టనిదే ఇక్కడ పని జరగని పరిస్థితి. లేదంటే ఎక్కడ లేని నిబంధనలు గుర్తొస్తాయి. ఏజెంట్ల ద్వారా వెళితే మీ పని క్షణాల్లో జరిగిపోతుంది. ఎల్ఎల్ఆర్ పొందేందుకు కంప్యూటర్‌పై పరీక్ష నిర్వహిస్తున్నారు. తెరపై కనిపించే 20 ప్రశ్నలకు పది నిమిషాల్లో అభ్యర్థులు సమాధానాలను టిక్ చేయాల్సి ఉంటుంది. వీటిలో 12 సరైన సమాధానాలు సూచించగలిగితే ఉత్తీర్ణత సాధించినట్లు.. అంతకు తగ్గితే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారు. కర్నూలులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిరోజూ సగటున 75 నుంచి 100 మంది వరకు ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. లెర్నింగ్ లెసైన్స్ పొందడానికి దరఖాస్తు రుసుము ద్విచక్ర వాహనానికైతే రూ.60, కారుతో కలిపి తీసుకోవాలంటే రూ. 90 చెల్లించాలి. నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకునే వారికి ఖర్చయ్యేది ఈ రుసుము మాత్రమే. కార్యాలయం బయట ఉండే ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. వీరి ద్వారా వెళ్లే ప్రతి దరఖాస్తుకు కార్యాలయంలోని సిబ్బందికి వాటాలు వెళ్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ఫైళ్లే చకాచకా కదిలిపోతాయన్నది లెసైన్స్ కోసం వెళ్లిన వారికి తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఏజెంట్లను ప్రత్యేకంగా నియమించుకున్నారు. నేరుగా వెళితే కొర్రీలు వేసి తిప్పి పంపుతున్నారు. గత వారం రోజుల్లోనే లెసైన్స్‌లకు సంబంధించి దాదాపు 300 ఫైళ్లు పెండింగ్‌లో ఉండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. హెల్మెట్ బిల్లు సరిగా లేదనో.. మెడికల్ సర్టిఫికెట్ ప్రభుత్వాస్పత్రి నుంచి తీసుకురాలేదనో.. పాన్‌కార్డుల్లో ఫొటో సరిగా కనబడలేదనో.. కార్లకు స్టిక్కర్ వేయించలేదనో.. అడ్రస్ ప్రూఫ్ సరిగా లేదనే సాకులతో దరఖాస్తులను తిరస్కరించడం కార్యాలయంలో పరిపాటిగా మారింది. ఈ విషయమై ‘సాక్షి’ ఉప రవాణాశాఖాధికారి శివరామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు ఒరిజినల్స్‌తో రావాలని తెలిపారు. జిరాక్స్‌లను అనుమతించబోమన్నారు. ఒకవేళ పక్కాగా దరఖాస్తు చేసినా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాంటి వారిపై అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.