సాక్షి, కర్నూలు: రవాణా శాఖ పరిధిలో ఏజెంట్ల వ్యవస్థను ఏనాడో రద్దు చేశారు. వీరి ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా కార్యాలయానికి వెళ్లి సేవలు పొందే వీలు కల్పించారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించారు. ఇంకేముంది.. మన పని సులువేననుకుంటే పొరపాటు. కార్యాలయం గేటు వద్దకు చేరుకోగానే ఏజెంట్ల వ్యవస్థ ఎంతలా వేళ్లూనుకుందో ఇట్టే అర్థమవుతుంది. వాళ్లను పట్టించుకోకుండా లోనికి వెళితే అక్కడో మాయాలోకం కనిపిస్తుంది. ఎవరు ఏమిటో.. ఏది ఎక్కడో.. ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. డబ్బు ముట్టనిదే ఇక్కడ పని జరగని పరిస్థితి. లేదంటే ఎక్కడ లేని నిబంధనలు గుర్తొస్తాయి. ఏజెంట్ల ద్వారా వెళితే మీ పని క్షణాల్లో జరిగిపోతుంది.
ఎల్‌ఎల్‌ఆర్ పొందేందుకు కంప్యూటర్‌పై పరీక్ష నిర్వహిస్తున్నారు. తెరపై కనిపించే 20 ప్రశ్నలకు పది నిమిషాల్లో అభ్యర్థులు సమాధానాలను టిక్ చేయాల్సి ఉంటుంది. వీటిలో 12 సరైన సమాధానాలు సూచించగలిగితే ఉత్తీర్ణత సాధించినట్లు.. అంతకు తగ్గితే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారు. కర్నూలులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిరోజూ సగటున 75 నుంచి 100 మంది వరకు ఎల్‌ఎల్‌ఆర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. లెర్నింగ్ లెసైన్స్ పొందడానికి దరఖాస్తు రుసుము ద్విచక్ర వాహనానికైతే రూ.60, కారుతో కలిపి తీసుకోవాలంటే రూ. 90 చెల్లించాలి. నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకునే వారికి ఖర్చయ్యేది ఈ రుసుము మాత్రమే. కార్యాలయం బయట ఉండే ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. వీరి ద్వారా వెళ్లే ప్రతి దరఖాస్తుకు కార్యాలయంలోని సిబ్బందికి వాటాలు వెళ్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి ఫైళ్లే చకాచకా కదిలిపోతాయన్నది లెసైన్స్ కోసం వెళ్లిన వారికి తెలియనిది కాదు.
ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఏజెంట్లను ప్రత్యేకంగా నియమించుకున్నారు. నేరుగా వెళితే కొర్రీలు వేసి తిప్పి పంపుతున్నారు. గత వారం రోజుల్లోనే లెసైన్స్‌లకు సంబంధించి దాదాపు 300 ఫైళ్లు పెండింగ్‌లో ఉండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. హెల్మెట్ బిల్లు సరిగా లేదనో.. మెడికల్ సర్టిఫికెట్ ప్రభుత్వాస్పత్రి నుంచి తీసుకురాలేదనో.. పాన్‌కార్డుల్లో ఫొటో సరిగా కనబడలేదనో.. కార్లకు స్టిక్కర్ వేయించలేదనో.. అడ్రస్ ప్రూఫ్ సరిగా లేదనే సాకులతో దరఖాస్తులను తిరస్కరించడం కార్యాలయంలో పరిపాటిగా మారింది. ఈ విషయమై ‘సాక్షి’ ఉప రవాణాశాఖాధికారి శివరామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు ఒరిజినల్స్‌తో రావాలని తెలిపారు. జిరాక్స్‌లను అనుమతించబోమన్నారు. ఒకవేళ పక్కాగా దరఖాస్తు చేసినా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాంటి వారిపై అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రవాణా శాఖ రాంగ్‌రూట్
Published Sat, Dec 21 2013 2:19 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement